అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి: ఎస్ వి బాబు

పెడన: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఎస్ వి బాబు మాట్లాడుతూ.. పంట చేతికొస్తున్న సమయంలో కురిసిన అకాల వర్షాల వల్ల కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సంవత్సరం దాల్వా పంట లేకపోవడం వలన రైతులు ఎక్కువగా మినుములు, వేరుశనగ ఫైర్లు వేశారు. అపరాల సాగులో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని వ్యవసాయం చేసిన తీరా పంట చేతికొచ్చే సమయానికి వర్షం పడటం వలన కల్లాలలో ఉన్న మినుములు తడిచిపోయాయి. పంట పొలాల్లో నీరు నిలిచే అంతగా వర్షం పడటం వల్ల చేతికొచ్చిన పంట నీటిపాలైంది. పెడన నియోజకవర్గం లోని గూడూరు, పెడన, బంటుమిల్లి మండలాల్లో ఎక్కువ పంట నష్టం జరిగింది. కృత్తివెన్ను మండలం లో కేవలం ఒక 1700 ఎకరాలు మాత్రమే అపరాల సాగు జరిగింది.వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం పెడన మండలంలో 5000 ఎకరాల పంట నష్టం జరిగినట్టు అంచనా వేశారు. గూడూరు మండలం అధికారుల ప్రాథమిక అంచనాల రానప్పటికీ రైతులు ఇచ్చిన సమాచారం ప్రకారం 6000 ఎకరాల పైనే పంట నష్టం ఉంటుంది. బంటుమిల్లి మండలం 400 ఎకరాలు పంట నష్టం జరిగిందని అంచనా. పంట నష్టం ఎక్కువగా పొనల మీద ఉన్న పొలాల్లో, కుప్పలు వేసిన పంట వల్ల రైతులు నష్టపోయారు.వ్యవసాయ అధికారులు సమాచారం ప్రకారం స్టాండింగ్ క్రాప్ కి మాత్రమే పంట నష్టం వర్తిస్తుందని చెప్పడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. వ్యవసాయ ఉన్నతాధికారులు, ప్రభుత్వము వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని ఎస్ వి బాబు అన్నారు.