జీవో 117 రద్దు చేయాలి.. విద్యార్థుల సమస్యల పై జనసేన అర్జీ

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం: రాష్ట్రంలోని 47 లక్షల 50 వేల మంది విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆటలు ఆడుతున్నారని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అవనిగడ్డ విద్యాశాఖ కార్యాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు వివరిస్తూ అర్జీ సమర్పించారు.

ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 117 కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చిన్నారి బాల బాలికలు 3,4,5 తరగతులు చదివేందుకు దూరంగా ఉన్న హైస్కూల్ వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడే ప్రమాదం ఉందని వాపోయారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జీవో 117 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్న ప్రభుత్వం ఇళ్ళ వద్ద ఉన్న పాఠశాలను కాదని చిన్న పిల్లలను దూరంగా ఉన్న హైస్కూల్ వెళ్లమనడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ చర్య అన్నారు. ఈ ప్రభుత్వం పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా వదలకుండా వేధిస్తోందన్నారు. జగన్ పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, ఒక పక్క నాడు-నేడు పేరుతో స్కూల్స్ అభివృద్ధి చేస్తూ, వాటిలో చదువుతున్న పిల్లలను దూరంగా తరలించటం ఎంతవరకు సమంజసమన్నారు.

జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు మాట్లాడుతూ జగన్ నియంతృత్వ పాలన, తుగ్లక్ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. విద్యాహక్కు చట్టం ఉల్లంఘించి.. బలవంతపు ఇంగ్లీష్ మీడియం అమలుతో విద్యార్థులు అభ్యసన సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఈ ప్రభుత్వ విధానాలకు గత ఏడాది వచ్చిన టెన్త్ ఫలితాలే నిదర్శనంగా మారాయన్నారు. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలతో గతేడాది 51వేల మంది విద్యార్థులు అమ్మ ఒడి పథకానికి దూరమయ్యారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన అసమర్ధ విధానాలు విడనాడి వ్యవస్థను గాడిలో పెట్టాలని, సక్రమంగా పాఠశాలలు నడపాలని, జీవో 117 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.