పింక్ బాల్ టెస్టులో వ్యూహాత్మక తప్పిదంపై ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ వివరణ

ఇటీవల అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పింక్ బాల్ తో జరిగిన డేనైట్ టెస్టులో ఇంగ్లండ్ ఘోరపరాభవం పాలైన సంగతి తెలిసిందే. పింక్ బాల్ తో మ్యాచ్ కదా… పేస్ తో భారత్ ను కట్టడి చేద్దామని భావించిన ఇంగ్లండ్ జట్టుకు పిచ్ రూపంలో షాక్ తగిలింది.

పింక్ బాల్ బాగా స్వింగ్ అవుతుందని భావించిన ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లను తుది జట్టులోకి తెచ్చింది. తొలి రోజు నుంచే బంతి తిరగడం ప్రారంభించేసరికి తాము ఎంత పెద్ద తప్పు చేశామో ఇంగ్లండ్ జట్టు మేనేజ్ మెంట్ కు అర్థమైంది. ఆ ముగ్గురు పేసర్లు నామమాత్రంగా మిగలడంతో జట్టులో ఉన్న ఒక్క స్పిన్నర్ జాక్ లీచ్ పై అతిగా ఆధారపడింది. దీనిపై తాజాగా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ స్పందించాడు.

పింక్ బాల్ టెస్టులో తాము పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోయామని అన్నాడు. పిచ్ స్పందించే తీరుపై పొరబడ్డామని తెలిపాడు. గతంలో భారత్ లో పింక్ బాల్ తో జరిగిన మ్యాచ్ ల పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నామే తప్ప, ఈ విధంగా బంతి స్పిన్ అవుతుందని ఊహించలేకపోయామని రూట్ వివరించాడు. ఆ మ్యాచ్ లో తమ తుది జట్టు ఎంపిక పెద్ద తప్పిదమని అంగీకరించాడు.