అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు

వైద్యం చేసే వారు ఎవరైనా దేవుడితో సమానం అని మనం భావించుకుంటాం. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఇతర వైద్య సహాయకులందరూ ఈ కోవలోకే వస్తారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పుడు 24 గంటలు కంటికి రెప్పలా కాపాడే వారే నర్సులు. వీరినే మనం ప్రేమతో సిస్టర్ అని పిలుచుకుంటాము. ఈ వృత్తికి ఎంతో వన్నె తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ చిరస్మరణీయురాలు. నర్సింగ్ లో శుభ్రత, సమయానికి మందులు అందించడం, రోగిని కంటికి రెప్పలా కాపాడుకోవడం నైటింగేల్ ద్వారానే ప్రపంచ వ్యాపితమైంది. ఆమె సేవలకు గుర్తింపుగా ఆవిడ జన్మదినమైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం ముదావహం. ఈ సందర్భంగా నర్సింగ్ వృత్తిలో ఉన్న సిస్టర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్య ఆరోగ్య సేవల్లో నిమగ్నమయ్యే ప్రతి నర్సునీ పవిత్ర భావంతో గౌరవించాలి.ఎంతగానంటే…మన తల్లిని, సోదరిని ఎంతగా గౌరవిస్తామో, ఎంత పవిత్రంగా చూస్తామో అంతగా గౌరవించాలి. కోవిడ్ విపత్కాలంలో మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా నర్సులు అందించిన సేవలు నిరుపమానమైనవి. ఎంతో అమూల్యమైనవి. ప్రాణాలకు తెగించి రక్షణ వస్త్రాలు ధరించి రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉండిపోయి వారు అందించిన సేవలను ఈ దేశం ఎన్నటికీ మరచిపోదు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. మనసారా వారు చల్లగా ఉండాలని కోరుకోవడం తప్ప. ఈ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు ఆర్ధికంగా, సామాజికంగా సుస్థిర స్థానంలో ఉండాలని నా పక్షాన, జనసేన పక్షాన కోరుకుంటున్నాను. కష్టతరమైన ఈ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కలుగచేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.