పెట్టుబడి తప్ప… గిట్టుబాటు లేదు!

* పెరుగుతున్న సాగు వ్యయాన్ని స్వయంగా తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్
* ఖర్చుల వివరాలను జనసేనాని ముందు ఉంచిన రైతులు
* ప్రతి పంటకు రూ.10 వేలు నష్టం వస్తోందని లెక్కలు
* వాస్తవ పరిస్థితి చూసి చలించిపోయిన జనసేన అధ్యక్షులు
* వైసీపీ పాలనలో మరింత దిగజారిన రైతు బతుకు
* రైతు భరోసా కేంద్రాల్లో సేవలు సున్నా

ఓ కౌలు రైతు ఆవేదన ఇదీ… శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎదుట వ్యవసాయం ఎంత దండగమాలిన వ్యవహారంగా మారిపోతోందో లెక్కలతో సహా చెప్పిన సజీవ సాగు చిత్రం. తూర్పుగోదావరి జిల్లా అవిడి గ్రామ రైతు శ్రీనివాసరావు రాజమండ్రిలో ఇటీవల జనసేన అధ్యక్షునితో సమావేశం అయినపుడు చెప్పిన ఖర్చుల కథ విని శ్రీ పవన్ కళ్యాణ్ గారి కళ్లు చెమర్చాయంటే వ్యవసాయం ఎంత భారంగా మారుతోందో అర్ధం చేసుకోవచ్చు.
* వరి సాగు ఖర్చులు ఇలా.. (విత్తు నాటే దగ్గర నుంచి పంటను మిల్లరుకు పంపే వరకు ఎకరా భూమికి)
• విత్తనాలు – రూ.1500
• ఆకుమడి – రూ.1500
• ఊడుపు కోసం – రూ.5000
• కలుపు మందులకు – రూ.1000
• యూరియా కోసం – రూ.8000
• పురుగుల మందుల స్ప్రే – రూ.10000
• గట్లు శుభ్రం చేయడానికి – రూ.1000
• కలుపు తీతలకు – రూ.2,500
• కోత మిషన్ కు – రూ.6000
• ధాన్యం ఎండబోయడానికి – రూ.2000
• హమాలీ ఖర్చులు – రూ.2000
• దమ్ముకు – రూ.3000
• రవాణా, లేబర్ ఛార్జీలు – రూ.5000
• కౌలు డబ్బులు – రూ.20,000
మొత్తం సాగు ఖర్చు ఎకరాకు – రూ. 68,500
ఎకరాకు సరాసరి దిగుబడి 45 బస్తాలు లెక్క వేసుకుంటే 75 కేజీల బస్తా రూ.1300 చొప్పున తీసుకుంటున్నారు. అంటే 45 బస్తాలకు కలిపి రూ.58,500లు మాత్రమే వస్తోంది. అంటే ప్రతి పంటకు రైతుకు ఎకరాకు రూ.10,000 నష్టం వస్తోందన్న మాట.
• ఏటికేడు వ్యవసాయ పెట్టుబడి పెరిగిపోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ధరల్లో బాగా వ్యత్యాసం కనిపిస్తోంది. అయితే దానికి తగినట్లుగా రైతుకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. అవే పాతతరం ధరలు.. అదే పాతతరం వ్యధలు. చేస్తే వ్యవసాయం.. లేకుంటే కూలీపనులు.. అదీ చేతకాకపోతే వలస వేదనలు తప్ప రైతులకు ఒరిగేదేమీ ఉండటం లేదు. ఫలితంగా గ్రామాల్లో రైతులు చితికిపోతున్నారు.
• మనకు తెలియడం లేదు కానీ… రాన్రాను వ్యవసాయం చేసే రైతుల సంఖ్య దేశవ్యాప్తంగా ఏటా సగటున 0.60 శాతం తగ్గుతోందని అంచనా. ఇది చాలా వేగమైన మార్పు. నాణ్యమైన వంగడాలు వస్తున్నప్పటికీ, వాటిని సాగు చేసే రైతుల సంఖ్య ప్రతి ఏడాది తగ్గిపోవడం రానున్న అది పెద్ద ఉపద్రవాన్ని సూచిస్తోంది.
• కౌలు రైతులకు వ్యవసాయంలో మిగిలేదేమీ ఉండటం లేదు. దీనికి తోడు ప్రభుత్వాలు వారికి ఎలాంటి సాయం అందించడం లేదు. ఫలితంగా కౌలు రైతులు సాగు పెట్టుబడి కోసం అప్పులు చేయడం, తర్వాత ఏ మాత్రం నష్టం వచ్చినా పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతున్నారు. ఫలితంగా గత నాలుగేళ్లలోనే అధికారికంగా 1300 మంది ఆత్మహత్య చేసుకుంటే, లెక్కల్లోకి రాని వారు దానికి మూడింతలు ఎక్కువగా కనిపిస్తున్నారు.
• పంట అమ్ముతున్న సమయంలో దళారీ వ్యవస్థ రాష్ట్రంలో రైతులను కుంగదీస్తోంది. రకరకాల కారణాలు చెప్పి పంటకు కనీస ధర రాకుండా వారు అడ్డుపడుతున్నారు. మిల్లర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారి, రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. వర్షాలు వచ్చే సమయంలో తేమ పేరు చెప్పి, రబీ ధాన్యానికి నూక పేరు చెప్పి రైతు తెచ్చిన ధాన్యంలో కోత వేస్తున్నారు. ఫలితంగా ప్రతి 75 కేజీల బస్తా మీద రైతు రమారమీ 5 కేజీలకు పైగా కోల్పోతున్నాడు.
• రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. రైతులు పంటను అమ్మే సమయంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ పని జరగడం లేదు. వైసీపీ పాలనలో రూ.6,300 కోట్ల ప్రజాధనం వృథా చేసి కట్టిన ఈ కేంద్రాల్లో 32 సేవలు అందాల్సి ఉంది. అయితే ఇక్కడ సిబ్బంది జాడ కనిపించకపోవడం, వారు చెప్పింది మిల్లర్లు, దళారులు వినకపోవడంతో వారు చేతులెత్తేస్తున్నారు. కేవలం సాంకేతికంగా రైతు పండించిన ధాన్యం లెక్కలను తీసుకోవడానికి తప్ప, దాని తాలుకా స్లిప్పులు రాసి ఇవ్వడానికి తప్ప మిల్లర్లతో మాట్లాడే చర్యలు రైతు భరోసా కేంద్రాల్లో జరగడం లేదు. ఫలితంగా ఈ కేంద్రాలు కేవలం రాతిబొమ్మలుగానే మిగిలిపోయాయి.
• రైతు భరోసా కేంద్రాలు చాలా గ్రామాల్లో కనీసం తెరవడం లేదు. సిబ్బంది రావడం మాట దేవుడెరుగు… కేంద్రం ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితిగా తయారైంది. దీంతో క్షేత్రస్థాయిలో రైతులకు మద్దతు ధర రావడం లేదు. కేంద్రం ప్రకటించినట్లుగా క్వింటా ధాన్యం బస్తాకు రూ.2,050 ధర వచ్చినా, రైతుకు మేలు జరుగుతుంది. అదీ ఎక్కడా అందడం లేదు. నాణ్యత గల పంట వేసినా దానిని అమ్ముకోవడానికి నానా రకాల యాతన పడుతున్నారు.
• వాణిజ్య పంటల పరిస్థితీ అలాగే ఉంది. రాన్రాను సాగు పెట్టుబడి పెరిగిపోవడం ఒక ఎత్తయితే, నకిలీ విత్తనాల బెడద అధికంగా ఉంది. పత్తి, మిరప విత్తనాలు కోకొల్లలుగా నకిలీవి దర్శనం ఇస్తున్నాయి. దీనికి అడ్డుకట్టపడకపోతే రైతులు దివాళా తీసే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు నకిలీ విత్తనాల దెబ్బకు విలవిల్లాడుతున్నారు.
• కష్టాలకోర్చి పంటను పండిస్తే రైతులకు దక్కేది సున్నా. రైతు భరోసా డబ్బులను వేస్తున్నామని చెబుతున్న సర్కారు కనీసం కౌలు రైతుల లెక్కలు తీయడానికి కూడా ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో 70 నుంచి 80 శాతం మేర కౌలు రైతులే కనిపిస్తుంటే, దానిని కనీసం పట్టించుకున్న దాఖలాలు, వారికి సాంత్వన చేకూర్చే చర్యలు రాష్ట్రంలో మచ్చుకైనా కానరాని పరిస్థితి కనిపిస్తోంది.