రోడ్లకు గుంతలు పూడ్చలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారు?

* అన్ని వర్గాలను వైసీపీ దెబ్బకొట్టింది
* 2024లో వచ్చేది జనసేన- తెలుగుదేశం ప్రభుత్వమే
* తెనాలి నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ది చేస్తాం
* పెద్దరావూరు- నందివెలుగు నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేస్తాం
* యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చే బాధ్యత తీసుకుంటాం
* తెనాలి నియోజకవర్గం పినపాడు బహిరంగ సభలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో దెబ్బ తిన్న రోడ్లకు మరమ్మతులు చేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతామంటూ మాట్లాడటం హాస్యాస్పదమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలనూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందనీ, ముఖ్యంగా యువత, రైతాంగాన్ని నట్టేట ముంచిందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత వైసీపీదేనని అన్నారు. 2024లో వచ్చేది జనసేన- తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమేనని, తెనాలి పట్టణాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని, పెద్దరావూరు- నందివెలుగు రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం తెనాలి నియోజకవర్గ పరిధిలో ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారందరికీ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీ కరేటి వాసు, శ్రీ కరేటి వీరయ్య, శ్రీ నాగిశెట్టి సాయి చరణ్, శ్రీ నన్నపనేని రాంబాబుతోపాటు వాళ్ల అనుచరులు, కుటుంబ సభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో పార్టీలో చేరారు. అంతకు ముందు తెనాలి పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి పినపాడు వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “మెరుగైన పాలన అందిస్తారని జగన్ ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలను ఈ ప్రభుత్వం తీవ్రంగా మోసగించింది. ఈ ముఖ్యమంత్రికి బటన్లు నొక్కడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదు. చేస్తున్న ప్రతి పనిలో అవినీతి రాజ్యమేలుతుంది. వాలంటీర్ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ, నాడు-నేడు ఇలా ఏది తీసుకున్నా అవినీతే. లక్షల కోట్ల ప్రజాధనం దోచుకుంటున్నారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
• అన్నదాతలను నిలువునా ముంచారు
అన్నం పెట్టే అన్నదాతల చేత వైసీపీ నాయకులు కన్నీరు పెట్టిస్తున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయరు. కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించరు. విత్తనాలు, పురుగు మందులు సకాలంలో అందించరు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వరు. వేల కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఎవరి కోసం పని చేస్తున్నాయో తెలియదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో 3 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. యువతకు ప్రతి ఏడాది జనవరిలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు.. నాలుగున్నరేళ్లలో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. రాజకీయాలు అంటే ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం, వ్యక్తిగతంగా తిట్టడం కాదు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు అండగా నిలబడాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. రైతులకు అండగా నిలబడాలి.
• తెనాలి అభివృద్ది లక్ష్యంగా ముందుకు…
తెనాలి చారిత్రాత్మక పట్టణం. దీనిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. పెద్దరావూరు నుంచి నందివెలుగుకు వెళ్లాల్సిన నాలుగు లైన్ల రహదారి అర్ధంతరంగా నిలిచిపోయింది. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు రూ.60 కోట్లు ఖర్చు చేశాం. తరువాత వచ్చిన నాయకులు దాన్ని నందివెలుగు వరకు తీసుకెళ్లలేకపోయారు. కనీసం రోడ్లపై ఉన్న గుంటలు కూడా పూడ్చలేకపోయారు. అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి కార్యక్రమంగా పెద్దరావూరు, నందివెలుగు రహదారిని మంగళగిరి వరకు విస్తరిస్తాం. ఐతానగర్, పినపాడులో పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలా మారుస్తాం. పినపాడులో రైల్వే ప్లైఓవర్ వంతెన నిర్మించి ట్రాఫిక్ సమస్యలకు అడ్డుకట్ట వేస్తాం. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి తెలుసుకనకే తెనాలికి రావాలంటే ఈ ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ లోనే వస్తారు. రోడ్డు మీద వస్తే రోడ్డు గురించి ఎవరైనా నిలదీస్తారని ఈ ముఖ్యమంత్రికి భయం. గతంలో ఆటోనగర్ లోకి లారీలు వెళ్లలేని పరిస్థితి ఉండేది. నా హయాంలో సిమెంటు రోడ్లు వేశాం. అలాగే నియోజకవర్గంలో దాదాపు 17 వంతెనలు నిర్మించాం. సకాలంలో కాంట్రాక్టర్లకు బిల్లులు అందించేవాళ్లం. ప్రస్తుత ప్రభుత్వం కనీసం మురికి కాలువ కూడా కట్టలేకపోయింది. మౌలిక సదుపాయల కల్పనలో కనీస స్పందన లేని ఈ ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహించడం హాస్యాస్పదం.
• ఉమ్మడి ప్రణాళికతో ప్రజల ముందుకు వెళ్తాం
మరో నాలుగు నెలల్లో జనసేన- తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. శ్రీ చంద్రబాబు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడి ప్రణాళికతో ప్రజల ముందుకు వెళ్తాం. తెలుగుదేశం పార్టీ మహిళల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 18 నుంచి 45 ఏళ్ల మహిళలకు ఆర్థిక సాయం వంటి అంశాలను మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. అలాగే జనసేన పార్టీ కూడా షణ్ముఖ వ్యూహంతో ముందుకు వస్తోంది. ముఖ్యంగా యువత వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా తయారు చేస్తాం. ఒక నియోజకవర్గంలో ఏడాదికి 500 మంది యువతకు రూ. 10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తాం. వాళ్లు మరో పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకొస్తాం. ఇలా ఐదేళ్లలో ఒక నియోజకవర్గం నుంచి 2,500 మందిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తాం. మాది సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే వైసీపీ నాయకులు రకరకాల కారణాలు చెప్పి అర్హులకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారు. కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారు. జనసేన- తెలుగుదేశం ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామ”ని అన్నారు.
• పూల వర్షమై కురిసిన అభిమానం
అంతకు ముందు తెనాలిలో జనసేన శ్రేణులు గర్జించాయి. బోస్ రోడ్ లోని పార్టీ కార్యాలయం నుంచి మారీస్ పేటకు బయలుదేరిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి జనసేన శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. వందలాది మంది జన సైనికులు బైకులపై ర్యాలీగా వచ్చారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న జన సైనికులు శ్రీ మనోహర్ గారిపై పూలవర్షం కురిపిస్తే… మహిళలు రోడ్ల మీదకు వచ్చి హారతులు పట్టారు. దారి పొడుగునా హారతులు పట్టిన ప్రతి ఆడపడుచుకీ అభివాదం చేస్తూ శ్రీ మనోహర్ గారు ముందుకు సాగారు.