గృహ లక్ష్మీ దరఖాస్తుకు ప్రభుత్వం గడువును పొడిగించాలి: శివ కోటి యాదవ్

  • జనసేన నియోజకవర్గ ఇంచార్జీ శివ కోటి యాదవ్
  • దరఖాస్తుకు నాలుగు రోజులే సమయం ఇవ్వడం వలన దరఖాస్తుదారులు దరఖాస్తుకు కావలసిన పత్రాలను సేకరించడం కోసం మీ సేవ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బారులు తీరుతూ నానా ఇబ్బందులకి గురవుతున్నారు
  • మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నట్లు గృహలక్ష్మీ పథకం నిరంతర ప్రక్రియయే అయితే వైన్ షాపుల టెండర్లు కూడా నిరంతర ప్రక్రియయే. ప్రభుత్వం వైన్ షాపుల టెండర్లకు 15 రోజులు గడువిచ్చి గృహలక్ష్మి దరఖాస్తుకు కేవలం 4 రోజుల గడువు ఇవ్వడం విడ్డూరం.
  • చివరి తేదీ గడువుపై స్పష్టత లేని మంత్రి వ్యాఖ్యలు. ఇంకా అయోమయంలో ఆందోళన చెందుతున్న దరఖాస్తుదారులు

నర్సంపేట నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన గృహలక్ష్మి పథకం దరఖాస్తుల స్వీకరణకు కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం వల్ల దరఖాస్తుదారులు ముఖ్యంగా మహిళలు దరఖాస్తు చేసుకొనుటకు వారి పేరు మీద సేకరించవలసిన కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్ల వంటి పత్రాల కోసం మీసేవా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బారులు తీరుతూ నానా ఇబ్బందులకు గురవుతున్నారని, గడువు సమయానికి కావలసిన పత్రాలు అందకపోతే లబ్ధిదారులు గృహలక్ష్మి పథకానికి అర్హత కోల్పోతారని దరఖాస్తుకు ప్రభుత్వం గడువును పెంచాలని జనసేన పార్టీ నర్సంపేట నియోజవర్గ ఇంచార్జ్ శివకోటి యాదవ్ అన్నారు. అలాగే ఈ సమస్యపై బుధవారం స్పందించిన రోడ్డు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు గృహ లక్ష్మీ పథకం నిరంతర ప్రక్రియ, దరఖాస్తుదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదనడం సరికాదు అన్నారు. ఎందుకంటే నిరంతర ప్రక్రియ అయిన వైన్ షాపుల టెండర్లకు 15 రోజుల గడువిచ్చి గృహలక్ష్మి దరఖాస్తుకి కేవలం నాలుగు రోజుల గడువు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. చివరి తేదీ గడువుపై మంత్రి వ్యాఖ్యల్లో స్పష్టత లేదని దరఖాస్తుదారులు ఇంకా అయోమయానికి గురవుతూ ఆందోళన చెందుతున్నారని, కావున ప్రభుత్వం ఇప్పటికైనా దరఖాస్తుదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారు గృహలక్ష్మీ పథకానికి అర్హత కోల్పోకుండా దరఖాస్తుకు మరింత గడువును పొడిగించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు ఒర్సు రాజేందర్, బొబ్బ పృథ్వీరాజ్, షేక్ హుస్సేన్, రోడ్డ శ్రీకాంత్ లు పాల్గొన్నారు.