మాట ఇచ్చాడంటే.. వేటు వేస్తాడంతే!

* అన్ని విభాగాల్లోని పొరుగు సేవల సిబ్బందిని క్రమంగా తొలగించే కుట్ర
* మొదటగా అకౌంట్స్ డిపార్ట్ మెంట్ తో మొదలు
* పదేళ్ల ప్రాతిపదిక చూపి మరో మోసం
* ప్రస్తుతం 60 వేల మంది ఉపాధికి ఎసరు
* భర్తీ మాట దేవుడెరుగు… ఉన్న ఉద్యోగాలకు మంగళం
* బిక్కుబిక్కుమంటున్న పొరుగు సేవల సిబ్బంది

‘‘మన ప్రభుత్వం రాగానే కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులందరినీ కచ్చితంగా పర్మినెంట్ చేస్తాం’’ అని మీకు హామీ ఇస్తున్నా…. అని ఎన్నికల సభల్లో వాహనంపై నుంచి మైక్ లో వైఎస్.జగన్ హామీ ఇవ్వడమే తరువాయి… రావాలి జగన్ కావాలి జగన్.. అంటూ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ పడుతున్న క్షణంలో మైమరచిపోయి.. అమాయకంగా నమ్మి.. మోసపోయి ఓటేసిన సగటు పొరుగు సేవల ఉద్యోగులు నేడు అయోమయంలో పడ్డారు. ఉద్యోగుల తొలగింపుపై దృష్టి పెట్టిన వైసీపీ ప్రభుత్వం పొరుగు సేవల ఉద్యోగుల్ని మెల్లగా ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి తప్పించడానికి పూటకో ఉత్తర్వు, గంటకో జీవో ఇస్తూ అర్ధరాత్రి వేళ గుండెలదిరేలా చేస్తోంది.
• పొరుగు సేవల సిబ్బందిని తొలగించే క్రమంలో ప్రభుత్వం మొదటగా డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేసే 17 మంది సిబ్బందికి డిసెంబరు ఒకటో తేదీ నోటీసులు జారీ చేసింది. 10 సంవత్సరాల కంటే తక్కువ సీనియారిటీని ప్రాతిపదికగా చూపుతూ వీరికి నోటీసులు ఇచ్చి, వీరి హాజరు తీసుకోవద్దని సూచించింది. డిసెంబరు 4వ తేదీ రాత్రి సాంఘిక సంక్షేమ శాఖలో, గురుకుల వసతి గృహాల్లో పనిచేస్తున్న 350 మంది వంట కార్మికులు, సహాయకులు, కమాటీలను తొలగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
• వారి తర్వాత పంచాయతీ రాజ్ శాఖలోనే తొలగింపులు ఉంటాయనే భయం ఆయా శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందిని వెంటాడుతోంది. ఈ శాఖలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, స్వీపర్లు ఇలా మొత్తంగా 700 మందిపైగా ఉంటారు. వీరిని తొలగిస్తారనే ప్రచారం జోరందుకుంది. దీని తర్వాత అన్ని శాఖల్లోనూ తొలగింపులు ఉంటాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
• రాష్ట్రం మొత్తం మీద 2.40 లక్షల మంది పొరుగు సేవల సిబ్బంది ఉంటారు. వీరిలో లక్ష మందికి అప్కాస్ కింద రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ఏజెన్సీ ద్వారా జీతాలు అందుతున్నాయి. మిగిలిన 1.40 లక్షల మందిని వివిధ ఏజెన్సీలు, వివిధ సంస్థలు, థర్డ్ పార్టీల ఆధ్వర్యంలో రిక్రూట్ చేసుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద 10 ఏళ్ల ప్రతిపాదిక మేర ఉద్యోగులను తొలగిస్తే మొత్తంగా 60 వేల మంది ఉద్యోగాలు వెంటనే పోతాయి. వీరిలో 17 వేల మంది ప్రభుత్వ ఏజెన్సీ ఆప్కాస్ నుంచి వేతనాలు పొందుతున్న వారు ఉన్నారు.
• రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ శాఖల్లో కలిపి 2.32 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తామని నమ్మించిన వైసీపీ ప్రభుత్వం క్రమంగా ఉన్నవారినే తీసేస్తోంది. ఉద్యోగంలో ఉన్నాం.. ఎప్పటికైనా ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని ఆశగా ఎదురుచూసి, వయసు అయిపోతున్నా ఎలాంటి ఇతర ఉద్యోగాల వైపు వెళ్లకుండా, వచ్చినంత జీతంలోనే సర్దుకొని పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది మెడపై ఇప్పుడు ప్రభుత్వం వేలాడదీసిన కత్తి ఏం చేస్తుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది.
• సచివాలయాల పేరుతో సుమారు 1.31 లక్షల ఉద్యోగుల్ని, వాలంటీర్ల కోసం 2.50 లక్షల మందిని తీసుకున్న ప్రభుత్వం ఆ భారాన్ని కాస్త అయినా తగ్గించుకోవాలనే కోణంలోనే పొరుగు సేవల సిబ్బందికి మంగళం పాడటానికి సిద్ధమవుతోంది. సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు వచ్చిన తర్వాత చాలా శాఖల్లో పనిలేదనే సాకుతో వీరిని పక్కన పెట్టేందుకు సిద్ధమవుతోంది. మొదటగా అకౌంట్స్ విభాగంలో 17 మందిని తొలగించినట్లు చెబుతున్నప్పటికీ… ఆ తర్వాత క్రమంగా అన్నీ శాఖల్లోనూ తొలగింపులు ఉంటాయనే సంకేతాలు ఇస్తోంది.
• పదేళ్ల ప్రాతిపదిక తీసుకోవడం వెనుక కూడా ఉద్యోగులను విభజించి… పాలించే కుట్ర ప్రభుత్వం చేస్తోంది. మొదట అందరిలో ఆగ్రహావేశాలు రగలకుండా ఉండేందుకే ఈ పదేళ్ల ప్రాతిపదిక తెచ్చారని, తర్వాత క్రమంగా పొరుగు సేవలందరినీ ఇంటికి పంపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెల్లగా అన్నీ విభాగాల్లో ఉన్న పొరుగు సేవల సిబ్బందిని వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాల్లో 2014 నుంచి 2019 మధ్య ఉద్యోగం పొందిన వారే అధికంగా ఉన్నారు.
• వైసీపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, శాశ్వతంగా రద్దు చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన పనులు చేస్తూ, ఆ విభాగంలో ఉన్న పొరుగు సేవల సిబ్బందిని తొలగించాలి. తర్వాత మాత్రమే ఆయా ఖాళీ పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పొరుగు సేవల సిబ్బందిని తప్పిస్తున్నారన్నది ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్న అసలు విషయం.