ఉత్తరాఖండ్ లో ఒలెక్ట్రా వారి ఎలక్ట్రిక్‌ బస్సులు

డెహరాడూన్ పౌరులు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమిషన్‌తో కూడిన ఎలక్ర్టిక్ బస్సులలో ప్రయాణం చేసే అవకాశం పొందుతున్నారు. ఈ బస్సులను దేశంలో ఎలక్ర్టిక్ ప్రజా రవాణా వ్యవస్థలో అగ్రగామి అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ అందిస్తోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి  త్రివేది సింఘ్ రావత్ శుక్రవారం ఈ బస్సులకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రావత్ మాట్లాడుతూ “ఈ సంవత్సరంలో 30 ఎకో ఫ్రెండ్లీ బస్సులను ప్రారంభించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. ఈ బస్సులు డెహరాడూన్, ముస్సోరీ, రిషికేశ్, హరిద్వార్ కొండ ప్రాంతాల్లో కూడా తమ ప్రయాణాన్ని సాగిస్తాయని” తెలిపారు. 9 మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్ 25 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్ తో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం పొందగలరు. బస్సులో అమర్చిన లిథియమ్-ఇయాన్ (Li-ion) బ్యాటరీని ఒకసారి చార్జింగ్ ద్వారా దాదాపు 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ అత్యాధుని సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్ ను కొంతమేరకు తిరిగి పొందుతుంది. ఇందులో ఉన్న అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీ 3 నుంచి 4 గంటల్లో మొత్తం చార్జింగ్ అవుతుంది.

ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను మరో రాష్ట్రంలో కూడా నడపడం చాలా గర్వంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్ జీవావరణాన్ని సంరక్షించడంలో భాగం ఈ ఎలక్ట్రిక్ బస్సులు తమ వంతు పాత్ర పోషిస్తాయన్నారు. సమర్థవంతమైన విద్యుత్ ప్రజా రవాణా వ్యవస్థతో కాలుష్యాన్నితగ్గించే కృషిలో ఒలెక్ట్రా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఉత్తరాఖండ్ లో కూడా ప్రవేశపెట్టిన ఈ 30 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా తమ సేవలు అందిస్తాయని తెలిపారు. ఇప్పటికే ముంబాయి పూణే నాగ్ పూర్ హైదరాబాద్ కేరళలో తాము అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే తమ ప్రామాణికతను సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు.