మోదీని గొప్ప దార్శనికునిగా భావిస్తాను.. పవన్‌ కల్యాణ్‌

మోదీ పుట్టిరోజును పురస్కరించుకుని జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ”ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మన దేశానికి ధృడ చిత్తం కలిగిన నాయకుడు అవసరమని నేను నిత్యం పరితపించేవాడిని. ఆ నాయకుడు మన విశాల భారత సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన రాజనీతిజ్ఞుడై ఉండాలని కోరుకునేవాణ్ణి. ముఖ్యంగా భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన ఒక బిలియన్ ప్రజల భూమిని పాలించడం అంటే.. కత్తి మీద సాము లాంటిదే. ఆ స్థానంలో ఉండటం ఎంతటివారికైనా సవాళ్లతో కూడుకున్నదే. అటువంటి స్థానంలో నిలిచిన మోదీని.. నేను గొప్ప దార్శనికునిగా భావిస్తాను. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ఆయనతో కలసి అనేక సభలలో ప్రచారం చేసే అవకాశం నాకు లభించింది. ఆయనలోని ఆకర్షణ శక్తిని సునిశితంగా గమనించడానికి ఆ ప్రయాణం నాకు దోహదపడింది. 71వ జన్మదినం జరుపుకొంటున్న ప్రధానికి శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయువును ఆ ఆదిపరాశక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని పవన్ కల్యాణ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.