దీక్ష విరమింపజేసిన ఆళ్ళ హరి

  • కార్మికుల పోరాటానికి జనసేన పూర్తి మద్దతు

గుంటురు, సూర్యుడు రాకముందే సమాజంలోని చెత్తాచెదారాన్ని తీసేసి, మాలమూత్రాలను తొలగించి ప్రజలకు పరిశుధ్యమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అంధించే పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, ఇచ్చే అరకొర జీతాలను సైతం సక్రమంగా ఇవ్వకుండా వారి జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ది మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రెల్లి యువజన నాయకుడు సోమి ఉదయ్ నేతృత్వంలో కలక్టరేట్ ఎదుట జరుగుతున్న నిరాహారదీక్షకు ఆయన పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా పారిశుద్ధ్య కార్మికుల పట్ల వల్లమాలిన ప్రేమ చూపించిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యల పరిష్కారానికై మొహం చాటేస్తున్నారని విమర్శించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కార్మికులను సైతం ఈ ప్రభుత్వం విస్మరించడం శోచనీయమన్నారు. కార్మిక సంఘ నాయకులు సోమి శంకరరావు మాట్లాడుతూ కార్మికులన్నా వారి కుటుంబాలన్నా ఈ ప్రభుత్వానికి లెక్కేలేదని, వారిని కనీసం మనుషులుగా కూడా గుర్తించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాల తరువాత సాధించుకున్న జీతాలలో సైతం ఈ ప్రభుత్వం కోత పెట్టడం దుర్మార్గమన్నారు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకానికి కార్మికులకు అర్హత లేదంటూ అమ్మఒడి, చేయూత లాంటి పథకాలను సైతం కార్మికులకు అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల్లో అధికశాతం మహిళలే ఉంటారని వారు తెల్లవారుజామున నాలుగు గంటలకు ముందే విధుల్లో చేరుతారన్నారు. అలాంటి వారు మలమూత్రాల అవసరాలను తీర్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా నడిరోడ్డుపై కార్మికులను నిలిబెట్టి సచివాలయ సిబ్బందితో మచ్చర్లు వేయటం కార్మికులను మానసికంగా వేధించటంతో సమానమన్నారు. దీక్ష చేపట్టిన సోమి ఉదయ్ ,మనోజ్ , శివ , ప్రసాద్ కుమార్, దాసు, నాగూర్ బాబు, విజయ్, ప్రవీణ్ లకు జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. కార్మికులకు మద్దతుగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, దాసరి వెంకటేశ్వరరావు, అన్నదాసు సుబ్బారావు, శిఖా బాలు, గంధం సురేష్, బండారు రవీంద్ర, లక్ష్మిశెట్టి నాని, తోట కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.