వర్ష బీభత్సం కారణంగా వాగులో చిక్కుకున్న రైతులు.. హెలికాప్టర్ ద్వారా కేటీఆర్ సాయం

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తుoడగా జనం జీవనం స్తంభించిపోయింది. వరదల ధాటికి వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలంలో పలువురు రైతులు వాగులో చిక్కుకుపోయారు. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. కుందనపల్లికి చెందిన కొందరు రైతులు పొలాల్లో ఉన్న మోటర్లను తీసుకొచ్చేందుకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో చలి వాగు ఉద్ధృతంగా ప్రవహించింది.దీంతో ఏ మాత్రం దిగినా కొట్టుకుపోయేంతలా ప్రవాహం పెరిగింది. వరదలో చిక్కుకున్న తమను కాపాడాలంటూ ఆ రైతులు స్థానిక నేతలకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు రైతులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సమాచారం అందుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. అక్కడి పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌కు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. హెలికాప్టర్ వస్తే తప్ప వారిని కాపాడలేమని మంత్రికి తెలిపారు. వారి విజ్ఞప్తికి స్పందించిన కేటీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌ను జయశంకర్ జిల్లా టేకుమట్ల ప్రాంతానికి పంపించారు.