లంకమ్మ మాన్యం కాలనీలో డ్రైన్ తవ్వించాలి: శేషుబాబు

అవనిగడ్డ గ్రామంలోని లంకమ్మ మాన్యం కాలనీ ఏర్పడి 22 సంవత్సరాలు అయినా, ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంలో పాలక పక్షాలు పూర్తిగా విఫలం అయినవని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఎద్దేవా చేసారు.

ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇచ్చి, మౌలిక సదుపాయాలు కల్పించకుండా తాత్సారం చేయడం పరిపాటి అయిందని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఇక్కడి కాలనీ వాసుల గోడు పట్టించు కోవడం లేదని, స్కూల్ కి వెళ్ళే విద్యార్థులు వర్షాకాలం మొత్తం మోకాళ్ళ లోతు నీళ్లలో నడిచి వెళ్లాల్సిందే అని, రోడ్ల మీద నిల్వ ఉన్న నీరు ఎంత కాలం అయినా సరే ఎండకు ఆవిరి అవ్వడమే తప్ప, డ్రైన్ ద్వారా బయటకు పోయే పరిస్తితి లేదని, ఈ నిల్వ ఉన్న నీళ్లకు పక్కనే విద్యుత్ ట్రాన్సఫారం ఉందని ఏ సమయంలో అయినా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఇక్కడ ఉన్న మంచినీటి కుళాయి మురుగు నీటి గుంతలో ఉందని, ఆ నీరు తాగితే ప్రజలు రోగాల బారిన పడి, హాస్పిటల్స్ చుట్టూ తిరగడమే అని గత సంవత్సరం కూడా ఈ కాలనీ ప్రజలు ఎక్కువ మంది విష జ్వరాల బారిన పడ్డారని దుయ్యబట్టారు.

5వ తరగతి వరకు చదువుకునే చిన్న పిల్లలు కోసం అయినా ఈ స్కూల్ కి వెళ్ళే రోడ్డును వెంటనే నిర్మించి, మురుగు నీరు, వర్షపు నిల్వ నీరు బయటకు తరలించేందుకు డ్రైన్ సౌకర్యం కల్పించాలని, వెంటనే పంచాయతీ వారు స్పందించి మోటార్ ఇంజిన్లు సహాయంతో నిల్వ నీటిని తక్షణమే బయటకు తరలించాలని కోరారు.

కాలనీ వాసి గుగ్గిలం అనిల్ మాట్లాడుతూ గడిచిన 22 సంవత్సరాల కాలం నుండి ఇలాంటి మురుగు నీటి మధ్యనే దోమలతో కుట్టించుకుంటూ, పాముల మధ్య నివాసం ఉంటున్నామని, డ్రైనేజ్ సౌకర్యం అసలు లేదని ఎంతమంది అధికారులకు చెప్పిన ఎవరు పట్టించుకోవడంలేదని వాపోయారు. అధికారులు మరియు పాలకులు వెంటనే స్పందించి స్కూలుకు వెళ్లే ఈ రోడ్డును నిర్మించాలని తక్షణమే డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలని.. అలాగే కలుపు మందు కొట్టించి గడ్డి పెరగకుండా చూడాలని కోరారు.

జన సైనికుడు పప్పు శెట్టి శ్రీను మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిజిటల్ క్యాంపెయిన్ కోసం ఇచ్చిన పిలుపులో భాగంగా ఇక్కడి జన సైనికులం అయిన మేము 2021 సెప్టెంబర్ రెండవ తేదీన ఈ స్కూలుకు వెళ్లే రోడ్డులో నిల్వ ఉన్న నీటిని బయటకు తరలించాలని అలాగే వెంటనే కొత్త రోడ్డును నిర్మించాలని డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేస్తే ఇక్కడి వైసిపి నాయకులు ఈ రోడ్డు ఇప్పటికే శాంక్షన్ అయిందని.. జన సైనికులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. కానీ ఈరోజు వరకు రోడ్డు ఎందుకు నిర్మించలేకపోయారు అని మేము వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాము..? మమ్మల్ని తిట్టడంలో ఉండే శ్రద్ధ రోడ్ల నిర్మాణంలోనూ డ్రైనేజీ సౌకర్యం కల్పించడంలోనూ చూపించాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు.