పోలవరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో అనుమానాలు

* పోలవరం ప్రాజెక్టు డివాల్ గైడ్ బండ్ కూలితే బయటపెట్టకుండా నాటకాలు
* ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష మీడియా సమక్షంలో జరగాలి
* ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించడానికి ఒప్పుకుంది నిజం కాదా?
* కేంద్రం వద్ద వైసీపీ ప్రభుత్వం చేసిన ఒప్పంద సంతకాలు ఉన్నాయి
* పోలవరం… జగన్ రెడ్డి పాపాల వరం పథకం అయ్యింది
* గుంటూరు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఈ ప్రభుత్వం అసలు నిజాలు దాస్తోంది. పోలవరం.. జగన్ రెడ్డి పాపాలకు వరం పథకంగా మారిపోయింది. ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే పోలవరం ప్రాజెక్టును కేవలం బ్యారేజీ స్థాయికి తీసుకువచ్చే కుట్రకు వైసీపీ రచన చేసింది. దీనిలో భాగంగానే కేంద్రం వద్ద ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి, 41.15 మీటర్లకు తగ్గిస్తూ చేసుకున్న ఒప్పందంపై వైసీపీ ముఖ్యమంత్రి సంతకం చేసి వచ్చారు. మంగళవారం పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దీనిపై ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలి. మంగళవారం ముఖ్యమంత్రి చేపట్టబోయే పోలవరం సమీక్ష సమావేశం పూర్తి పారదర్శకంగా మీడియా సమక్షంలో జరగాల’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “సరిగ్గా రెండు నెలల క్రితం కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత పోలవరం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆడిన నాటకం బయటపడింది. దానిని వెంటనే ప్రజల ముందు పెట్టాం. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపైన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను మీడియా ముందు తెలియచేసిన వెంటనే రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వేగంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా నేను అబద్ధాలు చెబుతున్నానంటూ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నవి పచ్చి అబద్దాలు అని ఇప్పుడు వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పోలవరం ప్రాజెక్టు కోసం విడుదల చేసిన రూ.17,144 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం 41.15 మీటర్లకు ఎత్తు ఒప్పుకుంటేనే విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో అసలు నిజాలను ప్రభుత్వం దాచాలని చూస్తోంది. జనసేన పార్టీ పోలవరం ఎత్తు విషయంలో వైసీపీకు బహిరంగంగా ఛాలెంజ్ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో మీరు ఎలాంటి అంగీకారం తెలపకపోతే బహిరంగంగా దానిపై చర్చకు రండి. మంగళవారం ముఖ్యమంత్రి హడావుడిగా పోలవరం క్షేత్రస్థాయి పర్యటన పెట్టుకున్నారు. అనంతరం ప్రాజెక్టు స్థితిగతుల మీద సమీక్షించనున్నారు. ఈ పర్యటన మొత్తం అత్యంత పారదర్శకంగా జరగాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజలకు మొత్తం విషయం అర్థమయ్యేలా, మీడియా సమక్షంలోనే సమీక్ష సమావేశం జరగాలి.
* కీలకమైన గైడ్ బండ్ కూలిన విషయం దాచారు
నాలుగు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టులోని స్పిల్ వే వద్ద కీలకమైన డివాల్ గైడ్ బండ్ కూలిపోయినట్లు తెలుస్తోంది. నిర్మాణం కూలిపోయిన వెంటనే మంత్రి శ్రీ అంబటి రాంబాబు రహస్యంగా పోలవరం పర్యటనకు వచ్చారు. ఆయన పర్యటనకు మీడియాని అనుమతించలేదు. కనీసం ప్రాజెక్టు వద్దకు కూడా మీడియాను రానివ్వలేదు. పోలవరం ప్రాజెక్టు నాణ్యత విషయంలోనూ ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. వైసీపీ గత నాలుగున్నర ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు మీద చూపిన పురోగతి ఏమిటో ప్రజలకు చెప్పాలి.
* కమీషన్ల కక్కుర్తి
ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే కట్టిన నిర్మాణాలు కూలిపోవడం అంటే అనుమానంగా ఉంది. నాణ్యతను పక్కనపెట్టి కమీషన్ల కోసం వైసీపీ ప్రభుత్వ పెద్దలు కక్కుర్తి పడుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. పోలవరం ప్రాజెక్టు పర్యటనలో అంత రహస్యం ఏమిటి..? ప్రజల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ రహస్యం పనిచేయదు. కేంద్రం ఇచ్చిన రూ. 17వేల కోట్ల రూపాయలతో ఏం చేయబోతున్నారో కూడా సమాధానం చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో జాయింట్ సర్వే కావాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుంది అన్నది సాధారణ ప్రజలకు అయోమయంలో ఉంది.
* 2021 ఖరీఫ్ పంటకు పోలవరం పూర్తి అని మాట ఇచ్చారు
మొదటిసారి అసెంబ్లీలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 2021, ఖరీఫ్ సీజన్ నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతామని ఆర్భాటంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రాజెక్టు ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. వేల మందికి ఇంకా ఆర్ఆర్ ప్యాకేజీ అందాల్సి ఉంది. పునరావాస ప్యాకేజీ గురించి వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలు లేవు. పునారావాస గ్రామాల్లోనూ కనీస వసతులు ఇప్పటికీ కనిపించడం లేదు. వీటన్నింటి పైన కచ్చితంగా చర్చ జరగాలి. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఏం చేయబోతుంది అన్నదాని మీద సమాధానం చెప్పాలి.
* వారాహి యాత్రలో ప్రతి నియోజకవర్గంలో జనవాణి
14వ తేదీ నుంచి మొదలు కాబోతున్న వారాహి యాత్రలో ప్రతిరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం వేళ ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలపై ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, కీలకమైన విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. సమస్యల మీద అధ్యయనం కూడా ఉంటుంది. అనంతరం సమస్యల పరిష్కారానికి వివిధ వర్గాల వారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. పూర్తిగా ప్రజా సమస్యలను పరిష్కరించే మార్గాలను వారాహి యాత్ర ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికతో రూపొందిస్తారని” చెప్పారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు శ్రీ నేరెళ్ల సురేష్, జనసేన పార్టీ నాయకులు శ్రీ నాయుబ్ కమల్, శ్రీ జిలానీ, శ్రీ బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారాహి యాత్రకు సంబంధించిన పోస్టర్లను శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు.
* అనాధలైన ఆడబిడ్డలకు ఆలంబనగా నిలిచిన బీమా
ఇద్దరు చిన్నారులకు నిండా 10 సంవత్సరాలు రాలేదు. అనారోగ్యంతో అమ్మ చనిపోగా ఇటీవల ప్రమాదంలో నాన్న మృతి చెందాడు. దీంతో అనాధలుగా మారిన ఆ ఇద్దరు పిల్లలకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ బీమా ఆలంబన అయింది. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం, నడిగడ్డ గ్రామానికి చెందిన శ్రీ గొళ్ల గురుబ్రహ్మ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త. అతని భార్య ఆరు నెలలకు ముందు అనారోగ్యంతో మృతి చెందగా రోడ్డు ప్రమాదం గురుబ్రహ్మను కాటేసింది. దీంతో అతని ఇద్దరి కూతుళ్లు వరలక్ష్మి, వాగ్దేవిలు తల్లిదండ్రులు లేని పిల్లలుగా మారిపోయారు. శ్రీ గురుబ్రహ్మ జనసేన క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతుండడంతో అతనికి పార్టీ తరఫున రూ. 5 లక్షల బీమా చెక్కును సోమవారం మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే బీటెక్ చదువుతున్న ఉమ్మడి కృష్ణాజిల్లా, పెడన నియోజకవర్గం, నీలిపూడి గ్రామానికి చెందిన శ్రీ బుద్ధాన పవన్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. జనసేన క్రియాశీలక కార్యకర్త అయిన పవన్ కుమార్ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును శ్రీ మనోహర్ గారు సోమవారం అందజేశారు. వీరితో పాటు జనసేన క్రియాశీలక కార్యకర్తలుగా కొనసాగుతూ వివిధ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన 10 మంది కార్యకర్తలకు చికిత్స నిమిత్తం మెడిక్లెయిమ్ చెక్కులను శ్రీ మనోహర్ గారు అందజేశారు.