వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు

వైద్యులను దేవుడిగా భావించే సంస్కృతి మనది. వైద్యో నారాయణో హరిః అనే మాటను పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఆరోగ్యపరమైన సమస్యతో వచ్చిన వారికి స్వస్థత కలిగించి, రోగులు వారి కుటుంబీకుల ముఖాన చిరునవ్వులు చూసి సంతోషించే వైద్యులు ఎందరో ఉన్నారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి వైద్యుడికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతో తెగింపుతో వైద్య సేవలందించిన విషయం మనం ఎప్పటికీ మరువకూడదు. ఆ సమయంలో వైద్య సేవలు చేస్తూ కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా 16 వందల మందికి పైగా డాక్టర్లు కన్నుమూశారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేకపోయినా వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించారు. మాస్క్ లు ఇవ్వండి అని అడిగిన పాపానికి డా.సుధాకర్ గారిని వేధించి, కేసులు నమోదు చేసి మానసికంగా ఇబ్బందుల పాల్జేశారు. నడిరోడ్డుపై అవమానించారు. ఆయన ఎంతో వేదన అనుభవించి మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో డా.అనితా రాణి గారినీ అధికార పార్టీ సంబంధీకులు వేధించి కేసులు పెట్టారు. కరోనా సమయంలోనే వైద్యులపై పెత్తనాన్ని ఇతర శాఖలకు అప్పగించేలా జీవో 64 తెచ్చిన విషయాన్ని మరచిపోకూడదు. వైద్యులందరూ పోరాటం చేయాల్సి వచ్చింది. పవిత్రమైన బాధ్యతలు కలిగిన వైద్యులు- అడ్డగోలు జీవోలపైనా, పారితోషికాల కోసం పోరాటాలే చేయాలా? రోగులకు వైద్యం చేయాలా? ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో ఉన్న వైద్యులు ఒత్తిళ్లకు దూరంగా విధులు నిర్వర్తించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వైద్యులపైనా, ఆసుపత్రులపైనా దాడులకు ఆస్కారం లేకుండా చూడాలి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయా ప్రాంతాల్లో విధులు చేపట్టేందుకు యువ వైద్యులు ముందుకు రావాలి. అక్కడ ఉద్యోగం చేయడం ఒక సామాజిక బాధ్యతగా భావించాలని జనసేనాని కోరారు.