పరదాలు.. బారికేడ్లు.. పోలీసు బలగాల మధ్య తిరిగే వారిని నాయకుడు అనరు

*కడ వరకూ ప్రజాక్షేమాన్ని కోరుకునే వాడినే నాయకుడు అంటారు
* సీఎం వస్తుంటే ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు
* అరాచక కుటుంబ పాలనపై పోరాడిన చరిత్ర జన సైనికులదే
* చీపురుపల్లిలో జనసేన పక్షాన 65 ఏళ్ల మహిళ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం
* ఉత్తరాంధ్రలో ప్రతి ఇంటిపై జనసేన జెండా ఎగిరేలా ప్రజా పోరాటాలు చేయాలి
* చీపురుపల్లి నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

కడ వరకూ ప్రజాక్షేమాన్ని కోరుకునే వారిని నాయకుడు అంటారు… పరదాల చాటున, పోలీసుల బలగాల సాయంతో ప్రజల మధ్యకు వచ్చేవారిని ఏమనాలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నరసన్నపేటలో వేలాది మంది పోలీసు బలగాలతో కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. బస్సులు, ఆటోలు తిరగక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రజలకు ఎన్నో ముద్దులు పెట్టి, అధికారం సంపాదించారు.. ఇప్పుడు కనీసం వారిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు.. నిజమైన ప్రజా నాయకుడు అయితే ప్రజలే క్షేత్రస్థాయిలో జగన్ రెడ్డి వెన్నంటే ఉంటారని, బారికేడ్లు, పరదాలు అవసరం ఉండదని అన్నారు. పోలీసు బలగాల మధ్య బారికేడ్లు, పరదాలు వేసుకొని తిరిగేవాళ్లని నాయకుడు అనరని చెప్పారు. గురువారం ఉదయం ఉమ్మడి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ జనసైనికులు, వీర మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “ఉత్తరాంధ్ర అంటే కష్టపడే మనస్తత్వం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఆదర్శవంతంగా జీవించాలనుకునే వ్యక్తిత్వం. దేశానికి ఉపయోగపడాలనే ఆలోచన. అందుకే ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది యువత ఆర్మీ, పోలీస్ శాఖలో జాయిన్ అవ్వడానికి ఉత్సాహం చూపిస్తారు. అలాంటి ఉత్తరాంధ్రను మూడు, నాలుగు కుటుంబాలకు పరిమితం చేయడం అంటే అది దేశానికి అన్యాయం చేయడమే. ఈ ప్రాంతానికి చెందిన యువత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్లు ఎప్పుడూ చెప్పేది ఒక్కటే … ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి, ప్రకృతి వనరుల దోపిడీ, వలసలు, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు వంటి అంశాలపై వివరిస్తుంటారు. నిజానికి బొత్స, ఆయన కుటుంబాన్ని ఎదుర్కొని నిలబడింది జనసేన నాయకులు కాదు జనసైనికులు. వాళ్లే తెగించి పార్టీ కోసం చివరి వరకు నిలబడ్డారు. చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలకు పోకుండా అందరినీ కలుపుకొని వెళ్లి, ప్రజా పోరాటాలు చేస్తే అడ్డుకునే వారు ఎవరు ఉంటారు. మీరు ప్రజాక్షేమం కోసం చేసే ప్రతి కార్యక్రమానికి పార్టీ సహకరిస్తుంది. పోలీసుల అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. న్యాయపరంగా పార్టీ మీకు అండగా నిలుస్తుంది.
* నాలుగు బ్యానర్లు… మూడు ప్లెక్సీలు కడితే నాయకులు అయిపోరు
స్థానిక ఎన్నికల్లో బెదిరింపులు…దాడులు… దౌర్జన్యాలు… నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని ప్రలోభపెట్టడం ఇలా ఎన్నో చేసినా ఈ ప్రాంతం నుంచి 23 మంది ధైర్యంగా నిలబడ్డారు. ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు సబబు కాదని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చివరి వరకు పోరాడారు. ముఖ్యంగా 65 ఏళ్ల పార్వతి గారు మన పార్టీ పక్షాన పోరాడిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. ఎన్ని బెదిరింపులు, ప్రలోభాలు ఎదురైనా చీపురుపల్లి జడ్పిటీసీగా పోటీ చేసి వెయ్యి ఓట్లు సాధించింది. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమె అంత చేస్తే మనం ఇంకెంత పార్టీ కోసం కష్ట పడాలి..? నాలుగు బ్యానర్లు, మూడు ఫ్లెక్సీలు కట్టి నేనే నాయకుడు అనుకుంటే పొరపాటు. పార్టీలో ఎవరు కొత్తగా చేరినా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. గౌరవిస్తాం. జిల్లా అభివృద్ధి గురించి వాళ్లతో చర్చిస్తాం తప్ప.. సీటు ఇస్తాం. నియోజకవర్గం ఇంఛార్జిను చేస్తామని చెప్పే సంప్రదాయం జనసేన పార్టీలో లేదు. ముందుగా ఒక జనసైనికుడిగా పనిచేయమని మాత్రమే చెబుతాం. జన సైనికుల ఉమ్మడి నిర్ణయంతోనే మీ నాయకత్వం నిర్ణయిస్తాం. సమాజంలో మార్పు వచ్చే విధంగా కష్టపడాలి తప్ప… సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టి నేనే నాయకుడిని అంటే కుదరదు.
* యువత రాజకీయాలను కెరీర్ గా ఎంచుకోవాలి
రాజకీయాల్లో ఓపిక, సహనం చాలా అవసరం. అలా ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశం వస్తుంది. నిస్వార్ధంగా పనిచేసే ప్రతి జనసైనికుడిని గుర్తించే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ఎవరు మిమ్మల్ని గుర్తించడం లేదు అని అనుకోకండి. మీరు ప్రజల కోసం ప్రజల తరఫున చేసే ప్రతి పనిని పార్టీ గుర్తిస్తుంది. అలాంటి నాయకత్వాన్ని తయారు చేయడమే శ్రీ పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. యువత కూడా రాజకీయాలను కెరీర్ గా ఎంచుకోవాలి. గ్రామాలు, వార్డులు తిరగాలి. స్థానిక సమస్యలపై అవగాహన తెచ్చుకోవాలి. మీ దగ్గర సమాచారం ఉంటే ఆ సమస్య పట్ల ఇంకా బలంగా పోరాటం చేయగలుగుతారు. అన్ని విషయాల మీద అవగాహన పెంచుకోవడం నేర్చుకోండి. జిల్లాను చాలా సమస్యలు వేధిస్తున్నాయి. ప్రకృతి వనరుల దోపిడి జరుగుతోంది. తాగునీటి సమస్య వేధిస్తోంది. పర్యాటకాన్ని చంపేశారు. వీటన్నింటిపై బలంగా పోరాటం చేయండి. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే పార్టీగా జనసేన పార్టీకి పేరు ఉంది. అదే పంథాలో ముందుకు సాగండి. జనసేన జెండా ప్రతి ఇంటిపై ఎగిరేలా… ప్రతి సందులో కనిపించేలా మనం ముందుకెళ్లాలి” అన్నారు.
* చూపునకు నోచుకోని వ్యక్తికి జనసేన భరోసా
ప్రభుత్వ నిబంధనల పేరుతో పింఛను సైతం నిలిపివేసిన అంధ దివ్యాంగుడికి మనోహర్ భరోసానిచ్చారు. 100 శాతం అంధత్వం ఉన్నట్లు సదరం ధ్రువపత్రం ఇచ్చినా, నిబంధనల సాకుతో చీపురుపల్లికి చెందిన అల్లాడ శ్రీనివాసరావు అనే యువకుడు తనకు ప్రభుత్వ ఫించను నిలిపివేసినట్లు మనోహర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మనోహర్ పింఛను పునరుద్ధరించే వరకు జనసేన పార్టీ ప్రతినెలా రూ.5 వేలు ఆర్థిక సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.