వైకాపాని వేధిస్తున్న వైరి వర్గాల పోరు

* అధికార పార్టీలో అంతకంతకు పెరుగుతున్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు
* దాడుల‌కు దిగుతున్న ముఠాలు
* కొట్లాట‌ల నుంచి హ‌త్య‌ల‌కు చేరుతున్న క‌ల‌హాలు
* ప‌లు నియోజ‌క వ‌ర్గాల్లో బాహాబాహీలు
* పోలీసుల జోక్యం త‌ప్ప‌ని ప‌రిస్థితులు
* కోర్టులకు ఎక్కుతున్న క‌క్ష‌లు

ప‌ల్లకీ మోస్తున్న బోయీలు, వారిలో వారు కొట్టుకుంటే ఏమ‌వుతుంది? ప‌ల్ల‌కీ కింద ప‌డుతుంది. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి వైకాపాలో క‌నిపిస్తోంది. అధికార పార్టీ నేత‌లు రెండు వ‌ర్గాలుగా మారిపోయి క‌క్ష‌లు కావేషాల‌తో ర‌గిలిపోతున్నార‌న‌డానికి గ్రామ స్థాయి నుంచి, నియోజ‌క వ‌ర్గాల ప‌రిధి వ‌రకు అనేకానేక ఉదాహ‌ర‌ణ‌లు అడుగ‌డుగునా క‌నిపిస్తున్నాయి. ఎడ‌మొహం, పెడ‌మొహం స్థాయి నుంచి… విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌ల ద‌శ నుంచి… తిట్లు దూష‌ణ‌ల ప‌రిధి నుంచి… కుమ్ములాట‌లు బాహాబాహీల ఎల్ల‌లు దాటి… ఇప్పుడు ఏకంగా హ‌త్య‌ల‌కే తెగ‌బ‌డే ప‌రిస్థితులు, వైకాపాని ఇప్పుడు మేడి పండు చందంగా మార్చేశాయి. స్థానిక ఎన్నిక‌ల నుంచి ర‌గులుకున్న విభేదాలు నివురుగ‌ప్పిన నిప్పులా ర‌గులుకుని, మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి ఏకంగా రోడ్డుకెక్కిన సంగతి బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఒక‌రిపై ఒక‌రు పోలీసు స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేసుకోవ‌డం, ఒక‌రిపై ఒక‌రు కోర్టుల్లో కేసులు వేసుకోవ‌డం అనేక నియోజ‌క వ‌ర్గాల ప‌రిధిలో స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. అధికార పార్టీకి చెందిన రెండు వ‌ర్గాల నేత‌లు ప‌ర‌స్ప‌ర ద్వేషాల‌తో రగిలిపోతుంటే, సామాన్య ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ఎవ‌రికి చెప్పుకోవాలో కూడా తెలియ‌క మిన్న‌కుండిపోతున్న ప‌రిస్థితులు గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, నియోజ‌క వ‌ర్గాల్లో అనేక చోట్ల క‌నిపిస్తోంది.
*ప‌రాకాష్ఠ ప‌రిస్థితులు…
మామూలుగా ఓ రాజ‌కీయ నాయ‌కుడి హ‌త్య జ‌రిగితే, ప్ర‌త్య‌ర్థి పార్టీ వాళ్లు ప‌గ‌బ‌ట్టి చంపేశార‌నుకోవ‌డం సాధార‌ణం. కానీ ఒక పార్టీ నాయ‌కుడిని అదే పార్టీ వాళ్లు వెంట‌ప‌డి మ‌రీ మ‌ట్టుబెట్ట‌డం అసాధార‌ణం. అలాంటి అసాధార‌ణ హ‌త్యే ఏలూరు జిల్లా జి.కొత్త‌ప‌ల్లిలో జ‌రిగింది. వైకాపా నాయ‌కుడు, గ్రామ అధ్య‌క్షుడు గంజి నాగ ప్ర‌సాద్‌ని అదే పార్టీకి చెందిన వారు దారుణంగా న‌రికి చంపేశారు. ఆ తర్వాత పోలీసు స్టేష‌న్‌కి వెళ్లి స్వ‌యంగా లొంగిపోయారు. హ‌త్య‌కు గురైన నాగ ప్ర‌సాద్ మృత‌దేహాన్ని చూడ‌డానికి వ‌చ్చిన వైకాపా ఎమ్మెల్యే త‌లారి వెంకట్రావుపై అదే పార్టీకి చెందిన వాళ్లు పోలీసులు, ప్ర‌జ‌ల స‌మ‌క్షంలోనే దాడికి తెగ‌బ‌డ్డారు. రెచ్చిపోతున్న వైరి వ‌ర్గాల బారి నుంచి ఎమ్మెల్యేను ర‌క్షించ‌డానికి పోలీసుల‌కు మూడున్న‌ర గంట‌ల స‌మ‌యం ప‌ట్టిందంటే అక్క‌డ వ‌ర్గాల ఆధిప‌త్య పోరు ఏ స్థాయికి చేరుకుందో అర్థం అవుతుంది. గంజి నాగ‌ప్ర‌సాద్, స్థానిక ఎంపీటీసీ బిరుదుగ‌డ్డ బ‌జార‌య్య ఇద్ద‌రూ వైకాపాకి చెందిన వారే. ఇళ్ల స్థ‌లాల పంపిణీలో బజార‌య్య అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ లోగ‌డ జ‌రిగిన గ్రామ స్థాయి స‌మావేశంలో గంజి నాగ ప్రసాద్ ఆరోపించ‌డంతో పెల్లుబికిన విభేదాలు ఆఖ‌రికి హ‌త్య‌కు దారితీశాయి. ఈ విభేదాలు ఎమ్మెల్యే దృష్టికి వెళ్లినా ఆయ‌న ఇరు వ‌ర్గాల వారినీ స‌మాధాన ప‌ర‌చ‌లేక‌పోయారు. బ‌జార‌య్య ఎమ్మెల్యే అనుచ‌రుడు కావ‌డంతో, ఆయ‌న అండ‌దండ‌ల‌తోనే ఈ హ‌త్య జ‌రిగింద‌నే ఉద్దేశంతో సొంత పార్టీ వాళ్లే ఆయ‌న‌పై దాడి చేయ‌డం… వైకాపాలో అంత‌ర్గ‌త క‌ల‌హాల స్థాయిని తేట‌తెల్లం చేస్తోంది. అంతేకాదు… ఇళ్ల స్థ‌లాల పంపిణీ లాంటి వ్య‌వ‌హారాలు పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అవ‌క‌త‌వ‌క‌లు, అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంద‌నే విమ‌ర్శ‌ల‌కు కూడా ఈ పొరపొచ్చాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
*ఒకేరోజు రాజుకున్న క‌క్ష‌లు…
ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి అనేక చోట్ల అధికార పార్టీ నేతలు రెండు వ‌ర్గాలుగా విడిపోవ‌డం రాష్ట్రంలో అడుగ‌డుగునా క‌నిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ హ‌త్య జ‌రిగిన రోజే రాష్ట్రంలో మ‌రో నాలుగు చోట్ల వైకాపాలో వ‌ర్గ రాజకీయాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ఒక‌టి చీరాల‌లో అయితే రెండోది నంద్యాల‌లో. ఈ రెండు చోట్ల పుర‌పాల‌క సంఘ స‌మావేశాల్లో వైకాపా వ‌ర్గాల వాళ్లు బాహాబాహీకి, తోపులాట‌ల‌కు సిద్ద‌మవ‌గా… ప్ర‌కాశం జిల్లా పెద్దార‌వీడులో పుర‌పాల‌క శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఎదురుగానే వైకాపా వ‌ర్గాలు వాదులాట‌కు దిగ‌డంతో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. మ‌రో సంఘ‌ట‌న నంద్యాల ప‌ట్ట‌ణంలో జ‌ర‌గ‌గా విష‌యం క‌లెక్ట‌ర్ వ‌ర‌కు వెళ్లింది.
1. చీరాల‌లో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్‌, ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ మూర్తి వ‌ర్గాల‌కు చెందిన కౌన్సిల‌ర్లు తోపులాట‌కు త‌ల‌ప‌డ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఆఖ‌రికి సీఐ ఆధ్వ‌ర్యంలో పోలీసులు వ‌చ్చి జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. అంబేద్క‌ర్ విగ్ర‌హానికి రంగులు వేయలేద‌నే చిన్న విషయం కూడా వర్గాల మ‌ధ్య కొట్లాట‌కు దారితీసిందంటే అంత‌ర్గ‌త విభేదాలు ఏ స్థాయిలో ఉన్న‌యో అర్థం అవుతోంది.
2. ఇక నంద్యాల‌లో వైస్ ఛైర్మ‌న్ పాంషావ‌లి, కౌన్సిల‌ర్ కృష్ణ‌మోహ‌న్ మ‌ధ్య మాటా మాటా పెరిగి స‌మావేశం ర‌సాభాస‌గా మారింది. ఇద్ద‌రూ వైకాపాకు చెందిన వారే. నంద్యాల ప్ర‌ధాన ర‌హ‌దారిలో ఆక్ర‌మ‌ణ‌ల విష‌యం ఈ ర‌గ‌డ‌కు కార‌ణ‌మైంది.
3. అలాగే ప్ర‌కాశం జిల్లా పెద్దార‌వీడులో సున్నా వ‌డ్డీ చెక్కుల పంపిణీ, వాలంటీర్ల స‌న్మానంలో మంత్రి సురేష్ ఎదుటే వైకాపాకు చెందిన రెండు వ‌ర్గాల నాయ‌కులు స్థానిక స‌మ‌స్య‌ల‌ను వివ‌రించే క్ర‌మంలో వాదులాట‌కు దిగారు. ఉపాధి ప‌నుల్లో ఓ వ‌ర్గం వారికే హాజ‌రు వేస్తున్నార‌నే ఆరోప‌ణ‌ ర‌భ‌స‌కు కార‌ణ‌మైంది. డీల‌ర్‌షిప్‌, వాట‌ర్ ట్యాంక‌ర్ల విష‌య‌మై ఒక‌రిపై ఒక‌రు విమర్శ‌లు చేసుకుంటూ వాగ్వివాదానికి దిగారు. చివ‌ర‌కు పోలీసులు స‌ర్ద‌చెప్ప‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.
4, నంద్యాలలో వార్డు స‌చివాల‌యంలోనే వార్డు ప‌రిపాల‌న కార్య‌ద‌ర్శి కేవీ సుధాక‌ర్‌పై వైకాపా కౌన్సిల‌ర్ కుమారుడు శివ దాడి చేశారు. ఓటీఎస్ విష‌యంలో ఇరు వ‌ర్గాల వారు రావాల‌ని సుధాక‌ర్ అన‌డంతో శివ కోపం ప‌ట్ట‌లేక దాడి చేసి కొట్టార‌నేది ఆరోప‌ణ‌. ఈ మేర‌కు సుధాక‌ర్ ఎస్పీకి లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేయ‌డంతో పాటు క‌లెక్ట‌ర్‌కి కూడా ఫిర్యాదు చేశారు.
ఈ సంఘ‌ట‌న‌ల‌న్నీ వైకాపాలో పైనుంచి కింది వ‌ర‌కు అంత‌ర్గ‌త ఆధిప‌త్య పోరాటాలు ఎలా రోడ్డున ప‌డుతున్నాయో చెప్పేందుకు సాక్ష్యాలే!
*ఎందెందు వెదికి చూసినా క‌ల‌హాలే…
అధికార వైకాపా పార్టీలో కుమ్ములాట‌లు ఏ స్థాయికి చేరాయంటే ఒక వ‌ర్గం నాయ‌కుడి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను సైతం వైరి వ‌ర్గం వారు చింపేసేటంత‌! ఇంత‌లా నిప్పు, ఉప్పులా ఉండే వైకాపా వ‌ర్గాలు అనేక చోట్ల ఆధిప‌త్యం కోసం వెంప‌ర్లాడుతూ ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌కు సైతం అడ్డంకిగా మారుతున్నాయ‌న‌డానికి అనేక ఉదాహ‌ర‌ణ‌లు…
* పొన్నూరు ఎమ్మెల్యే రోశ‌య్య‌, ఇదే స్థానం నుంచి 2014లో పోటీ చేసిన రావి వెంక‌ట ర‌మ‌ణ వ‌ర్గాల మ‌ధ్య సామాజిక మాధ్య‌మాల్లో మొద‌లైన విభేదాలు ఆఖ‌ర‌కి కోర్టులో కేసులు వేసుకునేంత వ‌ర‌కు వెళ్లాయి.
* మంత్రి రోజాకు ఆమె నియోజ‌క‌వ‌ర్గ‌మైన న‌గ‌రిలోని అయిదు మండ‌లాల్లోనూ వ్య‌తిరేక వ‌ర్గాలు ఉన్నాయి. మ‌రో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఎమ్మెల్యే, జెడ్‌పీటీసీ స‌భ్యులు, ఎమ్‌పీటీసీ స‌భ్యులు… ఇలా వేర్వేరు వ‌ర్గాలుగా వైకాపా చీలిపోయిన ప‌రిస్థితులు ఇక్కడ క‌నిపిస్తున్నాయి.
* ప్ర‌కాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మంత్రి సురేష్ అనుచ‌రులు రెండు వ‌ర్గాలుగా మారిపోయి కారాలు మిరియాలు నూరుకుంటూ త‌ర‌చు వాగ్వివాదాల‌కు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌కు తెగ‌బ‌డుతున్నారు.
*నెల్లూరు జిల్లాలో కొత్తగా మంత్రి అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య ఉన్న పొరపొచ్చాలు పోటాపోటీ సభలు నిర్వహించుకునే స్థాయికి చేరడంతో ఇద్దర్నీ పిలిచి జగన్ క్లాస్ పీకిన సంగతి అందరికీ తెలిసిందే.
* క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ ప్ర‌సాద్ రెడ్డి, ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ వ‌ర్గాల పోరు ఒక‌రి ఫ్లెక్సీలు ఒక‌రు చింపుకునే ద‌శ నుంచి ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకునేంత వ‌ర‌కు వెళ్లింది.
* వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుచ‌రుల మ‌ధ్య కేసులు పెట్టుకునేంత స్థాయిలో క‌క్ష‌లు క‌నిపిస్తున్నాయి.
* నంది కొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి, ఎమ్మేల్యే వ‌ర్గాల కుమ్ములాట‌లు అడుగ‌డుగునా వ్య‌క్త‌మ‌వుతూ ఆఖ‌రికి టీవీ ఛానెళ్ల‌లో ఆరోపించుకోవ‌డం వ‌రకు వెళ్లాయి.
* ఇలా చూస్తే… పి. గ‌న్న‌వ‌రం, కోడుమూరు, తాడికొండ‌, బ‌ద్వేలు, చీరాల‌, ద‌ర్శి, జ‌మ్మ‌ల మ‌డుగు, గ‌న్న‌వ‌రం, రామ‌చంద్ర‌పురం, ఎల‌మంచిలి, నెల్లిమ‌ర్ల‌, శృంగ‌వ‌ర‌పుకోట‌, రాజమ‌హేంద్ర‌వ‌రం, మైల‌వ‌రం, ఏలూరు, నెల్లూరు… త‌దిత‌ర అనేక నియోజ‌క వ‌ర్గాల ప‌రిధిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీల స్థాయి నుంచి ప‌ట్ట‌ణ‌, మండ‌ల‌, గ్రామ ప్ర‌తినిధుల వ‌ర‌కు వైకాపా పార్టీలో అడుగ‌డుగునా వ‌ర్గాల పోరు తారాస్థాయికి చేరిన సంఘ‌ట‌లు త‌ర‌చు వెలుగు చూస్తున్నాయి.
*కార‌ణాలు ఇవే…
అధికార పార్టీకి చెందిన నేత‌లే కాదు, వారి కొడుకులు, భ‌ర్త‌లు, బంధువులు కూడా వేర్వేరు ప‌నుల విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం రాష్ట్రంలో అనేక చోట్ల క‌నిపిస్తోంది. ప‌థ‌కాల అమ‌లులో అవ‌క‌త‌వ‌క‌లు, అవినీతిపై ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం త‌ర‌చు జ‌రుగుతోంది. దీన్ని బ‌ట్టి ప్ర‌జాప్ర‌యోజ‌న‌క‌ర వ్య‌వ‌హారాల్లో స్థానిక నేత‌లు త‌మ ఆధిప‌త్యం చెలాయించ‌డానికి, త‌మ అనుచ‌రుల‌కు ల‌బ్ది క‌లిగేలా చూడ‌డానికి ప్ర‌య‌త్నిస్తుండ‌డ‌మే ఇలాంటి ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మ‌ని ఎవ‌రికైనా అర్థం అవుంతోంది. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల క‌న్నా త‌మ అనుచ‌రులకు మేలు చేయించ‌డం కోసం ప‌ట్టు ప‌డుతున్న స్థానిక నేత‌లు వైకాపా ప‌రిస్థితిని అంత‌కంత‌కు దిగ‌జారుస్తున్నారు. ఇన్నాళ్లూ నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న ఆధిప‌త్య పోరు, ఇప్పుడు అగ్నిప‌ర్వ‌తం నుంచి పెల్లుబుకుతున్న లావాలా విరుచుకుపడుతోంది. ఈ ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే… అధికార పార్టీకి జ‌రిగే న‌ష్టం సంగ‌తి అలా ఉంచితే ప్ర‌జల ప్ర‌యోజ‌నాల‌కు మాత్రం తీవ్ర‌మైన అవ‌రోధాలు ఏర్ప‌డుతాయ‌న‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు.