జనసేన టిడిపి కలిస్తే వైసీపీకి ఉలుకెందుకు??

  • మంత్రులు తమ సమయాన్ని వారి శాఖల అభివృద్ధికి కేటాయించాలి
  • చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి టీడీపీకి ప్రజా బలాన్ని పెంచిన వైసీపీ
  • నిత్యవసర సరుకుల ధరలు విద్యుత్ చార్జీలు తగ్గించాలి
  • జ్వరాలు అదుపుకు చర్యలు చేపట్టాలి
  • కొత్త రోడ్లు వేయలేకపోయినా… కనీసం గోతులు పూడ్చాలి
  • సిపిఎస్, జిపిఎస్ రద్దుచేసి ఓ.పి.ఎస్. ను తీసుకురావాలి
  • అంగన్వాడి, మున్సిపల్ వర్కర్లను సమస్యలు పరిష్కరించాలి
  • టిడిపి నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం: జనసేన, టిడిపి కలిస్తే వైసీపీకి ఉలికెందుకని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు ప్రశ్నించారు. మంగళవారం పార్వతీపురం పట్టణంలోని కొత్తవలసలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ బోనెల విజయ్ చంద్ర, పట్టణ అధ్యక్షులు గుండ్రెడ్డి రవి, సీనియర్ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు తదితరుల ఆధ్వర్యంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్, జనసేన టిడిపి పొత్తు ప్రకటించినప్పటి నుండి వైసీపీ శ్రేణులకు నిద్ర పట్టే పరిస్థితి లేదనేది స్పష్టం అవుతుందన్నారు. ఎందుకంటే పొత్తు ప్రకటించినప్పటి నుండి మంత్రులు వైసీపీ నాయకులు జనసేన టిడిపి కలిసిపోయిందో.. కలిసిపోయిందంటూ గుండెలు బాదుకుంటూ గగ్గోలు పెడుతున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి తెలుగుదేశం పార్టీకి ప్రజాబలాన్ని పెంచిందన్నారు. ఒకవైపు జనసేన టిడిపి పొత్తు ప్రకటించే విషయంలో పరోక్షంగా వైసిపి సహకరించిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చక్కని విజనరీ కలిగిన చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసే తీరును రాష్ట్ర ప్రజలందరూ చూశారని, అనుకోకుండానే తెలుగుదేశం పార్టీకి సానుభూతితో పాటు ప్రజాబలం పెంచారన్నారు. దీనికి కూడా వైసీపీ పరోక్షంగా కారణమన్నారు. అలాగే దేశంలో ఉన్న మేధావులు రాజకీయ పెద్దలు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించడంతో ఇది స్పష్టమైందన్నారు. కొందరు మంత్రులు అదేపనిగా జనసేనాని పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత ఆరోపణలకు దిగడం సరికాదన్నారు. దానికోసం కేటాయించిన సమయాన్ని వారి శాఖల అభివృద్ధికి కేటాయించి, తాము సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం సామాన్యుడికి, మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో లేని విధంగా పెరిగిన నిత్యవసర సరుకులు ధరలు తగ్గించేందుకు తమ తెలివితేటలు వినియోగించాలన్నారు. కొత్త రోడ్లు ఎలాగూ వేయలేకపోయినా కనీసం గోతులు పూర్చే కార్యక్రమం అయినా చేసి ప్రజలు తమకు ఇచ్చిన అమూల్యమైన అవకాశానికి రుణం తీర్చుకోవాలన్నారు. కొత్త ఆర్టీసీ బస్సులు కొని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించాలన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సిపిఎస్, జిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను తీసుకురావాలన్నారు. అంగన్వాడి, మున్సిపల్ వర్కర్లు, మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించి రైతులకు సాగునీరు ఇవ్వాలన్నారు. వర్షాకాలంలో విద్యుత్ కోతలు విధించే దౌర్భాగ్యం రాష్ట్రంలో నెలకొందని అవి లేకుండా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాలలో డోలి బాధలు లేకుండా చూడాలన్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలు, పెట్రోల్ ధరలు తగ్గించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయని వాటి అదుపుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులు, ప్రజా పాలనపై దృష్టి సారించాలి, తప్ప కక్షపూరిత రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలు చేయడం ఆరోగ్యకరమైన రాజకీయం కాదని, మంత్రులు తమ హోదాకు తగ్గట్టు మసులుకోవాలని హితువు పలికారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి లకు అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర అప్పుల ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగిత, వెనుకబడిన విషయాన్ని ప్రజలు ఏనాడో గుర్తించారన్నారు. మరి కొద్ది నెలల్లో అధికారం కోల్పోబోతున్న వైసిపి ప్రభుత్వం ఉన్న కొద్ది నెలల్లోనైనా ప్రజలకు మంచి పాలన అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి కరుణ తదితరులు పాల్గొన్నారు.