పంత్‌ను వరించిన అదృష్టం.. రసవత్తరంగా మూడో టెస్ట్..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఆసీస్‎కు కలిసివచ్చిన పిచ్‎పై తొలి ఇన్నింగ్స్‎లో 338 పరుగులు చేయగా.. భారత్ 244 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‎లో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 312 రన్స్ చేసి టీమిండియా ముందు 407 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‎కు ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ జట్టుకు పునాది గట్టిగా వేశారు. అయితే.. నాల్గవ రోజు రోహిత్, గిల్ ఇద్దరు ఔట్ అవ్వడంతో భారత్‎కు గట్టిగా ఎదురుదెబ్బగా మారింది.

ఓవర్ నైట్ స్కోర్ 98/2 తో ఐదవ రోజు సోమవారం ఇన్నింగ్స్‎ను ప్రారంభించిన భారత్‎కు మొదట్లోనే షాక్ తగిలింది. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రహానే (4) పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్.. తనదైన శైలిలో ఆసీస్ బౌల్లర్లపై రెచ్చిపోయాడు. పంత్‌కు ఈ మ్యాచ్‌లో అదృష్టం బాగానే కలిసొస్తుంది. పుజారాతో కలిసి స్కోర్‎ను ముందుకు ఉరకలెత్తించాడు. మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లియాన్ బౌలింగ్‌లో పంత్‌ ఇచ్చిన క్యాచ్‌ను పైన్ వదిలేశాడు. అలానే 59 పరుగుల వద్ద పంత్ క్యాచ్‌ను మళ్లీ వదిలేశాడు పైన్. ఇక లియాన్ బౌలింగ్‌లో మరోసారి పంత్ క్యాచ్ ఇవ్వగా దానిని స్లిప్‌లో ఉన్న స్మిత్ అందుకోలేకపోయాడు. మొత్తానికి రెండో ఇన్నింగ్స్‌లో మూడు అద్భుత అవకాశాలు రావడంతో దానిని సద్వినియోగం చేసుకుంటూ వచ్చిన రిషబ్ పంత్ 12 బౌండరీలు, 3 సిక్సర్లతో 97పరుగులు చేశాడు. ఈ సమయంలో లియాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. దీంతో పుజారాతో నెలకొల్పిన 148 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.

ఇక స్టైలిష్ బ్యాట్స్ మెన్ పుజారా ఎప్పటిలాగానే ఎంతో ఎకాగ్రతతో ఆడుతూ కెరీర్‌లో మరో అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 172 బంతులు ఆడిన పుజారా 8 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. అంతేకాక 6000 పరుగులని పూర్తి చేసాడు. ప్రస్తుతానికి భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 250 పరుగులు కాగా, ఈ మ్యాచ్ గెలవాలంటే మరో 157 పరుగులు చేయాల్సి ఉంది.