శ్రీ కన్యకా పరమేశ్వరాలయంలో డా. కందుల ప్రత్యేక పూజలు

  • అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పూజలు
  • కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన డాక్టర్ కందుల

విశాఖ దక్షిణ నియోజకవర్గం: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పురస్కరించుకొని సోమవారం ఉదయం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, నలిని దేవి దంపతులు సోమవారం ఉదయం పాత నగరంలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమయ్యే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 1 గంట వరకు కొనసాగనుందని చెప్పారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారని తెలిపారు. సుమారు 7 వేల మంది అతిథులు పాల్గొనే ఈ మహా ఘట్టాన్ని కోట్లాది ప్రజలు టీవీలు, ఆన్‌లైన్ వేదికల్లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.
జనవరి 22న కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవుదినంగా ప్రకటించగా.. పలు రాష్ట్రాలు పూర్తి సెలవును ప్రకటించాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ వేడుక కోసం ఇప్పటికే పలువురు ఆహ్వానితులు అయోధ్యకు చేరుకున్నారని పేర్కొన్నారు. మిగితా వారంతా సోమవారం తెల్లవారుజామున అయోధ్యకు చేరుకోనున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ప్రత్యేక ఆహ్వానితులు వేడుకలో పాల్గొననున్నారని అన్నారు. ఈ క్రమంలో అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారని చెప్పారు. 10 వేల సీసీ కెమెరాలు, ఏఐ డ్రోన్స్ సిద్ధం చేశారన్నారు. ఎన్ఎస్‌జీ సహా పలు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయన్నారు. ఈ పవిత్ర ఘట్టాన్ని తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆరిశెట్టి దినకర్, సుగ్గు శివ,
జి.రామకృష్ణారావు, నల్లూరి నూకరాజు, ఉమా, బద్రి, దుర్గా, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.