కరెంటు కోతలే ఉండవన్న కోతలు ఏమయ్యాయి?

* పరిశ్రమలను మూసేస్తే కార్మికుల పరిస్థితి ఏమిటి?
* గంటల తరబడి కరెంటు కోతల వలన ప్రజలు అవస్థలకు గురవుతున్నారు
* వేసవిలో విద్యుత్ కొరతను నివారించేందుకు ఏం చేశారో వైసీపీ ప్రభుత్వం చెప్పాలి
* ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు
* విద్యుత్ సంక్షోభం అధిగమించేందుకు జనసేనకు ప్రణాళిక ఉంది
* జనసేన పార్టీ పి.ఎ.సి. సభ్యులు కొణిదెల నాగబాబు

బాదుడే.. బాదుడు.. అనే ఊత పదంతో గతంలో వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించిన జగన్ రెడ్డి గారు, ఒక్క అవకాశం ఇస్తే అసలు విద్యుత్ సమస్యలే లేకుండా చేస్తాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన వైసీపీ నాయకులు ఇప్పుడు విద్యుత్ సంక్షోభం అధిగమించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ పి.ఏ.సి. సభ్యులు కొణిదెల నాగబాబు చెప్పారు. విద్యుత్ కొరత కారణంగా వారానికి ఒక రోజు, రెండు రోజులు, మరొక్క రోజు అంటూ పరిశ్రమలను పని చేయకుండా మూసేస్తే కార్మికుల కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఉత్పత్తి మార్గాలపై ఎలాగూ దృష్టి పెట్టే విధానాలు కనిపించట్లేదు. ఉన్న ఉపాధిని కూడా అడ్డుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవ్వాలన్నారు. కొణిదెల నాగబాబు సోమవారం హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పలువురు నాయకులు, జనసైనికులను కలిశారు. ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రతీ కార్యకర్త పవన్ కల్యాణ్ భావజాలానికి అనుగుణంగా, జనసేన పార్టీ సిధ్ధాంతాలకు కట్టుబడి పని చెయ్యాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై చర్చించారు. నాగబాబు మాట్లాడుతూ “వై.సీ.పీ. ప్రభుత్వం ఉత్పాదక కొరత కారణం చూపి గత నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సహకార రంగంలోని ఆరు చక్కెర కర్మాగారాలు మూసివేత, ఆస్తుల అమ్మకానికి జీవో నెంబర్ 15 ను జారీ చేసారు. ఫలితంగా వందలాది మంది కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు విద్యుత్ కొరత పేరుతో పరిశ్రమలు మూసేస్తే కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఉత్పత్తి, ధనర్జాన లేకుండా యాజమాన్యాలు కూడా కార్మికులను కొనసాగిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంటల తరబడి కరెంటు కోతల వలన ప్రజలు చాలా అవస్థలకు గురవుతున్నారు. మరో పక్క విద్యుత్ సరఫరా ఉన్న కాసేపు కరెంటు వాడుకుంటే అడ్డు అదుపు లేని ఛార్జీలతో దోచుకుంటున్నారు. సాధారణంగా వేసవి కాలంలో విద్యుత్తు వినియోగం ఉంటుందని.. కొరత ఎక్కువగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి కాలంలో విద్యుత్ సంక్షోభం అధిగమించేందుకు, ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ప్రజలందరికీ నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు వై.సీ.పీ. ప్రభుత్వం తీసుకున్న చొరవ ఏమిటో కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వై.సీ.పీ. ప్రభుత్వం, గత ప్రభుత్వాలు సౌర విద్యుత్తు, పవర్ గ్రిడ్, విద్యుత్ కాంట్రాక్ట్ అని రకరకాల ప్రయోగాలతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజా ధనాన్ని వృథా చేశాయి. మన రాష్త్రంలో వర్షాధారం ద్వారా సమృద్దిగా నీటి వనరులు ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పాదక ప్రయత్నాలు కూడా చేయలేకపోవడం వారి అసమర్థతకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే నాయకులు ఆచరణకు సాధ్యం కాని హామీలు అడ్డగోలుగా గుప్పించేసి అధికారం చేతికి వచ్చాక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారని పదేపదే చెప్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు ఇప్పుడు పవన్ కల్యాణ్ గారి అవసరం ఉంది అనడంలో సందేహం లేదు. విద్యుత్ సంక్షోభం అధిగమించేందుకు జనసేన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. ఏ విషయంలో అయినా పూర్తి స్పష్టత ఉన్నప్పుడే పవన్ కల్యాణ్ గారు ఆయా అంశాలపై మాట్లాడుతారు. మాట్లాడిన ప్రతీ అంశంపై పరిష్కారం చేసి చూపిస్తారు” అన్నారు.