క్రికెట్‌కు వీడ్కోలు: మహేంద్రసింగ్‌ ధోనీ

క్రికెట్‌ చరిత్ర లో ఓ అధ్యాయం ముగిసింది. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ అనూహ్యంగా శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసి కేవలం సింగిల్‌ లైన్‌తో తన ఉద్దేశం తెలిపాడు. ‘కెరీర్‌ ఆద్యంతం నన్ను ప్రేమించడంతో పాటు మద్దతుగా నిలిచిన మీ అందరికీ కృతజ్ఞతలు. రాత్రి 7.29 నుంచి ఇక నేను రిటైర్‌ అయినట్టుగా భావించండి’ అని 39 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్‌ క్లుప్తంగా పేర్కొన్నాడు.  2004లో కెరీర్‌ను ఆరంభించిన మహీ గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై చివరి మ్యాచ్‌ ఆడాడు. అప్పుడే ధోనీ వీడ్కోలుపై కథనాలు వెలువడినా అతను మాత్రం స్పందించలేదు. అటు ఫ్యాన్స్‌ కూడా కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌ ఆడతాడని నమ్మకంగా ఉన్నారు. కానీ ఎవరి అంచనాలకు అందని ఎంఎస్‌ తన స్టయిల్లోనే అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.

అయితే మహీ తన కెరీర్‌ను ఎలా మొదలుపెట్టాడో అలాగే ముగించాడు. 2004లో డిసెంబర్‌ 23న చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ధోనీ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ రనౌట్ కావడం తెలిసిందే. తన కెరీర్ చివరి మ్యాచ్‌లోనూ ధోనీ రనౌట్‌గా వికెట్ సమర్పించుకోవడం గమనార్హం.