హైదరాబాదులో లాక్ డౌన్ విధించే అంశంపై హోంమంత్రి స్పందన!

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో, కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్లు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే కరోనాను కట్టడి చేయడం చాలా కష్టమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోపైపు తెలంగాణలో సైతం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలు విధించబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

వారంలో రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించడం, లేదా రాత్రి పూట కర్ఫ్యూని అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ… తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్లు, రాత్రి కర్ఫ్యూలను విధించే అవకాశమే లేదని చెప్పారు.

లాక్ డౌన్ అనేది ప్రజల జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. అనేక మంది జీవితాలు, వ్యాపారాలు ప్రభావితమవుతాయని చెప్పారు. కేసులు పెరగకుండా ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పాఠశాలలు, మదర్సాలు పని చేయాలా? వద్దా? అనే విషయంలో ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.