ఫీజు రీఎంబర్స్ మెంట్ ఎగ్గొట్టారు

*విద్యార్థుల పక్షాన నిలబడతాం….సర్కారును నిలదీస్తాం
*విద్యార్థి సంఘాలకు పవన్ కళ్యాణ్ భరోసా

ఎన్నికల ముందు పాదయాత్రలంటూ రోడ్ల వెంట తిరుగుతూ మాట తప్పం.. మడమ తిప్పం అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్ ఎగ్గొట్టారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. విద్యార్ధులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, వారి భవిష్యత్తును నాశనం చేస్తోందని అన్నారు. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి సంఘాల నుంచి పలువురు విద్యార్ధులు ఫీజు రీఎంబర్స్ మెంటు సమస్యపై అర్జీ సమర్పించారు. ఫీజు రీఎంబర్స్ మెంటు నిలిపివేయడం వల్ల పడుతున్న ఇబ్బందులు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. అధికారకాంక్షతో ఎన్నికల ముందు నోటికి వచ్చిన హామీలన్నీ ఇవ్వకూడదు. ఆచరణలో పెట్టగలిగినవే చెప్పాలి. హామీలు అమలు చేయలేని పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో చేయలేకపోయామో ప్రజలకు వివరణ ఇవ్వాలి. అధికారంలోకి వచ్చేశాం కదా సమాధానం చెప్పాల్సిన పని లేదు అంటే ఏం చేసినా చూస్తూ ఊరుకునే 1990ల నాటి తరం కాదు ఇప్పుడున్నది. ప్రశ్నించేతత్వం ఉన్న కొత్తతరం. పాదయాత్రలు చేస్తూ.. ముద్దులు పెడుతూ తిరిగినప్పుడు ఎంత చదువుకున్నా ఫీజు రీఎంబర్స్ మెంటు ఇస్తాం.. అండగా నిలబడతాం అని చెప్పి ఇప్పుడు అర్హులైన విద్యార్ధులకు మూడు టర్ముల నుంచి ఫీజు రీఎంబర్స్ మెంటు డబ్బు చెల్లించడం లేదు. ఈజ్ ఆఫ్ బిజినెస్ చేయడం అంటే విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకోవడమా? గత 18 సంవత్సరాల్లో ఫీజు రీఎంబర్స్ మెంటు ఎప్పుడూ ఆగింది లేదు. విద్యార్ధులు బస్సు ఛార్జీలకు, హాస్టల్ ఫీజులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్ మెంటు వ్యవహారంలో విద్యార్ధుల పక్షాన నిలబడతాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించి వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు.