రైతుల్ని దోచుకునేందుకు వైసీపీ ఫోన్ పే బ్యాచ్ లు దిగాయి: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… “వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా రైతు సోదరులు వ్యవసాయం దండగ అన్న స్థితికి వచ్చేశారు. పంట నష్టం వ్యవహారంలో ప్రభుత్వం పత్రికా ప్రకటనలకే పరిమితం అయ్యింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని రాత్రికి రాత్రి ఆయన వెళ్లే మార్గంలో ధాన్యం నిల్వల్ని తరలించే ప్రయత్నాలు చేశారు. రైతులు మూడేళ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యల కారణంగా క్షేత్ర స్థాయిలో రైతు కుటుంబాలు చితికిపోయాయి. కనీసం గోనె సంచులు సమయానికి ఇవ్వలేకపోయారు. వర్షాలు మొదలయ్యాక తమ పార్టీకి చెందిన కొంత మందికి సంచులు ఇవ్వడం మొదలు పెట్టారు. రైతులు నగలు తాకట్టు పెట్టి పంట పండిస్తే.. ఇప్పుడు వైసీసీ పేటీఎం బ్యాచ్ లు కాస్తా ఫోన్ పే బ్యాచులుగా మారి దోచుకోవడం మొదలుపెట్టాయి. కాటా వేయాలి అంటే ప్రతి రైతు దగ్గర బస్తాకి 150 నుంచి 200 బస్తాలు ఫోన్ పే చేయాలని చెప్పడం వైసీపీ దుర్మార్గ పాలనకు అద్దం పడుతోంది. ఆర్బీకేలు దళారీ కేంద్రాలుగా మారిపోయాయి. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో కనబడడం లేదు. చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రస్తావించడం బాధ కలిగించింది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. ప్రభుత్వం ప్రతి గింజా కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చే విధంగా ఒక కార్యచరణ సిద్ధం చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ప్రతి గింజా కొనే వరకు జనసేన పార్టీ రైతులకు అండగా నిలబడుతుంద”ని అన్నారు.