తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులను అభినందించిన గురాన అయ్యలు

విజయనగరం: సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జార్కండ్‌లోని రాంచీలో జరిగిన 14వ ఓపెన్‌ తైక్వాండో చాంపియన్‌ షిప్‌ పోటీల్లో రాష్ట్రం తరపున పాల్గొన్న జిల్లాకు చెందిన 16 మంది క్రీడాకారులు పాల్గొనగా 12 మంది క్రీడాకారులు పతకాలు సాధించారు. ఐదుగురు బంగారు, ముగ్గురు సిల్వర్‌, ముగ్గురు కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు. ఎం.గగన్‌ సాగర్‌దొర, కె.చైతన్య, బి.హేమంత్‌ కుమార్‌, బి.భవ్యశ్రావణి, టి.సంకీర్తనలు బంగారు పతకాలు సాధించారు. అలాగే పి.హర్షిణి, ఎస్‌.సాత్విక్‌, కె.సాహిత్యలు సిల్వర్‌ పతకాలను కైవసం చేసుకున్నారు. జి.గౌతమ్‌, డి.ప్రియవల్లి, వి.దేవన్‌ మణికంఠ, వై.ముఖేష్‌ విశ్వనాథ్‌లు కాంస్య పతకాలను సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 మంది క్రీడాకారులు పాల్గొంటే జిల్లాకు చెందిన 12 మంది క్రీడాకారులు పథకాలు సాధించడం విజయనగరం చరిత్రలో ఇదే మొదటి సారి. దీంతో జిల్లాకు చేరుకున్న క్రీడాకారులను స్థానిక జి.ఎస్‌.ఆర్‌.హొటల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జనసేన నేత, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌, తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షులు గురాన అయ్యలు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పథకాలు తేవడం గర్వకారణంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లా ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింప చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.