ఉద్యోగ అవకాశాలకు యాప్ లాంచ్ చేసిన గూగుల్

గూగుల్ నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఓ సరికొత్త మొబైల్ యాప్ లాంచ్ చేసింది. కొర్మో జాబ్స్ పేరిట లాంచ్ చేసిన ఈ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశాలను పొందడానికి వీలు ఉండేలా గూగుల్ ఈ యాప్‌ని డిజైన్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్స్‌కి కోర్మొ జాబ్స్ మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. బంగ్లాదేశ్, ఇండోనేషియా దేశాల్లో ట్రయల్ టెస్ట్ రన్ చేసిన తర్వాతే ఈ మొబైల్ యాప్‌ని గూగుల్ ఇండియాలో లాంచ్ చేసింది. గత ఏడాది గూగుల్ పేలో స్పాట్ పేరిట లాంచ్ అయిన ఆప్షనే ఇప్పుడు కొర్మో జాబ్స్ పేరుతో అందుబాటులోకి వచ్చింది.

ఉద్యోగం కోసం వెతికే నిరుద్యోగుల నుంచి, ఉద్యోగార్థుల కోసం అన్వేషణలో ఉన్న సంస్థల నుంచి కొర్మో జాబ్స్ మొబైల్ యాప్‌కి భారీ స్పందన లభిస్తోందని గూగుల్ తెలిపింది. జొమాటో, డుంజో వంటి సంస్థలు కొర్మో జాబ్స్ యాప్ నుండి అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నట్టు గూగుల్ వెల్లడించింది. 2 మిలియన్లకు పైగా వెరిఫైడ్ జాబ్స్ ఈ జాబ్స్ పోర్టల్‌పై నమోదయి ఉన్నాయని.. జాబ్స్ పోర్టల్‌కి లభించిన ప్రోత్సాహం, స్పందనతోనే తాము కొర్మో జాబ్స్ ఆండ్రాయిడ్ యాప్ లాంచ్ చేసినట్టు గూగుల్ పేర్కొంది

కరోనావైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభం సంస్థలకు అలాగే తమ ఉద్యోగం కోసం అన్వేషించే అభ్యర్థులకు సైతం అనేక కొత్త సవాళ్లను తీసుకొచ్చిందని.. కొర్మో జాబ్స్ రీజినల్ మేనేజర్ అండ్ ఆపరేషన్స్ లీడ్ బికీ రసెల్ తెలిపారు. అటు ఉద్యోగార్థుల అవసరాలు తీరుస్తూ.. ఇటు సంస్థలకు మ్యాన్ పవర్ అందిస్తూ ఇరువర్గాలు సహాయపడే అవకాశం పొందినందుకు తమకు ఎంతో ఆనందంగా ఉందని రసెల్ అభిప్రాయపడ్డారు.