తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తాజా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి మార్గం సుగమం అయింది. ప్రత్యక్ష బోధనకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో గత ప్రకటనకు సవరణ చేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీలతో సహా కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధనకు ఆదేశాలిచ్చింది. అయితే సాంఘిక సంక్షేమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలల వంటి గురుకుల పాఠశాలలను ఇందుకు మినహాయించారు.

ఇక, పూర్తిస్థాయిలో ప్రత్యక్ష బోధన చేపట్టాలా? ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలా? అనేది ప్రైవేటు విద్యాసంస్థలు నిర్ణయం తీసుకోవచ్చని సర్కారు పేర్కొంది.

ఇవాళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో గురుకుల పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.