ఎస్సీ, ఎస్టీల ఆర్ధిక, సామాజిక సాధికారతకు వైసీపీ ప్రభుత్వం ప్రమాదకరం

•వైసీపీ సర్కారు సబ్ ప్లాన్ చట్టాన్ని పక్కదోవ పట్టించింది
•ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేశారు
•ఏపీలో దుర్భరమైన సామాజిక పరిస్థితులున్నాయి
•ప్రజల్లో ధైర్యం నింపే వ్యక్తి అవసరం రాష్ట్రానికి ఉంది
•సబ్ ప్లాన్ నిధుల కోసం కలసి పోరాటం చేయాలి
•‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ – వైసీపీ నిర్లక్ష్యం’పై సదస్సులో వక్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ విలువలు కోల్పోయిందని.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ – వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సు అభిప్రాయపడింది. 60 శాతం నిధులు కేటాయించి, 32 శాతం మాత్రమే ఖర్చు చేశారని.. ఖర్చు చేసిన ఆ మొత్తం కూడా నవరత్నాల పేరిట దారి మళ్లించారని వక్తలు స్పష్టం చేశారు. సబ్ ప్లాన్ అమలులో లోపాలపై బలమైన పోరాటం చేయాలని.. దళితుల ఓట్లతో గెలిచి దళితులకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
•సబ్ ప్లాన్ పొడిగింపు ఆర్డినెన్స్ లోపభూయిష్టం: శ్రీ డి.వరప్రసాద్
విశ్రాంత ఐఏఎస్ అధికారి, జనసేన పార్టీ నాయకులు శ్రీ డి. వరప్రసాద్ మాట్లాడుతూ “ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ని పొడిగిస్తూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను కంటితుడుపు చర్యగానే పరిగణించాలి. సబ్ ప్లాన్ ప్రకారం జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపులు – ఖర్చు ఉండాలి. వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ఏడాది బడ్జెట్ లో కేవలం 60 శాతం నిధులు కేటాయించి, 32 శాతం మాత్రమే ఖర్చు చేసింది. ఈ ఏడాది రూ. 13 వేల కోట్లు ఖర్చు చేస్తే.. గత ఏడాది చేసిన ఖర్చు కేవలం రూ. 10 వేల కోట్లు. తెలంగాణ ప్రభుత్వం సబ్ ప్లాన్ లో మిగులు నిధులు మరుసటి ఏడాదికి ఖర్చు చేయాలని నిర్ణయించింది. అదే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేయొచ్చు. అది జరగడం లేదు. చేసిన ఖర్చు కూడా నవరత్నాల పేరిట దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. సబ్ ప్లాన్ అమలులో కూడా లోపాలు ఉన్నాయి. దీనిపై ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది” అన్నారు.
•ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: శ్రీ టి.శివశంకర్
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టి.శివశంకర్ మాట్లాడుతూ.. “ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు కాకుండా మురిగిపోవడానికి వీల్లేదన్న విషయం చట్టంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అది జరగడం లేదు. అయినా దళితులకు జరుగుతున్న అన్యాయాలు, దురాగతాలపై ఆ వర్గం ప్రజా ప్రతినిధులు కూడా మాట్లాడలేరు. ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా నిధులు దారి మళ్లించిది అనే విషయాన్ని మనమంతా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి” అన్నారు.
•వ్యవస్థల్ని పతనం చేయడంలో శ్రీ జగన్ రెడ్డి దిట్ట: శ్రీ వంపూరి గంగులయ్య
పార్టీ అరకు పార్లమెంట్ ఇంఛార్జ్ శ్రీ వంపూరి గంగులయ్య మాట్లాడుతూ “వ్యవస్థల్ని పతనం చేయడంలో శ్రీ జగన్ రెడ్డి దిట్ట. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 20 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లాయి. ఆ కారణంగా దళిత సమాజం బలహీనం అవుతోంది. ముఖ్యమంత్రి నిధుల్ని దారి మళ్లించి అవసరాలకు వాడుకుంటూ ప్రచారం పొందుతున్నాడు. సబ్ ప్లాన్ నిధులు మన హక్కు. దాన్ని దారి మళ్లించి ద్రోహం చేస్తున్న శ్రీ జగన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వొద్దు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఆ విషయాన్ని సమాజానికి తెలియ చెప్పాలి. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు ఉన్న హక్కుల్ని కాలరాస్తున్నారు. గిరిజనేతరులకు విశాఖ మన్యంలో పవర్ ప్లాంటులు కేటాయించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ విధానానికి నీళ్లొదిలి గిరిజన విద్యా వ్యవస్థను పతనం చేశారు. సంఖ్యాబలం ఉన్న బీసీ కులాలను ఎస్టీల్లో కలిపి హక్కులు కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల”న్నారు.
•సోషల్ ఆడిట్ అవసరం: ఆచార్య సుధాకర్ రావు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఆచార్య సుధాకర్ రావు మాట్లాడుతూ.. “ప్రభుత్వ పథకాలు ఎంత వరకు ఉపయోగకరంగా ఉన్నాయనే అంశం మీద సోషల్ ఆడిట్ అవసరం. అదే భవిష్యత్తుకి దిశానిర్ధేశం చేస్తుంది. సబ్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం ఆర్ధిక, సామాజిక సమానవత్వం. ఆ సమానత్వం తీసుకురావాల్సిన బాధ్యత మన నాయకులు, ప్రభుత్వాల మీద ఉంది. ఆ బాధ్యత తీసుకుంటే సబ్ ప్లాన్ నిధులు మురిగిపోయేవి కాదు” అన్నారు.
•గత ప్రభుత్వ పథకాలు నిర్వీర్యం అవుతున్నాయి: శ్రీ పెదపూడి విజయ్ కుమార్
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయ”న్నారు.
•ప్రభుత్వం మనకున్న ఆశలు, ఆలోచనల్ని చంపేస్తోంది: డాక్టర్ గౌతమ్ రాజ్
జనసేన పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ సెల్ వైఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్ మాట్లాడుతూ “ప్రస్తుత ప్రభుత్వం మనకున్న ఆశలు, ఆలోచనల్ని చంపేస్తుంది. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్ని భిక్షంగా వేస్తే ఓట్లు వేసి చప్పట్లు కొడుతున్నాం. సంక్షేమ పథకాలు తీసుకుని ఈ రోజుకి ఆకలి తీరితే చాలు అన్నట్టు ఉంటే.. ఆర్ధికంగా ఎప్పుడు ఎదుగుతాం? ప్రతి ఒక్కరు మనకి మనం బతుకుదామా? ఎదుగుదామా? అన్న ఆలోచన చేయాలి. మనం ఎదగాలి అంటే జనసేన పార్టీని నమ్మాలి. అందుకు నిబద్దత కలిగిన నాయకుడి ప్రస్థానానికి ప్రతి ఒక్కరు సహకరించాలి” అన్నారు.
•సబ్ ప్లాన్ చట్టాన్ని వైసీపీ నిర్వీర్యం చేసింది: శ్రీ విజయ్ శేఖర్
రాష్ట్ర కార్యదర్శి శ్రీ బేతపూడి విజయ్ శేఖర్ మాట్లాడుతూ.. “వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆర్ధికంగా సామాజికంగా మరింత వెనుకబడిపోయాయి. మోసపోయాయి. అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా అమలుకావాల్సిన 27 సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం నిలిపివేసింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. గడచిన నాలుగేళ్లలో ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రూ. లక్ష కూడా లోను ఎవరికీ ఇవ్వలేదు. లిడ్ క్యాప్ సంస్థకు నాలుగేళ్లలో కేటాయించింది రూ. 20 కోట్ల లోపే. ఎస్సీ, ఎస్టీల మీద అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించిన ఏకైక ప్రభుత్వం వైసీపీదే” అన్నారు.
•సబ్ ప్లాన్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: శ్రీ శెట్టిబత్తుల రాజబాబు
జనసేన పార్టీ అమలాపురం ఇంఛార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు మాట్లాడుతూ “శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా దళితులకు వ్యతిరేకంగా పని చేస్తోంది. సరైన ప్రణాళికతో పని చేయడం లేదు. వైసీపీ పాలనలో చారిత్రాత్మక సబ్ ప్లాన్ చట్టం నిర్వీర్యం అయిపోతోంది. ఇది ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల పట్ల చూపుతున్న వివక్షకు నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం వారి కులాల గురించి నోరువిప్పలేని పరిస్థితి ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరికి నిదర్శనం. దళితుల ఆత్మగౌరవానికి ఏ మాత్రం విలువ ఇవ్వని ప్రభుత్వం వైసీపీదే. దళితుల ఓట్లతో గద్దెనెక్కి దళితులకు అన్యాయం చేస్తున్నారు” అన్నారు.
•జగన్ పోవాలి.. పవన్ రావాలి’ శ్రీ మోహన్ కుమార్ ధర్మ
ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు శ్రీ మోహన్ కుమార్ ధర్మ మాట్లాడుతూ “ఈ ముఖ్యమంత్రి జైలు నుంచి వచ్చి పాదయాత్ర చేసి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని నమ్మించాడు. మోసపోయి ఓట్లు వేశాం. ఓట్ల వేస్తే గత ప్రభుత్వాలు మాకిచ్చిన భూములు లాక్కుని లే అవుట్లు వేస్తున్నారు. మా దగ్గర డబ్బులు తీసుకుని రైతులకు ఇస్తున్నాడు. ఏం చేసినా మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడితే కేసులు పెడతారు. మా గిరిజనుల ఉన్నతికి ఉన్న ఒక్క బెస్ట్ ఆప్షన్ కూడా తీసేశారు. మైదాన ప్రాంత గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పాలకుల నేరాలు- ఘోరాలు ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇది ప్రజాస్వామ్యమా? ఇలాంటి ప్రభుత్వాలు కొనసాగాలా? అందుకే అంతా మనస్ఫూర్తిగా జగన్ పోవాలి పవన్ రావాలని కోరుకుందామ”న్నారు.
•అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు: శ్రీ కుడుముల రామచంద్రయ్య
యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ కుడుముల రామచంద్రయ్య మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వంలో సబ్బూ లేదు.. ప్లానూ లేదు అన్న చందంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ని నిర్వీర్యం చేసింది. నిధులన్నింటినీ వెనుక నుంచి తీసుకువెళ్లి సబ్ ప్లాన్ పరిధిలోకి రాని వాటికి ఖర్చు చేస్తున్నారు. చివరికి ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించే అట్రాసిటీ కేసుల్లో కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేసి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దమ్మున్న నాయకుడితో పని చేయించుకోలేకపోతే దద్దమ్మలైపోతాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి పోరాటం చేద్దామ”న్నారు.
•రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ విలువలు కోల్పోయింది: శ్రీ పాటిబండ్ల ఆనందరావు
ప్రముఖ థియేటర్ పర్సనాలిటీ శ్రీ పాటిబండ్ల ఆనందరావు మాట్లాడుతూ “నిధుల్ని దారుణంగా దారి మళ్లించి అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతుంటే ప్రశ్నించే వారు లేరు. ఆంధ్రప్రదేశ్ లో సమాజం దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. రాజకీయ వ్యవస్థ విలువలు కోల్పోయింది. బాగు చేయడం సాధ్యపడని ఈ పరిస్థితుల్లో ప్రజల్లో ధైర్యం నింపే వ్యక్తి ఈ సమాజానికి అవసరం. అలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పురుడు పోసుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనే బిడ్డను కన్నది. ఆయన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంద”న్నారు.
•మీ ప్రభుత్వంలో సబ్ ప్లాన్ నిధులపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి: శ్రీ పాల్ దివాకర్
ప్రముఖ దళిత హక్కుల నాయకులు శ్రీ పాల్ దివాకర్ మాట్లాడుతూ “ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు పెట్టాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయి. గత ఎనిమిదేళ్లలో లెక్కలు పరిశీలిస్తే కేటాయించిన నిధుల్లో 38 శాతం మాత్రమే పథకాల రూపంలో లబ్దిదారులకు చేరాయి. రూ. లక్షా 54 వేల కోట్లకు మాకు చేరింది రూ. 34 వేల కోట్లు మాత్రమే. ఇప్పుడు ఈ లెక్కలు మరింత దిగజారిపోయాయి. ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన నిధులు వారికి మాత్రమే అందేలా చూడాల్సిన బాధ్యత మీరు తీసుకోండి. మీ ప్రభుత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ప్రభుత్వం అబద్దాలు చెబుతోంది. మీరు నిజాలు బయటపెట్టండి. మీరు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నాం. మీరు రాకున్నా మా బాధ్యత తీసుకోండి” అన్నారు.
•మూడు సెంట్లు లాక్కుని సెంటు ఇస్తున్నారు: శ్రీ తాడి మోహన్
పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ తాడి మోహన్ మాట్లాడుతూ “దళితులకు మేనమామను అని చెప్పిన ముఖ్యమంత్రి 27 పథకాలు రద్దు చేసి దగా చేశారు. సబ్ ప్లాన్ నిధులన్నీ నవరత్న పథకాలకు మళ్లించుకుంటున్నారు. దళితుల్ని ఉద్దరించామని చెబుతున్న ముఖ్యమంత్రి విదేశీ విద్యను నిర్వీర్యం చేశాడు. ఎక్కడ చూసినా దళితుల ఆకలి చావులు, శిరోముండనాలు, ఆత్మహత్యలు చూస్తున్నాం. వివక్ష లేదని ఎలా చెబుతారు. దళితులకు మేనమామనని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ 40 ఏళ్ల క్రితం మాకిచ్చిన మూడు సెంట్ల భూమి లాక్కుని సెంటు భూమి అంటగడుతున్నారు” అన్నారు. సదస్సులో తటస్థ మేధావి వర్గాల ప్రతినిధులు శ్రీ ఇమ్మడి విజయ్ పాల్, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శ్రీ వడ్డాది అప్పలరాజు, పార్టీ నాయకులు శ్రీ డిఎంఆర్ శేఖర్, డాక్టర్ పొన్న యుగంధర్, శ్రీ బోడపాటి శివదత్, శ్రీ సువర్ణ రాజు తదితరులు ప్రసంగించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శలు, జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లాల కార్యవర్గం సభ్యులు సదస్సులో పాల్గొన్నారు.