ఇంకా ఎన్ని ఏళ్ళు విద్యార్థుల జీవితాలతో చెలగాటం: రామకృష్ణ మిరియాల

ఖమ్మం, విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను మళ్లీ విద్యార్థులను బలిపశువులు చేస్తున్న ప్రభుత్వమా ఇకనైనా కళ్ళు తెరువు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకొని, ఎన్నో కేసులు మీద వేసుకొని సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య సమిసి పోతుందని విద్యార్థులు కలలుకన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు నాటినుండి నేటి వరకు అరకొర నోటిఫికెషన్స్ తో విద్యార్థులకు తెలంగాణా ప్రభుత్వం మొండిచేయి చూపిస్తూనే ఉంది. ఆ అరకొర నోటిఫికెషన్స్ కూడా కోర్టు కేసులతో, పేపర్ లీకేజీలతో వాయిదా పడుతున్నే ఉన్నాయి. ఇంకా ఎన్ని ఏళ్ళు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడతారు. ఇంకా ఎంతమంది బలిదానాలు చేసుకుంటే ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటుంది. బంగారు తెలంగాణా అంటే విద్యార్థుల జీవితాలని బజారుకు వేయటమేనా అని ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మొన్న జరిగినటువంటి టీఎస్పీఎస్సీ ఏఈ ఎగ్జామ్ ఘటనకు బాధ్యునిగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. మరియు దోషులను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏఈ ఎగ్జామ్ తోపాటు, ఇంకా కొన్ని ఎగ్జామ్ పేపర్లు లీక్కైనట్లు తెలుస్తుంది. వాటిపై కూడా పూర్తిస్థాయి విచారణ జరిపి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తుచేస్తున్నాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని జనసేన ఖమ్మం అసెంబ్లీ కో ఆర్డినేటర్ రామకృష్ణ మిరియాల అన్నారు.