ప్రజలంటే భయపడే ఈ ముఖ్యమంత్రికి పాలించే అర్హత ఉందా?

* పెన్నులు, చున్నీలకు సీఎం భయపడడం హాస్యాస్పదం
* ఎన్నడూ పైసా సాయం చేయని వ్యక్తా మనల్ని విమర్శించేది?
* జనసేనపై పెరుగుతున్న ఆదరణ చూసే ముఖ్యమంత్రికి వణుకు
* ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నాయకులు లూటీ చేశారు
* ఉత్తరాంధ్ర ప్రజానీకానికి వలసలు మిగిల్చారు
* గజపతినగరం సమీక్ష సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘జీవితంలో తన జేబులో నుంచి పైసా తీసి సాయం చేయని ఈ ముఖ్యమంత్రి జనసేన పార్టీకి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా… ఈ అసమర్ధ ముఖ్యమంత్రిని ఎప్పుడు ఇంటికి పంపిద్దామా అని ప్రజలంతా వేచి చూస్తున్నార’ని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నియోజకవర్గాల సమీక్షల్లో భాగంగా బుధవారం ఉదయం 

గజపతినగరం నియోజకవర్గ సమీక్ష సమావేశం శ్రీ మనోహర్ గారు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వారు వీరు అని కాదు ఉత్తరాంధ్రను ఇప్పటి వరకు వచ్చిన నాయకులంతా పూర్తిగా దోచేశారు. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో దిగ్విజయంగా పూర్తి చేసిన జనవాణి కార్యక్రమం ఉత్తరాంధ్రలో జరగనీయకుండా చేయడం వెనక కూడా పెద్ద కుట్ర ఉంది. ఉత్తరాంధ్రలో క్షేత్రస్థాయి సమస్యలను జనవాణి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ప్రజలు తీసుకువస్తారనే భయంతోనే కార్యక్రమం జరగనివ్వకుండా ఆపేశారు. ఉత్తరాంధ్రలోని సహజ వనరులతో పాటు, ఇక్కడ ఉన్న అద్భుతమైన నిక్షేపాలను నాయకులు పంచేసుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను మాత్రం వలస జీవులుగా చేశారు. దేశ రక్షణలోనూ ముందుండే ఉత్తరాంధ్ర యువతరాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ పాలకులు ఆలోచిస్తున్నారు. ప్రజలంటే భయపడే ముఖ్యమంత్రికి పాలించే అర్హత ఉందా? భయపడుతూ పాలన చేసే ఇతను పెన్నులు, చున్నీలు లాక్కుంటున్నాడు. మహిళలను అవమానపరుస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాడు.
* జనసేన ఉంటే అక్రమార్కుల ఆటలు సాగవు
జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు కోవిడ్ సమయంలోనూ ఆగలేదు. నిరంతరం ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను విపత్తు కాలంలోనూ పంచుకున్నాం. వారికి అండగా నిలిచాం. కోవిడ్ సమయంలో ఆ విపత్తు కోసం వచ్చిన సొమ్మును అందిన కాడికి దోచుకున్న వైసీపీ పార్టీకి, బాధితులకు అండగా నిలిచిన జనసేన పార్టీకి చాలా తేడా ఉంది. జనసేన పార్టీ ఉంటే ఈ అక్రమార్కుల ఆటలు చెల్లవని భావించే, జనసేనను ఎదగకుండా రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. వాటిని జన సైనికులు సమష్టిగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. కష్ట సమయంలో కార్యకర్త కుటుంబాన్ని నిజాయతీగా ఆదుకునే పార్టీ జనసేన మాత్రమే. ఎలాంటి స్వార్థం లేకుండా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్న పెద్ద మనుసు జనసేన పార్టీకి మాత్రమే ఉంది. పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు ఎంతగా తోడుంటారో, రాష్ట్రానికి అంతకన్నా తోడు నిలిచేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు.
* నాయకత్వం అంటే శాసించడం కాదు
ఉత్తరాంధ్రలో ప్రతి నియోజకవర్గంలోనూ క్షేత్రస్థాయిలో యువ నాయకత్వం పెంచాలి అన్నది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఉత్తరాంధ్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై అశేష అభిమానం ఉన్న యువతకు పార్టీ నుంచి ఒక పటిష్ట వేదిక ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. పోలింగ్ బూత్ వద్ద ధైర్యంగా నిలబడే వ్యక్తులు ఉన్న పార్టీ జనసేన పార్టీ. అలాంటి ధైర్యం గల కార్యకర్తలను అనుసంధానం చేసి, సమష్టిగా ముందుకు వెళ్లడానికి నాయకులు వారధులుగా పని చేయాలి. బేషజాలకు పోకుండా, చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకుండా ఒకే ఒక్క ఆశయ సాధన కోసం ముందుకు వెళ్తేనే కచ్చితంగా లక్ష్యం చేరుకోగలం. ఎవరో ఏదో అన్నారు.. ఇంకెవరు మనకు చెప్పలేదు అన్న కారణాలను వెతుక్కోకుండా కచ్చితంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు పని చేద్దాం.
* మన ఐక్యతే మన బలం
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను జనంలోకి తీసుకువెళ్లే నిజమైన వాహకాలు జన సైనికులే. చిన్నచిన్న మనస్పర్ధలకు సమయం వృధా చేసుకోకుండా పనిచేద్దాం. అధికార పక్షం నాయకులు కార్యకర్తలు చేసే కవ్వింపులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ మనకు బలం. వైసిపి నాయకుడి అసహనం వెనుక ఆ పార్టీ మంత్రులు, నాయకుల బూతులు వెనుక కూడా జనసేన పార్టీ ఎదుగుతున్న భయం వారికి నిదుర పట్టనివ్వడం లేదు. నిజాయితీగా, పారదర్శక పాలన అందించే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే వారి ఆటలు సాగవని భయపడుతున్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళండి. వాస్తవ పరిస్థితులను వివరించండి. ఐక్యంగా ముందుకు సాగేలా పనిచేద్దాం.
* అందరినీ కలుపుకొని వెళ్ళండి
నాయకులు అంటే జనసేన పార్టీ ప్రతినిధులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రబల శక్తిగా తయారవ్వాలి. 25 ఏళ్ల ప్రస్థానంలో మన వెంట నడిచే యువతరాన్ని వెలికితీద్దాం. ప్రజా సమస్యలు గుర్తించి, సహజ దోపిడీ, కుటుంబ పాలన, అవినీతి మీద విరామం ఎరుగకుండా పోరాడుదాం. ఈ సమీక్షలో గజపతినగరం నియోజకవర్గం నుంచి మొత్తం 22 మంది జన సైనికులు తమ అభిప్రాయాలను శ్రీ మనోహర్ గారితో పంచుకున్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కో ఆర్డినేటర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు శ్రీ మర్రాపు సురేష్, శ్రీ మిడతాన రవి కుమార్ తదితరులు ఉన్నారు. సమీక్ష సమావేశం వేదికపైకి లాటరీ పద్ధతిలో జన సైనికులను పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం సూచనలు చేయాలని కోరారు. వారు చెప్పిన ప్రతి మాటను శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నోట్ చేసుకున్నారు.
* క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి బీమా చెక్కు అందజేత
గజపతినగరం నియోజక వర్గంలోని కొత్త బూర్జవలసకు చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త శ్రీ లంక సూర్యనారాయణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించడంతో ఆయన భార్య శ్రీమతి సింహాచలం రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును పార్టీ నుంచి అందుకున్నారు. ఆమెకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెక్కును అందజేశారు. శ్రీమతి సింహాచలంతో మాట్లాడి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు కావడంతో ఆమెకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా నిలబడుతుందని, ఇద్దరు చిన్నారులను బాగా చదివించాలని సూచించారు.