అర్హులైన లబ్దిదారులందరికీ మత్స్యకార భరోసా అందాలి
• మత్స్యకార భరోసా ఎంపికలో ప్రభుత్వ చర్యలు దుర్మార్గం
• ముఖ్యమంత్రి ఎన్నికల హామీలకు విరుద్దంగా లబ్దిదారుల ఎంపిక
• తల్లికి పథకం వస్తే .. కొడుక్కి మత్స్యకార భరోసా తీసేస్తారా?
• రీ సర్వే తర్వాతే తుది జాబితా ప్రకటించాలి
• కాకినాడలో మీడియాతో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
• మత్స్యకార ఉప సంచాలకులకు వినతిపత్రం
అర్హత ఉన్న ప్రతి లబ్దిదారుడికీ మత్స్యకార భరోసా అందాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు డిమాండ్ చేశారు. నిబంధనల పేరిట లబ్దిదారులను సగానికి సగం కుదించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 30వ తేదీ ప్రకటించే లబ్దిదారుల తుది జాబితాను ఆపి క్షేత్ర స్థాయిలో రీ సర్వే చేయించాలని కోరారు. మత్స్యకార భరోసా లబ్దిదారుల ఎంపికలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఒక్క కాకినాడలోనే 9 వేల మంది అర్హులైన లబ్దిదారులు ఉంటే కేవలం 2300 మందిని మాత్రమే ఎంపిక చేసినట్టు తెలిపారు. మత్స్యకార భరోసా అమలులో అవకతవకలపై శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలోని మత్స్యశాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి.వి. సత్యనారాయణకు అర్హులైన లబ్దిదారులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. వేట నిషేధ కాలంలో ఇచ్చే జీవన భృతిని రూ.30 వేలకు పెంచాలని ఈ వినతి పత్రంలో సూచించారు. పెరిగిన ధరలతో మత్స్యకారులకు ఇచ్చే రూ.10 వేలు ఏ మాత్రం సరిపోవడం లేదు అని తెలిపారు. అనంతరం మీడియాతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “మత్స్యకారుల సమస్యల మీద.. మత్స్యకార భరోసా వ్యవహారంలో ఈ ప్రభుత్వం చేస్తున్న మోసం మీద కాకినాడ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. ముఖ్యమంత్రి కాక ముందు శ్రీ జగన్ రెడ్డి ఇచ్చిన హామీలకు విరుద్దంగా నిబంధనలు తీసుకువచ్చి ప్రతి పథకం నుంచి లబ్ధిదారుల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మత్స్యకారులు వేట విరామం ప్రకటించిన సమయంలో ఇచ్చే భరోసా విషయంలో వారికి న్యాయం జరగడం లేదు. కాకినాడలో జనసేన నాయకులు ఇంటింటికీ తిరిగి సర్వే చేసి సమాచారం సేకరించారు. కాకినాడ పట్టణంలో 9 వేల మంది లబ్దిదారులు ఉంటే 2300 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కేవలం 21 వేల మందికి మాత్రమే భరోసా వర్తిస్తుందని ప్రకటించబోతున్నారు. రెండు జిల్లాల్లో 2 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. దుర్మార్గమైన ఈ ప్రభుత్వ తీరుని ప్రతి ఒక్కరు ఖండించాలి. జనసేన పార్టీ తరఫున ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 30వ తేదీ ప్రకటించబోయే తుది జాబితాను ఆపాలి. కలెక్టర్ కి పంపే ముందే రీ సర్వే చేయించాలి. కాకినాడ పట్టణంలో అర్హత ఉన్న లబ్దిదారుల్ని అందరినీ ఎంపిక చేయలేదు. బోటు యజమానులు వేటకు 10 మంది వరకు వెళ్తామని చెబుతుంటే బోటుకు 6 గురిని మాత్రమే ఎంపిక చేస్తున్నారు. ఒక రేషన్ కార్డులో తల్లికి పథకం వస్తే కొడుక్కి భరోసా ఇవ్వడం లేదు. బలంగా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. జనసేన సభ్యత్వం తీసుకుంటే బెదిరిస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడికి మరోసారి చెబుతున్నాం. స్వార్థ ప్రయోజనాల కోసం మత్స్యకారుల్ని ఇక్కడి నుంచి తరలించాలని చూస్తే అంగీకరించేది లేదు. మత్స్యశాఖకు మేము ఇచ్చిన లబ్దిదారుల జాబితాను క్షేత్ర స్థాయిలో రీ సర్వే చేయించాలి. లేకుంటే సోమవారం మా పార్టీ నాయకులంతా కలసి మరోసారి వినతిపత్రాలు సమర్పిస్తార”ని అన్నారు. శ్రీ మనోహర్ గారితోపాటు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, శ్రీ కొటికలపూడి గోవిందరావు, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, పీఏసీ సభ్యులు శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పంతం నానాజీ, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ చేగొండి సూర్యప్రకాష్, శ్రీ కోన తాతారావు, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్, మత్స్యకార నాయకులు డాక్టర్ మూగి శ్రీనివాస్, శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు, పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు వినతిపత్రం అందించిన వారిలో ఉన్నారు.