నివర్ తుపాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలులు తీవ్రంగా వీస్తుండటంతో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు సహాయక చర్యల కోసం ఐదు ఎస్డీఆర్‌ఎఫ్‌, నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఇల్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. రైతులు అప్రమత్తంగా ఉండి, పంట సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. చిత్తూరు జిల్లాలో తుఫాను ప్రభావంపై అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని తూర్పు ప్రాంతాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందనే అంచనాతో సహాయకచర్యలు చేపట్టారు.

సత్యవేడు నియోజకవర్గం పరిధిలో 340 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సత్యవేడులోని పలు మండలాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాన్ ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.