నాటి పోరాట పటిమ నేటికీ సజీవం

పోరాటాల పురిటి గడ్డ తెలంగాణా.. పోరాట యోధుల మాగాణి తెలంగాణా.. అటువంటి తెలంగాణాలో నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛా కిరణాలు ఉదయించిన రోజు సెప్టెంబర్ 17 , 1948. ఈ విముక్తి సాధనలో జరిగిన పోరాటంలో ప్రజల పక్షాన నిలబడి ప్రాణాలు అర్పించిన యోధులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటపు పుటలు లేకుండా భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర సంపూర్ణం కాదు. నిజాం పాలనలోని తెలంగాణాలో తప్ప దేశంలోని ప్రజలందరికీ 1947లోనే స్వేచ్ఛ, స్వతంత్రాలు సిద్దించినప్పటికీ రజాకార్ల పాలనలో తెలంగాణా ప్రజలు తల్లడిల్లిపోయారు. బానిసత్వపు పాలనను తరిమికొట్టడానికి అనేక మంది యోధులు పోరు సల్పి చివరకు ఆనాటి భారత సైనికుల సైనిక చర్యతో నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందారు. ఈ సైనిక చర్యను ముందుండి నడిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ధృడ దీక్ష చిరస్మరణీయమైనది. ఆనాటి నిరంకుశ పాలనలో ఉద్భవించిన పోరాట పవనాలు నేటికీ తెలంగాణాలో పయనిస్తూనే ఉన్నాయి. నాటి స్ఫూర్తి, పోరాట పటిమ తెలంగాణ గడ్డలో నిక్షిప్తమయ్యే వున్నాయి. అందుకే ప్రజా వ్యతిరేక చర్యలను నిరసించడానికి తెలంగాణ బిడ్డలు ముందు వరుసలో ఉంటారు. ఈ చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకుని నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని జనసేనాని పేర్కొన్నారు.