ఆలయాల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణపై జనసేన కమిటీ ఏర్పాటు

ప్రధాన ఆలయాల నిర్వహణ… ఆస్తుల పరిరక్షణపై జనసేన కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో హిందూ ఆలయాల నిర్వహణలోను, ఆస్తుల పరిరక్షణలో అక్రమాలు చోటు చేసుకొంటున్నాయని అభిప్రాయపడింది. ఆలయ సంప్రదాయాలు, ఆస్తుల నిర్వహణను పరిశీలన చేసేందుకు జనసేన పార్టీ షాడో కమిటీల ఏర్పాటుకు ముగ్గురు సభ్యులతో ఒక బృందాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నియమించారు.

తిరుమల ఆలయంతో పాటు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 11 మల్టీ జోన్ కేటగిరీలోని ప్రధాన ఆలయాలపై షాడో కమిటీలు పరిశీలన చేస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డా.పసుపులేటి హరిప్రసాద్, పార్టీ అధికార ప్రతినిధులు పరుచూరి భాస్కరరావు , పోతిన వెంకట మహేష్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయం, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, కసాపురం ఆంజనేయస్వామి, విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయం, మహానంది ఆలయాల కమిటీలకు తగిన సభ్యులను గుర్తించి అందుకు సంబంధించిన నివేదికను పార్టీ అధ్యక్షులకు అందజేస్తారు.