విజేతలు కావాలంటే మంచి కోచ్ తప్పనిసరి

పీవీ సింధు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారుండరు. బ్యాడ్మింటన్‌లో ఎన్నో పతకాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకొస్తున్న క్రీడాకారిణి. ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలుస్తోంది. అయితే విజేతలను తయారుచేయాలంటే క్రీడాకారులతో పాటు మంచి కోచ్‌లు అవసరమని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌-19తో ఏర్పడిన విరామ సమయంలో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రాక్టీస్‌ చేయడం తాను తీసుకున్న మంచి నిర్ణయమని ప్రపంచ చాంపియన్ సింధు తెలిపింది.

ఈనెల 12 నుంచి జరుగనున్న థాయ్‌లాండ్‌ ఓపెన్‌తో సింధు మళ్లీ అంతర్జాతీయ టోర్నీ బరిలో దిగనుంది. ఇది ఒలింపిక్స్‌ ఏడాది కాబట్టి థాయ్‌లాండ్‌లో విజయంతో ఈ సీజన్‌ను గొప్పగా ప్రారంభించాలని అనుకుంటున్నానని పేర్కొంది. ప్రస్తుతం సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ఆటగాళ్లను ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని, వారి ప్రత్యేక అవసరాలను తీర్చే మంచి కోచ్‌లు దేశానికి కావాలని అంటోంది. ప్రతి ప్లేయర్‌ను విడిగా విశ్లేషించే మంచి కోచ్‌ల అవసరం చాలా ఉందని వ్యాఖ్యానించింది. ప్రతి క్రీడాకారుని ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుంది కనుక కోచ్‌, ప్లేయర్‌ ఆలోచనా విధానాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా ఆ క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి చేయాల్సిన పనుల్లో మార్పులు చేయాలని పేర్కొంది. వచ్చే కొన్నేళ్లలో మరింత మంది షట్లర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించి, మెరుగైన ప్రదర్శన చేస్తారనే నమ్మకాన్ని సింధు వ్యక్తం చేసింది. రాబోయే కాలంలో బ్యాడ్మింటన్‌కి మంచి రోజులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.