వైకాపా… విద్య‌నాశాయ‌!

* బెడిసికొడుతున్న విద్యా సంస్క‌ర‌ణ‌లు
* చిత్త‌శుద్ధి కొర‌వ‌డిన ప్ర‌భుత్వం
* విద్యా వ్య‌వ‌స్థ నిర్వీర్యం
* నిపుణుల అభిప్రాయాలు బేఖాతరు
* ఉపాధ్యాయ వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త‌
* అయోమ‌యంలో విద్యార్థులు, త‌ల్లిదండ్రులు

మాస్టారు పాఠం చెప్పుకుపోతున్నారు…
విద్యార్థి చూరులో దూరుతున్న ఎలుక‌ను చూస్తున్నాడు…
“ఏరా పాఠం పూర్తిగా ఎక్కిందా?” అన్నారు మాస్టారు…
“తోక మిగిలిపోయిందండి!” అన్నాడు విద్యార్ధి!
ఇది జోక్ కాదు…
ఏపీలో విద్యావ్య‌వ‌స్థ‌కు అచ్చంగా అద్దం ప‌ట్టే ఉదాహ‌ర‌ణ‌!
విద్యార్థి వింటున్నాడో లేదో చూసుకోకుండా పాఠం చెప్పేసిన మాస్టారి త‌ర‌హాలోనే ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది.
ఏపీలో హ‌డావుడిగా ప్ర‌వేశ పెట్టిన విద్యా సంస్క‌ర‌ణ‌లు విద్యార్థుల అయోమ‌యానికి, త‌ల్లిదండ్రుల ఆవేద‌న‌కు కార‌ణంగా నిలుస్తున్నాయి.
ఏ వ్య‌వ‌స్థ‌లోనైనా సంస్క‌ర‌ణ‌లు మంచివే. వాటిని ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ అలాంటి మార్పులు తీసుకొచ్చే ముందు అందుకు విద్యార్థుల‌ను స‌న్న‌ద్ధం చేయాలి. ఉపాధ్యాయుల‌ను స‌మాయ‌త్తం చేయాలి. ఆయా మార్పుల‌పై విస్తృత చ‌ర్చ జ‌రిపించాలి. నిపుణుల‌, మేధావుల అభిప్రాయాలు సేక‌రించాలి. లోటుపాట్లేమైనా ఉంటే స‌రిదిద్దుకోవాలి. ఆపై కూడా వాటిని ప్ర‌యోగాత్మ‌కంగా కొన్ని చోట్ల అమ‌లు ప‌రిచి ప్ర‌త్య‌క్షంగా త‌లెత్తే స‌మ‌స్య‌లు, అవ‌రోధాల‌ను గుర్తించాలి. ఆ త‌ర్వాతే పూర్తిస్థాయిలో సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేయాలి.
ఇది ప‌రిపాల‌నలో విధాన‌ప‌ర‌మైన మౌలిక అంశమ‌నే విష‌యం ఎవ‌రికైనా తెలిసిందే.
కానీ… తెలియ‌నిద‌ల్లా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికే!
ఎందుకంటే… ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో ఉత్తీర్ణ‌తా శాతం దారుణంగా పడిపోయిన నేప‌థ్యంలో ఉన్న‌త పాఠశాల‌ల్లో ఉపాధ్యాయ పోస్టుల విష‌యంలో కూడా ప్ర‌భుత్వం కొత్త‌గా జారీ చేసిన ఉత్త‌ర్వులు ఉపాధ్యాయ వ‌ర్గాల్లో అయోమ‌యానికి దారి తీశాయి. ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠశాల‌ల్లో ప్ర‌ధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల‌కు ప్ర‌భుత్వం ఉన్న‌ట్టుండి మంగ‌ళం పాడింది. 3 నుంచి 10 వ‌ర‌కు ఉండే పాఠ‌శాల‌ల్లో 137 మంది, 6 నుంచి 10 వ‌ర‌కు ఉండే పాఠ‌శాల‌ల్లో 92 మంది లోపు విద్యార్థులు ఉంటే వాటిలో ప్ర‌ధానోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఉండ‌వు. 17 సెక్ష‌న్ల విద్యార్థుల‌కు ఒకే ఒక్క హిందీ టీచ‌ర్ పాఠాలు చెప్పాలి. 19 సెక్ష‌న్ల‌కు 3 గ‌ణితం, సాంఘిక శాస్త్రం పోస్టులిచ్చింది. దీంతో వారానికి ప్ర‌తి టీచ‌ర్ 48 పీరియ‌డ్లు బోధించాల్సి ఉంటుంది. అలాగే 6 నుంచి 10 త‌ర‌గ‌తుల్లో 18 సెక్ష‌న్ల‌కు 21 మంది టీచ‌ర్ల‌ను కేటాయించారు. ఈ ఉత్త‌ర్వుల వ‌ల్ల ఇద్ద‌రు టీచ‌ర్లు సెల‌వు పెడితే త‌ర‌గతుల నిర్వ‌హ‌ణే క‌ష్టంగా మారే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక 3 నుంచి 8 త‌ర‌గ‌తుల‌కు అస‌లు ప్ర‌ధానోపాధ్యాయుడి పోస్టునే కేటాయించ‌లేదు. ఇక ప్రాథమిక పాఠ‌శాల‌ల్లో 30 మంది విద్యార్థుల‌కు ఒకే టీచ‌ర్‌ను ఇస్తారు. రాష్ట్రంలో ఎక్కువ‌గా 30 లోపు విద్యార్థులు ఉన్న పాఠ‌శాల‌లే అధికంగా ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు ఇవ‌న్నీ ఏకోపాధ్యాయ బ‌డులుగా మార‌నున్నాయి. అలాగే 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఒక్క ఆంగ్ల మాధ్య‌మ‌మే ఉండాల‌ని నిర్ణ‌యించింది. కేవ‌లం 9, 10 త‌ర‌గ‌తుల్లోనే తెలుగు, ఆంగ్ల మాధ్య‌మాలు రెండూ ఉండ‌నున్నాయి. ఈ విధానం వ‌ల్ల చాలా ఉపాధ్యాయ పోస్టులు ర‌ద్‌ువుతాయి. పోస్టుల‌ను మిగుల్చుకునేందుకే ప్ర‌భుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింద‌నేది సుస్ప‌ష్టం. రెండు మాధ్య‌మాలు ఉంటే రెండింటికి టీచ‌ర్ల‌ను ఏర్పాటు చేయాల్సి వ‌స్తుంద‌ని ఒక్క ఆంగ్ల మాధ్య‌మాన్నే కొన‌సాగించేందుకు నిర్ణ‌యించింది. ఈ కొత్త ఆదేశాల‌ను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు 600 మంది విద్యార్థుల‌కు ఒకే ఒక హిందీ టీచ‌ర్ నియామ‌కం జ‌రిగే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక బోధ‌న ఎలా సాధ్య‌మ‌ని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వ‌నిమిరెడ్డి విజ‌య్‌కుమార్‌, మేడికొండ స‌దానంద‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు. వైకాపా తీసుకున్న ఈ కొత్త నిర్ణ‌యాల ప‌ట్ల త‌ల్లిదండ్రులు, విద్యార్థుల్లో సైతం క‌ల‌వ‌రం వ్య‌క్త‌మ‌వుతోంది.
ఇప్ప‌టికే వైకాపా ఏపీ విద్యా విధానంలో కొత్త‌గా తీసుకొచ్చిన మార్పుల వ‌ల్ల క‌లిగిన దుష్ప‌రిణామాలే అధికంగా క‌నిపిస్తున్నాయి.
మ‌న‌మేం చేస్తే అదే ఘ‌న‌కార్యం అనుకుంటూ, తోచింది చేయ‌డ‌మే త‌ప్ప ముందు చూపు కొర‌వ‌డిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన మార్పుల ఫ‌లితాలు చూస్తే అదే నిజ‌మ‌ని చెప్ప‌క‌ త‌ప్ప‌దు.
* ఒక‌ప్పుడు నాణ్య‌మైన విద్య‌లో ఏపీది మూడో స్థానం… ఇప్పుడు వైకాపా హ‌యాంలో అది 19వ స్థానం!
* మొన్న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష రాసిన ప్ర‌తి ముగ్గురిలో ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యాడు!
* 20 ఏళ్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా ప‌దోత‌ర‌గ‌తిలో ఉత్తీర్ణ‌త శాతం 67.26 శాతానికి ప‌డిపోయింది!
* ఏకంగా 2 ల‌క్ష‌ల‌కు పైగా విద్యార్థులు ప‌రీక్ష త‌ప్పారు! ఇది రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది తల్లిదండ్రుల క‌ల‌వ‌రానికి కార‌ణ‌మైంది!
* ఎన్న‌డూ లేని విధంగా ఏడుగురు ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థ‌లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు! ఆయా కుటుంబాల వారు క‌డుపుకోత‌తో కుమిలిపోతున్నారు!
* ఏకంగా 22 ప్ర‌భుత్వ బ‌డుల్లో సున్నా ఫ‌లితాలు వ‌చ్చాయి! ఎయిడెడ్‌, ప్రభుత్వ, ప్రైవేటు యాజ‌మాన్యాల‌వి క‌లిపి చూస్తే వీటి సంఖ్య 71!
* చాలా బడుల్లో 50 శాతంలోపే ఫ‌లితాలు వ‌చ్చాయి!
* విద్యావ్య‌వస్థ‌లో మార్పులు విక‌టించ‌డం వ‌ల్లే ఇలాంటి ప‌రిణామాలు త‌లెత్తాయ‌ని ఉపాధ్యాయ సంఘాల నేత‌లే బ‌హిరంగంగా విమ‌ర్శిస్తున్నారు!
ఏదైనా వ్య‌వ‌స్థ‌లో చేప‌ట్టిన మార్పులు మంచి ఫ‌లితాల‌ను ఇస్తేనే వాటిని సంస్క‌ర‌ణ‌లు అంటారు.
లేక‌పోతే వాటిని ఆ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసిన కార‌ణాల‌నే చెప్పాలి.
ఏపీ విద్యావిధానంలో మార్పులు ఇప్పుడిలాగే త‌యార‌య్యాయ‌ని చెప్ప‌డానికి పై ఉదాహ‌ర‌ణ‌లే నిద‌ర్శ‌నం.
ఈ ఫ‌లితాల‌ను, అందుకు గ‌ల కార‌ణాల‌ను అర్థం చేసుకోవాలంటే పూర్వాప‌రాల్లోకి వెళ్లాలి.
*విద్య‌నాశ‌క విధానాలివిగో…
వైకాపా అధికారంలోకి వ‌చ్చిన 2019లోనే ప‌దోతర‌గ‌తిలో సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ఘ‌నంగా ప్ర‌క‌టించుకుంది. అయితే క‌రోనా కార‌ణంగా 2020, 2021ల్లో అస‌లు ప‌రీక్ష‌లే జ‌ర‌గ‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఫ‌లితంగా ప‌రీక్ష‌లు లేకుండానే విద్యార్థుల‌ను ఉత్తీర్ణులుగా ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. క‌రోనా విజృంభించిన రెండేళ్ల‌లో ప్రాథ‌మిక‌, ప్రాథ‌మికోన్న‌త, ఉన్న‌త పాఠ‌శాల‌ల‌న్నీ మూత ప‌డ‌డం, ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌డం, వాటిని చాలా మంది విద్యార్థులు అవ‌గాహ‌న చేసుకోలేక‌పోవ‌డం, విద్యార్థుల రాత‌, గ్రాహ్య‌త నైపుణ్యాలు మందగించ‌డం లాంటి ఎన్నో ప‌రిణామాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఈ విష‌యాలేవీ ప‌ట్టించుకోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం గుడ్డిగా తాను అనుకున్న సంస్క‌ర‌ణ‌ల విష‌యాన్ని హ‌డావుడిగా బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. పాత సంస్క‌ర‌ణ‌ల‌కు తోడు మ‌రిన్ని మార్పుల‌ను క‌లిపి వాట‌న్నింటినీ 2022లో అమ‌లు చేసింది. అయితే రెండేళ్ల‌కు పైగా పాఠ‌శాల‌ల‌కు దూరంగా ఉన్న విద్యార్థులు ఈ మార్పుల‌ను అందిపుచ్చుక‌నే స్థితిలో ఉన్నారా లేరా అనే విష‌యాన్ని గాలికొదిలేసింది. పోనీ విద్యా సంస్థ‌ల య‌జ‌మానులు, నిపుణులు, ఉపాధ్యాయ సంఘాల‌ నేత‌లు, మేధావులు, తల్లిదండ్రుల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించిందా అంటే అదీ లేదు.
“తా మునిగింది గంగ‌… తా వ‌ల‌చింది రంభ‌” అనే ప‌ద్ధ‌తిలో తాన‌నుకున్న మార్పుల‌ను విద్యార్థుల‌పై రుద్దింది. ఆ అనాలోచిత విధాన‌మే ఇప్పుడు విద్యా వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టుపట్టించింది. ఈ విష‌యాన్ని ఉపాధ్యాయ సంఘాల నేత‌లే చెబుతున్నారు. ఏక‌ప‌క్షంగా అమ‌లు చేసిన ఆ మార్పులేమిటో తెలిస్తే వైకాపా విద్యావ్య‌వ‌స్థ‌ను ఎలా దిగ‌జార్చిందో అర్థం అవుతుంది.
* పాఠశాల‌ల్లో విద్యార్థుల వికాశాన్ని, ప్ర‌వ‌ర్త‌న‌ని, చదువులో వారి గ్రాహ్య‌త స్థాయిని నిత్యం ప‌రిశీలించేది ఉపాధ్యాయులే. విద్యార్థుల్లో చ‌దువుతో పాటు ఇతర నైపుణ్యాల‌ను కూడా పెంచ‌డానికి ఉపాధ్యాయులు సాధార‌ణంగా కొన్ని అంత‌ర్గ‌త ప‌రీక్ష‌లు, ప్రాజెక్టులు లాంటివి చేయిస్తూ ఉంటారు. ఇలాంటి ప‌నుల్లో చురుగ్గా పాల్గొనే విద్యార్థుల‌కు కొన్ని మార్క‌లు కేటాయిస్తారు. ఇది విద్యార్థుల్లో పోటీ త‌త్వాన్ని, ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇలా కేటాయించే అంత‌ర్గ‌త మార్కులు గ‌తంలో 20 శాతం ఉండేవి. మిగ‌తా 80 శాతానికే ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేవారు. ఈ విధానం వ‌ల్ల అంతో ఇంతో మంచే జ‌రుగుతుంది త‌ప్ప న‌ష్ట‌మేమీ లేదు. అయితే ప్రైవేటు పాఠశాల‌లు ఇష్టారాజ్యంగా అంత‌ర్గ‌త మార్కులు వేసుకుంటున్నాయ‌నే ఉద్దేశంతో వీటిని తీసేశారు. ఇదే నిజ‌మ‌నుకుంటే ప్రైవేటు పాఠ‌శాల‌లు పాటించే విధానాన్ని త‌నీఖీ చేయ‌డానికి, వాటిపై అజ‌మాయిషీ పెంచే ఏర్పాట్లు చేస్తే ఉన్న విధానం మ‌రింత ప‌టిష్ట‌ప‌డేది. దానికి బ‌దులు మొత్తం విధానాన్నే ర‌ద్దు చేయ‌డంతో ఆ ప్ర‌భావం విద్యార్థుల‌పై ప‌డింది. రాత ప‌రీక్ష‌కు అంత‌ర్గ‌త మార్కులు జ‌త కూడే ప్ర‌యోజ‌నాన్ని విద్యార్థులు కోల్పోయారు.
* ప్ర‌శ్న ప‌త్రంలో చేసిన మార్పులు కూడా లోప‌భూయిష్టంగానే త‌యార‌య్యాయి. ఉదాహ‌ర‌ణ‌కు బిట్ పేప‌ర్‌కు 25 శాతం వెయిటేజిని తొల‌గించి, దాన్ని 12 శాతానికి త‌గ్గించారు. రెండు పేప‌ర్ల‌లో క‌లిపి గ‌తంలో 40 బిట్ల‌కు 20 మార్కులు ఉండేవి. కొత్త విధానంలో 24 సూక్ష్మ ల‌ఘు ప్ర‌శ్న‌లు తీసుకొచ్చి, వీటికి నేరుగా స‌మాధానాలు రాయ‌మ‌న్నారు. అంత‌ర్గ‌త మార్కులు తీసేయ‌డం వ‌ల్ల ఆ 20 మార్కుల‌కు కూడా ప్ర‌శ్న‌లు ఇచ్చారు. దీంతో ప‌రీక్ష‌లో విద్యార్థికి రాత ప్ర‌శ్న‌ల సంఖ్య పెరిగిపోయింది. ఫ‌లితంగా వారిపై విప‌రీత‌మైన ఒత్తిడి పెరిగింది.
* అలాగే గ‌తంలో ప‌రీక్ష ఆఖ‌రి అర‌గంట‌లో బిట్ పేప‌ర్ ఇచ్చేవారు. అవి మ‌ల్టిపుల్ ఛాయిస్ ఉండే విధంగా రూపొందేవి కాబ‌ట్టి ఇచ్చిన నాలుగు జ‌వాబుల్లో ఒక‌దాన్ని విద్యార్థి టిక్ చేస్తే స‌రిపోయేది. పుస్తకం చ‌దివే విద్యార్థికి బిట్ పేప‌ర్ రాయ‌డం తేలిక‌గా ఉండేది. ఇప్పుడు బిట్ పేప‌ర్ తొల‌గించ‌డంతో అన్ని ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు రాయాల్సి వ‌చ్చింది. ఇది కూడా విద్యార్థుల‌కు భార‌మైంది.
* ఇక గ‌తంలో ప‌ద‌కొండు పేప‌ర్లు ఉండేవి. హిందీ మిన‌హా మిగ‌తా స‌బ్జెక్టుల‌కు రెండేసి పేప‌ర్లు ఉండేవి. క‌రోనా స‌మ‌యంలో ఎక్కువ రోజులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం క‌ష్ట‌మనే నేప‌థ్యంలో ఏడు పేప‌ర్ల‌కు కుదించారు. అయితే ప్ర‌శ్న‌ల సంఖ్య‌ను పెంచ‌కుండా మార్కుల‌ను రెట్టింపు చేశారు. రెండు పేప‌ర్ల విధానం వ‌ల్ల విద్యార్థి ఒక పేప‌ర్ స‌రిగ్గా రాయ‌లేక‌పోయినా, రెండో పేప‌ర్ పై దృష్టి పెట్టి క‌వ‌ర్ చేసుకునే అవ‌కాశం ఉండేది. ఒకేసారి సిల‌బ‌స్ మొత్తం చ‌దివే అవ‌స‌రం ఉండేది కాదు. మొద‌టి పేప‌ర్‌కు కొంత సిల‌బ‌స్‌, రెండోదానికి మిగ‌తా సిల‌బ‌స్ చదువుకునే అవ‌కాశం ఉండేది. ఏడు పేప‌ర్ల విధానం వ‌ల్ల మొత్తం చ‌ద‌వాల్సి రావ‌డం, ప్ర‌శ్న‌ల ఛాయిస్ కూడా త‌గ్గిపోవ‌డంతో విద్యార్థుల‌కు అధిక భారం ప‌డింది.
* ఈ మార్పుల‌పై విద్యార్థుల‌కు స‌రైన అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం అయింది. నిజానికి తొమ్మిదో త‌ర‌గ‌తి నుంచే విద్యార్థుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టి ప‌బ్లిక్ ప‌రీక్ష‌కు సిద్ధం చేసేవారు. కానీ ఈసారి 8, 9 త‌ర‌గ‌తులు సరిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో విద్యార్థులు పాఠాలు స‌రిగ్గా చ‌ద‌వ‌లేక‌పోయారు. ఈ ప్ర‌భావాన్ని గుర్తించి వారిని స‌రిగ్గా స‌మాయ‌త్తం చేయ‌డానికి కానీ, ఈ ప‌రిస్థితిని స‌రిదిద్ద‌డానికి కానీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు.
* రెండేళ్ల పాటు క‌రోనా నేప‌థ్యంలో విద్యార్థుల‌కు నోట్స్ రాయడం అల‌వాటు త‌ప్పి, చేతి రాత‌లో వేగం త‌గ్గింది. ఇలాంటి నేప‌థ్యంలో బిట్ పేప‌ర్‌ను తొల‌గించ‌డంతో విధిగా అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాయాల్సి వ‌చ్చింది.
కాస్త ఆలోచిస్తే తెలిసే ఇలాంటి ప్ర‌భావాల‌ను అంచ‌నా వేయ‌డంలో విఫ‌ల‌మైన జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనాలోచితంగా చేసిన మార్పులు విద్యార్థుల‌లో అయోమ‌యాన్ని పెంచిన ప‌రిణామాలేంటో ఇప్పుడు ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాలు తేట‌తెల్లం చేశాయి.
ప‌రీక్ష‌ల సంస్క‌ర‌ణ‌ల పేరుతో బిట్‌పేప‌ర్ తొల‌గించ‌డం, ఒక మార్కు ప్ర‌శ్న‌ల స్థాయికి మించి పెద్దవి ఇవ్వ‌డం వ‌ల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, విద్యాశాఖ విధానాలే ఇందుకు కార‌ణ‌మ‌ని రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్య‌క్షుడు లంక‌ల‌ప‌ల్లి సాయి శ్రీనివాస్, ఏపీ ఉపాధ్యాయ స‌మాఖ్య అధ్య‌క్షుడు హృద‌య‌రాజు విమ‌ర్శిస్తున్నారు.
ఇలా అటు టీచ‌ర్ల‌లో, ఇటు విద్యార్థుల్లో, ఆపై త‌ల్లిదండ్రుల‌లో సైతం క‌ల‌వ‌రం, ఆందోళ‌న కలిగించే ఏక‌ప‌క్ష, మొండి విధానాల‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది. వెరిసి ఈ సంస్క‌ర‌ణ‌ల‌, ఈ నిర్ణ‌యాల ఫ‌లిత‌మంతా విద్యావిధానంపై ప‌డుతోంది. వెర‌సి వైకాపా అంటేనే… విద్య‌నాశాయ‌, ప్ర‌గ‌తి నాశాయ‌, ప్ర‌తిభ నాశాయ అనుకునే ప‌రిస్థితి దాపురిస్తోంది!