రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా?

• కరడుగట్టిన చట్టాలున్న దేశాల్లో బతకొచ్చు.. ఇక్కడ బతకలేని పరిస్థితులు కల్పించారు
• కౌన్సిలర్ కూడా బెదిరించేస్తాడు
• అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు
• మన దేశంలో మనకున్న స్వేచ్ఛ కోల్పోకూడదన్నదే నా లక్ష్యం
• రూల్స్ పాటించాలి.. అన్యాయం జరుగుతున్నప్పుడు బలంగా ఎదిరించాలి
• అలాంటి రాజకీయ వ్యవస్థను తీసుకురావాలన్నదే నా లక్ష్యం
• విదేశాల్లో ఉన్నవారంతా తిరిగి స్వదేశానికి వచ్చే పరిస్థితులు కల్పించాలి
• ఎన్ఆర్ఐ జనసేన గల్ఫ్ విభాగం సభ్యులతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
• పార్టీకి రూ. కోటి విరాళం అందచేసిన ఎన్ఆర్ఐ గల్ఫ్ విభాగం

‘కరడుగట్టిన, కఠిన చట్టాలు ఉండే గల్ఫ్ దేశాలకు వెళ్లి బతకగలం.. మన దేశంలో మాత్రం బతకడానికి ఇబ్బందిపడే పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది లేదు.. అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు.. ఇలాంటి పరిస్థితుల మధ్య రూల్స్ పాటిస్తూ అన్యాయం జరుగుతున్నప్పుడు బలంగా ఎదిరించే బలమైన రాజకీయ వ్యవస్థను తీసుకురావాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నామ’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో దౌర్జన్యం, రౌడీయిజం చేయగలిగిన వాడే రాజకీయ నాయకుడు అన్నట్టు పరిస్థితి తయారైంది. కుల దూషణలు చేసే వారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారే రాజకీయ నాయకులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించి ఒక తరం కోసం నా ఆఖరి శ్వాస వరకు నా నేల కోసం పని చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. శనివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ గల్ఫ్ విభాగం సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆరు గల్ఫ్ దేశాలకు చెందిన ఎన్ఆర్ఐ జన సైనికులు పార్టీకి రూ. కోటి విరాళం అందచేశారు. కౌలు రైతు భరోసా యాత్ర నిమిత్తం మరో రూ. లక్షా 10 వేల చెక్కును పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “జనసేనకు ఎన్ఆర్ఐ విభాగం మద్దతు అవసరం. మీరిచ్చే మద్దతును బాధ్యత, జవాబుదారీతనంతో ముందుకు తీసుకువెళ్తాం. ఎక్కడో గల్ఫ్ దేశాలకు వెళ్లి మీరు ప్రశాంతంగా బతకగలుగుతున్నారు. ఇక్కడ ఆ పరిస్థితులు లేవు. రాజంపేట నియోజకవర్గం, సుండుపల్లికి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ గారు సర్పంచ్ అభ్యర్ధిగా బరిలోకి దిగినందుకు ఆయనకున్న 3 ఎకరాల 20 సెంట్ల భూమిని బలవంతంగా లాగేసుకున్నారు. మన దేశంలో బతకడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి. చెప్పుకోవాలంటే తెలిసిన పోలీసు అధికారి అయినా ఉండాలి.. లేదా ఎమ్మెల్యే సొంత కులపోడు అయినా ఉండాలి. ఇక్కడ రాజకీయాల్లో కౌన్సిలర్ కూడా బెదిరించేస్తాడు. గల్ఫ్ దేశాల్లో బతకగలిగిన మనం మన దేశంలో ఎందుకు బతకలేము? ఏ మతం అయినా.. ఏ కులం అయితే ఏంటి? నా తరఫున సమాజానికి నేను ఏమివ్వగలను అన్న ఆలోచనల నుంచే పార్టీ స్థాపించా. సంపాదన కోసం విదేశాలకు వెళ్లిన మీరు తిరిగి స్వదేశానికి వచ్చేలా ఇక్కడ పరిస్థితులు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితులు తీసుకురావడమే నా లక్ష్యం.
• మన ఊళ్ళో మనం పరాయివాళ్ళం కారాదు
పరాయిదేశం ఎప్పటికైనా పరాయిదేశమే. మన నేల మన గ్రామాల్లో మనం పరాయివాళ్లం కాకూడదు. నా మటుకు నాకు ఒక రాజకీయ పార్టీ తాలూకు లక్ష్యం రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని కాపాడుకోవడమే. ఇక్కడ ధైర్యంగా ముందుకు వెళ్లకపోతే ప్రతి ఒక్కరు దోచేస్తారు. మన దేశంలో స్వేచ్ఛ ఉంటుంది. అది కోల్పోకూడదు. నా నేల కోసం నేను చేయాలనుకున్నది అదే. ఆ లక్ష్యంతోనే పదేళ్ల పాటు పార్టీని నిర్మించుకున్నా. ఒక బాధ్యతతో.. చాలా ఇష్టంతో ఇక్కడికి వచ్చా. ఇల్లు, బాధ్యతలు, అక్కడ ఏర్పరుచుకున్న అత్యున్నత జీవితాన్ని వదులుకుని ఇక్కడికి వచ్చా. తెలంగాణ సాధన పోరాటంలో 3 వేల మంది యువత బలిదానాలు చేసుకున్నారు. వారి బలిదానాల తాలూకు లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఆంధ్రప్రదేశ్ బాగుపడితే తప్ప ఆ బలిదానాల తాలూకు లక్ష్యం నెరవేరదు. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతుందన్న వాదనే రాష్ట్ర విభజనకు కారణం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం అంతా హైదరాబాద్ వలసలు పోతుంటే ఉపయోగం ఏముంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణకు చాలా అవసరం. అలాగే ప్రస్తుతం తెలంగాణలో పోటీ చేయడం నా ప్రయారిటీ. అయితే అక్కడ అంచెలంచెలుగా బలాన్ని సాదిద్ధాం.
• అవినీతిరహిత రాజకీయాలు నా లక్ష్యం
అవినీతిరహిత రాజకీయాలు నా లక్ష్యం. రాజకీయాల్లో నుంచి ఉన్న పళంగా కరప్షన్ ని పారదోలి అద్భుతాలు చేస్తానని చెప్పను. అవినీతి రహిత రాజకీయాలు అనే అంశాన్ని ఓ నిరంతర ప్రక్రియగా ముందుకు తీసుకువెళ్తాం. రూల్ ఆఫ్ లా అందరికీ సమంగా ఉంటేనే అభివృద్ధి బలంగా ఉంటుంది. దాన్ని నేను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తా. నా వరకు మీ నుంచి ఏమీ ఆశించను. కులం, మతం, ప్రాంతం దాటి ఒక భారతీయుడిగా బాధ్యత తీసుకోవాలని మాత్రమే అనుకున్నా. ఎన్జీవో స్థాపిస్తే కొన్ని వందల మందికి మాత్రమే న్యాయం చేయగలను. అందరికీ న్యాయం చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చా. విదేశాలకు వెళ్లి ఒక హోటల్ స్థాపించడం తేలిక.. అదే ఇక్కడ పెట్టాలంటే వంద రూల్స్ అడ్డొస్తాయి. రూల్ ఆఫ్ లా బలంగా ఉంటే అభివృద్ధి బలంగా ఉంటుంది. సగటు భారతీయుడిగా ఆ బాధ్యత నేను స్వీకరించాను. మీ అందరి అభిమానం.. ప్రజాబలం సాధించిన ధనవంతుడిని నేను. ఒక్క ఎన్నికల కోసం మీ మద్దతు అన్నట్టు చూడకండి. పదేళ్లుగా నిలబడి ఉన్నా. ఒడిదుడుకులు ఉన్నా 100 శాతం గుర్తింపు వస్తుంది. మన నిబద్దత చూసే ఎన్డీఏ సమావేశంలో బలమైన గుర్తింపు దక్కింది. ఒక బలమైన సమూహం నా వెనుక ఉందని ఇంత గౌరవం ఇస్తున్నారు.
• ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలంగా నిలబడతా..
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. అదే సమయంలో భిన్నాభిప్రాయాలు అవసరం. జనసేనకు మద్దతు ఇచ్చే వారు బలంగా పోరాడగలిగే వారు అయ్యి ఉండాలి. లేకపోతే మనల్ని బతకనివ్వరు. విదేశాల్లో ఉన్న సౌకర్యాలు, రూల్ ఆఫ్ లా ఇక్కడికి తీసుకురావాలి. ఒక దశాబ్దం నా వెనుక ఉండండి. ఆంధప్రదేశ్ అభివృద్ధి కోసం నేను నిలబడతా. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా లోతుగా ఆలోచించి తీసుకుంటా. తప్పుడు నిర్ణయాలు తీసుకోను. ఒక కులాన్నో, మతాన్నో వెనకేసుకురాను. రూల్ ఆఫ్ లా ఖచ్చితంగా పాటిస్తాను. అందరికీ న్యాయం జరగాలంటే రాజ్యాంగాన్ని నమ్మాలి. నా వరకు నేను రాజ్యాంగ విలువల్ని బలంగా పాటిస్తాను. ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకు వెళ్లండి. కేసులు పెడితే పోరాడుదాం. మనకి బలమైన లీగల్ విభాగం ఉంది. పార్టీ నుంచి అందరికీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. న్యాయపరమైన మద్దతు ఇస్తాను. మనకు అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తే హక్కు మనకు ఉంది. మన హక్కుల్ని కాలరాస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు. మీ వెంట నేను నిలబడతాను” అన్నారు. ఇటీవల పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు గల్ఫ్ దేశాల్లో పర్యటించి ఎన్ఆర్ఐ జన సైనికులతో నిర్వహించిన సమావేశాల్లో పార్టీ ఉన్నతికి బాసటగా నిలవాలని కోరిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో గల్ఫ్ జన సైనికులు కేసరి త్రిమూర్తులు, చందక రాందాస్, కంచన శ్రీకాంత్ తదితరుల ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాల ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శశిధర్ కొలికొండ పాల్గొన్నారు.