కావేరీ జలాలపై మళ్ళీ కర్నాటక, తమిళనాడు మధ్య జగడం..

కావేరీ జలాలపై మళ్ళీ కర్నాటక, తమిళనాడు మధ్య జగడం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. చామరాజనగర్, రామనగర్ జిల్లాల సరిహద్దుల్లో కావేరీ నదిపై మకధాటు ప్రాజెక్ట్ (డ్యాం) నిర్మాణానికి అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇందుకు లీగల్ మార్గాలను కూడా పరిశీలిస్తోంది. కానీ దీనిపై అప్పుడే తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం ప్రకటించింది. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ డ్యామ్ నిర్మిస్తామన్న కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప చేసిన ప్రకటనపై తమిళనాడు మండిపడుతోంది. ఇదివరకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ మళ్ళీ తాజాగా తమ అభ్యంతరాలను తెలుపుతూ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనుంది. కేంద్రం నుంచి గానీ, అత్యున్నత న్యాయస్థానం నుంచి గానీ కచ్చితమైన ఆదేశాలు లేని కారణంగా కావేరీ అవార్డును (తీర్పును) కర్ణాటక పక్కన బెట్టవచ్చునని తమిళ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఏ మాత్రం అనుమతించరాదంటూ తమిళనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి దురై మురుగన్ కేంద్రాన్ని కోరారు. కానీ తాము ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ రిపోర్టును ఉంచినందున పనులను ప్రారంభించే హక్కు తమకే ఉందని, న్యాయ బద్ధంగా వీటిని చేపడతామని కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప నిన్న ప్రకటించారు.

ఈ విషయంలో తమకు సహకరించాలని కోరుతూ ఈ నెల 3 న తమిళనాడు సీఎం స్టాలిన్ కి ఆయన లేఖ రాశారు. మీ రాష్ట్ర ప్రయోజనాలకు ఇది భంగం కలిగించబోదన్నారు. అయితే స్టాలిన్ తక్షణమే ఇందుకు అభ్యంతరం చెప్పారు. మీరు ఈ ప్రాజెక్టు కడితే మాకు నీళ్ల కష్టాలు తప్పవని..అయినా మీకు తగినంత నీటి లభ్యత ఉందని ఆయన అన్నారు. మకెదాటు ప్రాజెక్టు వ్యవహారాన్ని కర్ణాటక సీఎం ఇంత హఠాత్తుగా లేవనెత్తారంటే అది తన నాయకత్వంపై కొందరు ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో వారి దృష్టిని మళ్లించడానికే అంటున్నారు.