వినాయక చవితి శుభాకాంక్షలు

కార్య సాధనకు మానవ ప్రయత్నంతోపాటు దైవానుగ్రహం కూడా ఉండాలంటారు మన పెద్దలు. కనుక విఘ్నాలకు అధిపతయిన ఆ వినాయకుని ఆశీస్సులు మన భారతీయలందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగువారందరికీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలోనే కాకుండా విదేశాలలో సైతం జరిగే ఈ వినాయక చవితి పండుగ ఒక ఘనమైన వేడుక. తొమ్మిది రోజులపాటు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాల్లో ఇతర మతస్తులు సైతం పాల్గొనడం భారతదేశంలో మత సహనానికి ఒక గీటు రాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచే వినాయక ఉత్సవాలు స్వతంత్ర పోరాటంలో ఒక భాగంగా ప్రారంభమై నేటి వరకు దేదీప్యమానంగా కొనసాగడం భారతీయులకు ఈ పండుగపై ఉన్న మక్కువ, భక్తిశ్రద్ధలకి తార్కాణంగా నిలుస్తోంది. చాంద్రమాన పంచాంగం ప్రకారం హిందువులకు తొలి పండుగైన ఈ వినాయక చవితి మన తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధితోపాటు ప్రజలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా శుభాలు కలుగచేయాలని, కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు ఆర్ధికంగా సుఖశాంతులతో విరాజిల్లాలని ఆ లంబోదరుణ్ణి ప్రార్ధిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.