జనసేన అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు సంపూర్ణ సాధికారిత

* నిలిచిపోయిన ప్రతి పథకాన్ని పునరుద్దరిస్తాం
* పథకాల కోసం కాదు రాజ్యాధికారం కోసం దళిత, గిరిజనులు పోరాడాలి
* సబ్ పాన్ అమలుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
* ఆచరణలో పెట్టే వ్యక్తికి హృదయం లేనప్పుడు ఎన్ని గొప్ప చట్టాలు చేసినా వృథా
* ఆయన కోసం మీరు ఉపవాస ప్రార్థనలు చేస్తే … అధికారంలోకి వచ్చి అక్రమ కేసులు పెడుతున్నాడు
* ‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ – వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం’పై రాష్ట్ర స్థాయి సదస్సులో శ్రీ పవన్ కళ్యాణ్

ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తీసుకొచ్చినా ఆచరణలో పెట్టే వ్యక్తికి హృదయం లేనప్పుడు వృథాయేనని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. దాదాపు 22 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు ఇప్పటికీ నిధులు కోసం దేహీ అంటూ అడుక్కోవడం బాధాకరమన్నారు. అణగారిన వర్గాలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టంలో ఉన్న లోపాలను సవరించి, సబ్ ప్లాన్ నిధులను దళిత, గిరిజనుల సంక్షేమానికి, అభ్యున్నతికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై రాష్ట్ర స్థాయి సదస్సు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగింది. దళిత మేధావులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాల నేతలు సబ్ ప్లాన్ నిధుల కేటాయింపులపై జరిగిన అన్యాయంపై మాట్లాడారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “సమాజాన్ని ఎప్పుడూ ఒక్క కోణం నుంచి చూడకూడదు. సమగ్రంగా అన్ని కోణాల నుంచి విశ్లేషించాలి. అణగారిన వర్గాలు వివక్షతకు గురైనప్పుడు కలిగే బాధ మనకు తెలియాలంటే మనం కూడా వివక్షతకు గురి కావాలి. గతంలో విదేశాలకు వెళ్లినప్పుడు తెల్ల తోలు లేని కారణంగా వివక్షతకు గురయ్యాను. విమానంలో నీళ్లు ఇవ్వమని అడిగినా ఒక బ్రిటిష్ మహిళ పట్టించుకోలేదు. పైలట్ ను పిలిచి మందలించడంతో ఆమె క్షమాపణ చెప్పింది. మరో భారతీయ ప్రయాణికునికి ఇలాంటి పరిస్థితి రానివ్వకూడదని ఆ రోజు నేను అలా చేయాల్సి వచ్చింది.
* పారదర్శకంగా అమలు చేస్తాం
జగన్ రెడ్డి జైలుకు వెళితే ఆయన కోసం ప్రార్థనలు, ఉపవాసదీక్షలు చేశారు. మీ కుటుంబంలో వ్యక్తిగా భావించి మీరు అంత చేస్తే ..ఆయన అండగా నిలబడకపోగా ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎంతసేపు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలనే కోణంలోనే మన పోరాటం ఉంది తప్ప.. అధికారానికి చేరువవ్వాలనే ఆలోచన లేదు. ఆ కోణంలో ఆలోచించనంత కాలం మన పరిస్థితుల్లో మార్పు రాదు. జనసేన అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని చెప్పం కానీ… ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను పారదర్శకంగా అమలు చేస్తాం. చట్టంలో లోపాలను సవరించి నిధులు దారి మళ్లకుండా చూస్తాం.
* వాళ్లను శాసించలేడు కనుకే మనల్ని శాసిస్తాడు
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ గారి పేరు పెట్టినప్పుడు… కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గారి పేరు పెట్టడం తప్పు అనిపించలేదు. కానీ పెట్టిన నాయకుల ఉద్దేశం కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూడటమే. వారి పాచికలు పారకుండా సంయమనం పాటించాను. శాసనసభలో ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. నిధుల మళ్లింపుపై ఒక్కరు కూడా బలంగా మాట్లాడరు. ఒక రోజు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి తన ఇంట్లో వివాహానికి నన్ను ఆహ్వానించారు. ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తులు వైసీపీలో ఉన్నారు. నేను వస్తే ఇబ్బంది అని చెబుతున్నా నన్ను బలవతంగా రావాలని కోరడంతో సరే అన్నాను. అర గంటలో ఆ పెళ్ళికి బయలుదేరాల్సి ఉండగా.. ఆహ్వానించిన వారు కాల్ చేసి మీరు వస్తే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రావడానికి ఇష్టపడటం లేదని చెప్పడంతో ఆగిపోయాను. ఇద్దరం పెద్ద పెద్ద పత్రికాధిపతులు, పారిశ్రామికవేత్తల పెళ్లిళ్లకు వెళ్లాం. అక్కడరాని ఇబ్బంది ఇక్కడ ఎందుకు? వాళ్లను శాసించలేడు కనుక మనల్ని శాసిస్తున్నాడు.
* ప్రభుత్వ వృథా ఖర్చులు రూ. 21,500 కోట్లు
దామాషా పద్దతిలో బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. మేము ఎంతో మాకు అంత. రాష్ట్రంలో ఎస్సీలు 16.4 శాతం ఉన్నారు. ఎస్టీలు 5.3 శాతం ఉన్నారు. రెండు కులాలు కలిపి దాదాపు 22 శాతం. మన బడ్జెట్ లక్ష కోట్లు అనుకుంటే దానిలో 22 వేల కోట్లు వారి సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేయాలి. అలా ఖర్చు చేయకపోగా దాదాపు 27 సంక్షేమ పథకాలను ఎత్తేశారు. ఈ మూడేళ్లలో ఎస్సీలకు రూ.16వేల కోట్లు, ఎస్టీలకు రూ.4 వేల కోట్లు కోత పెట్టారు. మొత్తం దాదాపు రూ. 20 వేల కోట్లు ఇవ్వలేదు. గతంలో విదేశీ విద్యా పథకంలో చదువుతున్న వారికి సైతం పథకం సొమ్మును నిలిపేశారు. ఏపీ గవర్నమెంట్ పబ్లిసిటీ ఖర్చు రూ.15వందల కోట్లు. స్కూళ్లు, గవర్నమెంట్ కార్యాలయాలకు వైసీపీ పార్టీ రంగులు వేయడానికి పెట్టిన ఖర్చు అక్షరాల రూ.4,500 కోట్లు. కోర్టులు మొట్టికాయలు వేయడంతో మళ్లీ రంగులు మార్చడానికి పెట్టిన ఖర్చు రూ. 2వేల కోట్లు. అలాగే ఇతరత్రా వృథా ఖర్చులు వేల కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ. 21,500 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. ఈ డబ్బుతో ఎంతో మంది విదేశీ విద్యా పథకం విద్యార్ధులకు సహాయం చేయవచ్చు. ఇంకెందరో ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆదుకోవచ్చు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు సంపూర్ణ సాధికారిత అందిస్తాం.
* శ్రీ దామోదరం సంజీవయ్య సేవలు ఎందుకు గుర్తు ఉండవు?
ఆంధ్రప్రదేశ్ కు తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన శ్రీ దామోదరం సంజీవయ్య సేవలు ఎందుకు గుర్తు ఉండవు? ప్రజలకు అవసరమైన ఎన్నో పాలసీలను రూపొందించి వాటిని పక్కాగా అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి, దార్శనికుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు. మాతృభాష తెలుగులో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలని పక్కాగా అమలు చేసిన గొప్ప మనిషి శ్రీ దామోదరం సంజీవయ్య. అలాంటి సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తులను ఎందుకు గుర్తు పెట్టుకోరు..? ఇందాక వస్తుంటే ఓ కాలనీ పేరు ఫలకం దగ్గర జ్యోతిబా పూలే – వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలనీ అని ఉంది. శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప నాయకుడు కావచ్చు. అంబేడ్కర్, పూలే, నారాయణ గురులతో సమం కాదు. అయినా గొప్ప నాయకులకు సంపూర్ణ గౌరవం ఎందుకు ఇవ్వరు.? మీరు మధ్యలో వచ్చేయడం దేనికి? దళితులకు, గిరిజనులకు న్యాయపరంగా అందాల్సిన ప్రతి రూపాయి వారికి అందేలా చూస్తాం. వారికి సంబంధించి ఆగిపోయిన ప్రతి పథకాన్ని రివైజ్ చేస్తాం. దామాషా పద్ధతిలో మీకు అందాల్సిన సొమ్ము ఖచ్చితంగా మీ అభివృద్ధికి అందేలా జనసేన ప్రభుత్వంలో పని చేస్తాం. దీనిలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రూ.7 లక్షలు ఇస్తామని వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేకపోయింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలోనూ ఎక్కువమంది బడుగు బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు ఉన్నారు. వారికి మా వంతుగా చేయాల్సిన సహాయం మేము చేశాం. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం అందాల్సిన పరిహారం దక్కలేదు.
* ఎవరితో కలిసున్నా నేను చేస్తాను
జనసేన పార్టీ ఎవరితో పొత్తులో ఉన్నా కచ్చితంగా చెప్పింది చేస్తాం. మేం బహిరంగంగా భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా మెలుగుతున్నాం. అధికార వైసీపీ నాయకుడు కేంద్రంతో మంచిగా మెలిగితే మంచిది అన్నట్టు మెసులుతున్నారు. మేం బీజేపీతో పొత్తులో ఉండి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కచ్చితంగా మేం అనుకున్నవి అనుకున్నట్టు చేసి చూపిస్తాం. బీజేపీ కేంద్ర నాయకులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వారి నుంచి జనసేన ప్రభుత్వానికి కచ్చితంగా పూర్తి మద్దతు ఉంటుందని భావిస్తున్నాను. ఎవరితో కలిసానో లేదో అన్నది చూడకండి.. కచ్చితంగా మీకు సంబంధించి ఇచ్చిన హామీలను నెరవేర్చేలా బాధ్యత తీసుకుంటాను. దళిత ఆడపడుచుకు హోం మంత్రి పదవి ఇచ్చి కనీసం హోంగార్డును కూడా బదిలీ చేయలేని విధంగా చేతులు కట్టేసి, అన్ని పనులు సకల శాఖ మంత్రితోనే ఈ ప్రభుత్వం చేయిస్తోంది. ఆ మాత్రం దానికి దళితులకు పదవులు ఇచ్చామని చెప్పుకోవడం ఎందుకు..? దళితులు, గిరిజనులకు అన్ని రంగాల్లోనూ సాధికారత కోసం జనసేన ప్రభుత్వంలో కచ్చితంగా ప్రయత్నం చేస్తాం. చెప్పినవి ఏమాత్రం చేయకపోయినా మీరు నన్ను కచ్చితంగా గట్టిగా అడిగే ధైర్యం ఇస్తా. అవుట్ కం బడ్జెట్ అంటే సామాన్యుడికి తెలిసేలా చేస్తాం. సబ్ ప్లాన్ నిధుల కేటాయింపులు, వినియోగానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం” అన్నారు.