మడమ తిప్పని ధీశాలి, మహిళా విద్యాపోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే: రేగిడి లక్ష్మణరావు

  • సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

విజయనగరం: దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు మరియు జనసేన పార్టీ జిల్లా నాయకులు రేగిడి లక్ష్మణరావు ఆద్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రీబాయి ఫూలే. సమాజంలో మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, మనువాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించిన సంస్కర్త సావిత్రిబాయి ఫూలే, ఈమె భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి, ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆమె ఆధునిక విద్య ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కర్త, రచయిత్రి, స్ఫూర్తి ప్రదాత శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.