ప్రజలకు భరోసాగా నిలిచేది జనసేన పార్టీ

• ప్రజల ఉన్నతి కోసం ఆలోచించే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
• రాష్ట్రంలో బతకడమే కష్టమనిపించేలా చేస్తోంది వైసీపీ పాలన
• రాష్ట్రాన్ని ఇథియోపియాలా తయారు చేసింది
• వైసీపీ పాలనలో దోపిడీ, దౌర్జన్యం, బీభత్సం, అవినీతి తప్ప మరేం లేదు
• లక్షల మంది రాష్ట్రం వదిలి వలసపోతున్నారంటే అది ప్రభుత్వ వైఫల్యమే
• క్లిష్ట సమయంలో జనసేన వెన్నంటి నిలిచిన నాయకుడు శ్రీ నాదెండ్ల మనోహర్
• తెనాలి నియోజకవర్గ జనసైనికులు, వీర మహిళల సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు

‘రాష్ట్రంలో ప్రజల ఉన్నతి కోసం తపించి వారి కోసం పని చేసే నాయకుడు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సగటు మనిషి కోసం ఆలోచించి భరోసాగా నిలిచే పార్టీ జనసేన’ అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో బతుకులేదని, బతకలేమని 24 లక్షల మంది వలస వెళ్లిపోయారనీ… ఇది కచ్చితంగా ప్రభుత్వ పాలన వైఫల్యమే అన్నారు. ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు వలసలు వెళ్లినవారిలో అత్యధికులు బడుగు జీవులు.. కష్టాన్ని నమ్ముకున్న రైతులే అనేది వాస్తవమని గ్రహించాలి అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సామాన్యులతో, వివిధ సామాజిక వర్గాల నాయకులతో మాట్లాడుతున్నపుడు వారు పెద్దపెద్ద కోరికలేవీ కోరడం లేదు.. తమ ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాలు కోరుకుంటున్నారు. కడుపు నింపే ఉపాధి, వైద్యం, విద్య అడగడం కనిపించింది. అంటే వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు కనీస సౌకర్యాలు, వసతులు కూడా అందలేదని అర్ధమవుతోందని ఆయన చెప్పారు. తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో శనివారం శ్రీ నాగబాబు గారు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ ‘‘ 10 సంవత్సరాల క్రితం రాష్ట్రం విడిపోయినపుడు మేధావులు, నిపుణులు ఆంధ్రప్రదేశ్ కు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. 972 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీరంతో పాటు సారవంతమైన నేల కలగలిపిన రాష్ట్రం కావడంతో అభివృద్ధి చెందడం చాలా సులభమని చెప్పారు. అయితే వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, పాలన లోపాల వల్ల రాష్ట్రం అన్ని విధాలా వెనక్కు వెళ్లిపోయింది. పరిశ్రమలు రాక, ఉపాధి లేక యువశక్తి నిర్వీర్యం అయిపోయింది. టీడీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన రాజధానిని కూడా వెనక్కునెట్టారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగి రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయింది. కరవు, తుపాన్ల ధాటితో రాష్ట్రం విలవిల్లాడింది. అన్ని రంగాలను నాశనం చేసి ఇథియోపియా దేశం తరహాలో వైసీపీ రాష్ట్రాన్ని తయారు చేసింది. రాష్ట్రంలో దోపిడీ, దౌర్జన్యం, బీభత్సం, అవినీతి తప్ప మరేం లేదు.
• గంజాయి దెబ్బకు యువతలో నిస్తేజం
వైసీపీ పాలన మొదలయ్యాక రాష్ట్రం గంజాయి సాగులో ముందుంది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు రాష్ట్రంలోనే కనిపించాయి. వైసీపీ నాయకులు గంజాయిని ప్రోత్సహించి వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. యువతకు విచ్చలవిడిగా గంజాయి దొరకడంతో ఆ మత్తుకు బానిసలై నేరాలు పెరిగాయి. యువశక్తిని ఓ ప్రణాళిక ప్రకారం వైసీసీ నిర్వీర్యం చేసింది. సరైన ఉపాధి దొరికితే యువత చాలా హుందాగా బతుకుతారు. తల్లిదండ్రులను ఎంతో గౌరవంగా చూసుకుంటారు. రాష్ట్రంలో ఉపాధి కరవై, అదే సమయంలో గంజాయి అధికమై కొన్ని ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ లు వెలిశాయి. గంజాయి రవాణాను వెనకుండి నడిపిస్తూ వైసీపీ నాయకులు కుబేరులయ్యారు. సమాజంలో ఏ వర్గం ఐకమత్యంగా ఉండకూడదు… ఏ సమూహం ఒక్కటిగా ఉండకూడదనేది వైసీపీ కుతంత్రం. దీనికోసం వారు దేనికైనా తెగిస్తారు. రాష్ట్రంలో అనేక అలజడులు సృష్టించేందుకు సైతం వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. సమాజాన్ని ఏకంగా ఉంచితే వైసీపీ పాలనలోని అసలు లొసుగులు బయటపడతాయని, ప్రజల్ని వేర్వేరుగా చేయడం ద్వారా మాత్రమే తమ లోపాలను ప్రజలు ఎత్తి చూపరనే దుర్మార్గమైన ఆలోచనతోనే వైసీపీ డివైడ్ అండ్ రూల్ పద్ధతిని బ్రిటీషు వారి తరహాలో పాటించింది. అదే రీతిలో చివరి వరకు పాలిస్తోంది. ప్రతి వర్గాన్ని విభజించి, అక్కడ గొడవలు పెంచేలా వైసీపీ ప్రోత్సహించింది.
• వైసీపీ నాయకులు ఏ చెబుతారో వాళ్లకే స్పష్టత ఉండదు
వైసీపీ నాయకులు మాట్లాడే మాటలకు ఒక్కొసారి నవ్వొస్తుంది. కనీసం ప్రజలు ఏమనుకుంటారనేది కూడా చూడకుండా మాట్లాడుతారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పిల్లలకు సంబంధించిన సభలో పెళ్లిళ్లు, భార్యల గురించి మాట్లాడతారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగితే కారణం తల్లిదండ్రుల పెంపకం అని హోం శాఖ మంత్రి మాట్లాడుతారు. ఎక్కువమంది చదువుకోవడం వల్లనే నిరుద్యోగం పెరిగిందని మరో సీనియర్ మంత్రి వ్యాఖ్యానిస్తారు. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో నాకు తెలీదంటారు ఇరిగేషన్ మంత్రి. మరో మంత్రి ఏకంగా మీకు పథకాలు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి రోడ్లు వేయలేం అంటారు… ఇలా ఎవరి మాటలు వారివి. ప్రజలకు ప్రభుత్వంలో సంక్షేమం అందాలి.. అదే రీతిన అభివృద్ధితో పాటు వసతులు కూడా ఉండేలా చూడాలి. అది ప్రభుత్వం బాధ్యత. దాన్ని వైసీపీ పూర్తిగా విస్మరించింది. మేం అందించిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం అందించడం అనేది ప్రభుత్వ బాధ్యత. సొంత డబ్బులు ఇచ్చినట్లు వైసీపీ నాయకులు మాట్లాడటం దారుణం. రాష్ట్రంలోని 100 మందిలో కనీసం ఇద్దరు కూడా ఈ ప్రభుత్వ పాలన బాగుందని చెప్పరు. పాలన బాగుంటే ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రజా ప్రతినిధులకు టిక్కెట్లు నిరాకరించడం ఎందుకు..? ఎమ్మెల్యేలను కాదు.. జగన్ ను మార్చాలని, ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తీసుకొచ్చారనే పేరొందిన కేసీఆర్ నే ప్రజలు గద్దె దింపితే, ప్రజల్ని అష్టకష్టాలు పెట్టిన వైసీపీకి ప్రజలు బలంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
• తెనాలి నియోజకవర్గం ఓటర్లు శ్రీ నాదెండ్ల మనోహర్ కి అండగా నిలిచి.. గెలిపించాలి
2019లో జనసేన పార్టీ ఓడిపోయిన సమయంలో ఏ మాత్రం నిరాశ చెందకుండా శ్రీ పవన్ కళ్యాణ్ గారితో నిస్వార్థంగా ప్రయాణం చేసిన వ్యక్తి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. క్లిష్ట కాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకుడాయన. పార్టీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయనను నేనుగానీ, పార్టీ శ్రేణులుగానీ మనస్ఫూర్తిగా గౌరవించుకుంటాం. ఉమ్మడి రాష్ట్రానికి సభాపతిగా పనిచేసిన వ్యక్తి పూర్తిస్థాయిలో జనసేనకు కట్టుబడి పనిచేయడం అంటే చిన్న విషయం కాదు. పార్టీ ఓటమి తర్వాత ఎందరో నాయకులు వారి అవసరాల కోసం పార్టీ నుంచి వెళ్లిపోయినా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీతో కలిసి చేసిన ప్రయాణం ఎంతో గొప్పది. అలాంటి నాయకుడికి తెనాలి ప్రజలంతా అండగా నిలబడి గెలిపించాలి. నియోజకవర్గ అభివృద్ధి మీద నిత్యం తపించే శ్రీ మనోహర్ గారి నాయకుడు దొరకడం నిజంగా అదృష్టం.
• సామాన్యుడి బాధను అర్ధం చేసుకునే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
మేం వేలాది కోట్లు సంపాదించిన వ్యక్తులం కాదు… తాతలు తండ్రుల ఆస్తులను వెనకేసుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లం కాదు. సాధారణ ఉద్యోగి పిల్లలుగా, వారి ఈతిబాధలను అర్థం చేసుకునే స్థాయి నుంచి వచ్చినవాళ్లం. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సామాన్యుడి బాధలు స్వయంగా తెలుసు. ఆయన సామాన్యుడు ఆలోచించే స్థాయిలోనే ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు. జనసేన పార్టీ ప్రస్థానం కూడా సామాన్యుడి కోణంలోనే ఉంటుంది. బాధల్లో ఉన్నవారికి ప్రభుత్వం వచ్చి సాయం చేయక ముందే మనం సాయం చేసి వారి కన్నీళ్లు తుడవాలని ఆలోచించే గొప్ప మానవతావాది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఓటమికి భయపడని వాడితో యుద్ధం చాలా ప్రమాదకరం అంటారు. ప్రతి ఓటమిని నిచ్చెనగా తీసుకునే శక్తి, యుక్తి ఉన్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వంలో కొన్ని విషయాల్లో టీడీపీ విధానాల మీద నేను కూడా విబేధించిన మాట వాస్తవమే. అయితే వారు ఏది చేసినా ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్లేవారు. వైసీపీ వాళ్ళు అసలు ప్రజాస్వామ్య విలువలనే పట్టించుకోవడం లేదు. సామాన్యుడు నోరెత్తితే కేసులు, అరెస్టులు చేస్తోంది. ప్రజలు బతకడానికి కూడా భయపడే విధానాన్ని అవలంబిస్తోంది. అప్రజాస్వామికంగా పాలన చేస్తున్న వైసీపీ వల్ల పెను నష్టాలను ప్రతి ఒక్కరూ అనుభవించారు. వైసీపీ అరాచకాలకు చరమ గీతం పాడాలి. రాష్ట్రంలో సుందరమైన, స్వచ్ఛమైన పాలన తీసుకురావాలి. అన్ని పార్టీల పాలనను ప్రజలు చూశారు. జనసేన – తెలుగుదేశం కలయికతో అద్భుతమైన ప్రజాపాలనను ప్రజలు దీవించాలి. ఆడబిడ్డలకు భద్రతనిచ్చే ఆంధ్రా కావాలి.. సామాన్యుడి మోములో చిరునవ్వును చూసే పాలన రావాలి.’’ అన్నారు. సమావేశంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ కుమార్, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు శ్రీ బండారు రవికాంత్, శ్రీ ఇస్మాయిల్ బేగ్, శ్రీ సాగర్, శ్రీ సుందరపు సతీష్ కుమార్, శ్రీ వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు.