చేనేత రంగానికి మరణశాసనంగా మారిన జిఎస్టీ పెంపు: అంజూరు చక్రధర్

చిత్తూరు, వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు, కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేత రంగానికి అండగా నిలిచిన సంక్షేమ కార్యక్రమాలను వైసిపి ప్రభుత్వం రద్దు చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేనేత ఉత్పత్తుల పై 5 శాతం జీఎస్టీ విధించడమే పెనుభారమైతే ఇప్పుడు ఏకంగా దానిని 12 శాతానికి పెంచడం మరణశాసనమే. జీఎస్టీ పెంపు నిర్ణయంతో చేనేత పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా ఆ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒత్తిడి పెంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే చేనేత రంగంపై జీఎస్టీ భారం 5 శాతాన్ని మించకుండా సబ్సిడీలు కల్పించాలని జనసేన పార్టీ తరపున రాష్ట్రప్రభుత్వంను కోరుచున్నాను.