మత్స్యకారుల బతుకులు కౌలు రైతుల వెతల్ని తలపిస్తున్నాయి

•ముఖ్యమంత్రికి దమ్ముంటే మత్స్యకార గ్రామాల్లో పర్యటించాలి
• సీఎం ఇప్పుడు పాదయాత్ర చేస్తే సమస్యలేమిటో కనిపిస్తాయి
• ప్రజల సమస్యలు పట్టించుకోని దద్దమ్మ.. చేతగాని ప్రభుత్వమిది
• మత్స్యకార భరోసాలో అర్హులకు కోత
• వైసీపీ హయాంలో ఒక్క జెట్టి, ఒక్క హార్బర్ నిర్మించింది లేదు
• జగనన్న పోవాలి.. పవనన్న రావాలని మత్స్యకారులు కోరుకుంటున్నారు
• కాకినాడలో ‘మత్స్యకారులకు బాసటగా జనసేన’ కార్యక్రమంలో శ్రీ నాదెండ్ల మనోహర్

‘రాష్ట్రంలో కౌలు రైతుల వెతలకు ఏ మాత్రం తీసిపోనట్లుగా మత్స్యకారుల వేదనలు ఉన్నాయి… కేవలం రూ.10 వేల వేతనానికి మత్స్యకారులు గుజరాత్, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు వలసలు వెళ్లి బతుకుతున్నార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. గతంలో మత్స్యకారులకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ సమయంలో పాదయాత్ర చేయాలని సవాల్ చేస్తున్నామన్నారు. ఓ మత్స్యకార గ్రామాన్నయినా ముఖ్యమంత్రి స్వయంగా సందర్శిస్తే వారి బాధలు, బతుకులు అర్థం అవుతాయని సూచించారు. ఇంటి యజమాని సముద్రంలో వేటకు సుదూర ప్రాంతాలకు వెళితే, బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. మాట్లాడితే బటన్ నొక్కానని చెబుతున్న ఈ ముఖ్యమంత్రి మత్స్యకారుల బతుకులను పట్టించుకోవడం మానేశారని చెప్పారు. కాకినాడలో మత్స్యకారుల సమస్యలపై శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మత్స్యకారులకు బాసటగా జనసేన’ పాదయాత్రలో శ్రీ మనోహర్ గారు పాల్గొన్నారు. మత్స్యకారులు జీవించే జగన్నాథపురం, ఏటిమొగ ప్రాంతాల మీదుగా పాదయాత్రగా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకొని మత్స్యకారుల సమస్యలను తెలియజేస్తూ సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘కష్టాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఏ మాత్రం సాయం చేయడం చేతగాని, దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఈ పాలకులకు ప్రజల సమస్యలు, బాధలు పట్టవు. మత్స్యకారులకు అవసరం అయ్యే జెట్టీలు, హార్బర్ లను గత నాలుగేళ్లలో ఒక్కటి కూడా నిర్మించలేకపోయిన అసమర్ధ ప్రభుత్వం ఇది. ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా పేర్లను మార్చి పోర్టులకు శంకుస్థాపన చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడానికి తాపత్రయపడుతున్నారు. మత్స్యకారులకు కావల్సింది ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు. వాటిని ఈ ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఎన్ని నిర్మించిందో, మత్స్యకారుల బతుకులలో ఏ మాత్రం భరోసా నింపిందో చెప్పాలి.
* మత్స్యకార జనాభా పెరుగుతోందా.. తగ్గుతోందా..?
సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇస్తున్న జగనన్న మత్స్యకార భరోసా లబ్ధిదారుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. రాష్ట్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు 2.5 లక్షల మంది ఉంటే, వలసలు వెళ్లిన వారిని సైతం కలుపుకుంటే ఆ సంఖ్య 3.5 లక్షలు పైమాటే. ప్రభుత్వం మాత్రం ఏటా వేటకు వెళ్లే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి చూపిస్తోంది. మత్స్యకార భరోసా లబ్ధిదారులను తగ్గిస్తోంది. మొదటి ఏడాది 1.3 లక్షల మంది పథకం లబ్ధిదారులుగా చూపిన ప్రభుత్వం, తర్వాత ఏడాది 1.05 లక్షల మందికి మాత్రమే మత్స్యకార భరోసాను కుదించింది. ఇప్పుడు కేవలం 80 వేల మందిని మాత్రమే అర్హులని ప్రకటిస్తోంది. దీనిలో మతలబు ఏంటి..? ప్రతి ఏడాది మత్స్యకారుల జనాభా తగ్గిపోతుందా..? లేక ప్రభుత్వం మత్స్యకారులకు భరోసా సొమ్మును దూరం చేస్తుందా అనేది సమాధానం చెప్పాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కేవలం 22 వేల మంది మాత్రమే మత్స్యకార భరోసాకు అర్హులుగా ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ లక్షలాది మంది మత్స్యకారులు ప్రభుత్వానికి కనపడకపోవడం విచిత్రంగా ఉంది. వారంతా మత్స్యకార భరోసాకు ఎందుకు అనర్హులయ్యారో అర్ధం కావడం లేదు. పథకం ప్రారంభిస్తున్నపుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు..? అర్హులైన మత్స్యకారులకు పథకం అందకుండా అన్యాయంగా ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోంది.
* జగనన్న పోవాలి.. పవనన్న రావాలి
గతంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలోని సూర్యారావుపేట నుంచి మత్స్యకార అభ్యున్నతి యాత్ర చేపట్టిన సమయంలోనే మత్స్యకారుల వ్యధాభరితమైన జీవితాలు కనిపించాయి. అభ్యున్నతి యాత్ర నర్సాపురం వెళ్లే వరకూ మార్గమాధ్యంలో ఏ మత్స్యకార గ్రామానికి వెళ్లినా మత్స్యకారులంతా ముక్త కంఠంతో జగనన్న పోవాలి.. పవనన్న రావాలి అని బలంగా కోరుకోవడం కనిపించింది. కచ్చితంగా మత్స్యకారుల కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా నిలబడ్డారు… నిలబడతారు. భవిష్యత్తులోనూ వారికి అండగా జనసేన పార్టీ ఉంటుంది. గత ఎన్నికల సమరం ప్రారంభ సమయంలోనూ గంగమ్మ తల్లికి మొక్కి, మత్స్యకారుల ఆశీస్సులు తీసుకొని కదనరంగంలోకి దిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తారు. కడలి పుత్రుల కుటుంబాలు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారు.
* ధరలు తగ్గించకుండా రాయితీ ఇవ్వడమేనా న్యాయం..?
మత్స్యకారులకు డీజిల్ రాయితీని రూ.9 చేశామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. పక్క రాష్ట్రాల్లో డీజిల్ ధర ఎంత.. రాష్ట్రంలో ఎంత అన్నది పరిశీలిస్తే, వైసీపీ దొంగ లెక్కలు అర్ధం అవుతాయి. డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాలు తగ్గించినపుడు స్పందించని వైసీపీ ప్రభుత్వం ధరలను తగ్గించకుండా అలాగే ఉంచింది. అప్పుడు ధరలు తగ్గించకుండా డీజిల్ రాయితీ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం వల్ల మత్స్యకారులకు ఒరిగిందేమి ఉండదు. డీజిల్ రాయితీ ఇచ్చే పెట్రోలు బంకులను సైతం మూసివేశారు. కొన్ని బంకులకే రాయితీని పరిమితం చేశారు. ఇది మత్స్యకారులను మరింత ఇబ్బంది పెట్టడమే అవుతుంది. పోలీసు బందోబస్తుతో, పరదాలు అడ్డు పెట్టుకొని పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజల సమస్యలు కనిపించవు. మత్స్యకార సమస్యలు పట్టవు. కనీసం కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం అందించే పథకాలకు సైతం రాష్ట్రం మోకాలడ్డుతోంది. కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో కేంద్రం నిధులు వెనక్కి వెళ్లాయి. ఏడాదికి రూ.100 కోట్లను కూడా మత్స్యకారుల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేకపోతోంది. టిడ్కో గృహాలను మత్స్యకారులకు అందించలేదు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డబ్బులు ఇచ్చి మంచినీరు కొనుగోలు చేసే దౌర్భగ్య పరిస్థితి గ్రామాలకు వచ్చింది. సంక్షేమం పేరు చెబుతూ పన్నుల బాదుడుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. చెత్త పన్ను పేరుతోనూ బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. వైసీపీ వారికే సంక్షేమం, మాకు ఓటేస్తేనే బటన్ పనిచేస్తుంది అన్నట్లుగా ప్రభుత్వం తీరు కనిపిస్తోంది.
* జనసేన జెండా కడితే భయపడుతున్నారు
పాదయాత్రలో చాలామంది యువకులు ప్రభుత్వ దమనకాండను మా దృష్టికి తీసుకొచ్చారు. జనసేన జెండా పట్టుకున్నా, ఇంటి మీద జెండా కట్టినా సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారని చెబుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఎందుకింత అభద్రతా భావం. జనసేన అంటే ఎందుకీ భయం..? ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా జనసేన పోరాటం ఆపదు. మీ అసమర్ధతను ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడతాం. శ్రీకాకుళంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువశక్తి సభలోనూ ఎందరో యువకులు తమ బతుకులకు భరోసా లేదని, కేవలం రూ.10 వేల వేతనంతో గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి గుండె ఘోషను శ్రీ పవన్ కళ్యాణ్ గారు విన్నారు. వారి వెతలను చూశారు. కచ్చితంగా జనసేన పార్టీ మత్స్యకారులకు అండగా నిలబడుతుంది’’ అన్నారు.