జాబ్ క్యాలెండర్ మరిచారు…ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్నీ తొలగిస్తే ఎలా?

•ప్రభుత్వ పెద్దల సూచనలు.. సలహాలు లేకుండా అధికారులు ఆదేశాలు ఇస్తారా?
•డి-ఫ్యాక్టో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు నమ్మశక్యంగా లేవు

ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తాం, రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అంటూ హామీలు ఇచ్చిన వైసీపీ ఇప్పుడు యువతను మోసం చేసిందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ఒకసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చి అందులో కూడా అరకొర ఖాళీలు చూపించి వాటిని కూడా భర్తీ చేయలేదు. జాబ్ క్యాలెండర్ విషయాన్ని మర్చిపోయి… ఇప్పుడు ఏళ్ల తరబడి కొద్దిపాటి జీతానికి పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించడాన్ని ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి ఏ విధంగా సమర్థించుకుంటారు. అలాంటి ఆదేశాల గురించి తమకు తెలియదని, అధికారులు ఇచ్చారు అంటూ డి-ఫ్యాక్టో సీఎం శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు. రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చూస్తున్న యువతకు రెండున్నర లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారనే విషయం ఆశనిపాతంగా మారింది. చిన్నపాటి ఉద్యోగాలకే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఏమిస్తుందనే ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి ఇచ్చే పరిశ్రమలను కూడా ప్రోత్సహించరు. ఉన్న పరిశ్రమలు తమ కొత్త ప్రాజెక్టులను, అనుబంధ యూనిట్లను కూడా రాష్ట్రంలో నెలకొల్పేందుకు సుముఖంగా లేరు. పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు అంటే వైసీపీ పాలన ఏ విధంగా ఉందో అందరికీ అర్థమవుతోంది. ప్రభుత్వ పెద్దల సూచనలు, సలహాలు లేకుండా అధికారులు ఆదేశాలు ఇస్తారు అంటే ఎవరూ నమ్మరు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో డి-ఫ్యాక్టోలు, సలహాదారులు కాకుండా నేరుగా ముఖ్యమంత్రే వివరణ ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.