ప్రభుత్వ పథకాలు అందడం లేదని చెబితే కేసులు పెడతారా?

•పూతలపట్టు జన సైనికులపై అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి
గడప గడపకు కార్యక్రమంలో తమకు రావాల్సిన సంక్షేమ పథకాలు రావడం లేదన్న విషయాన్ని శాసన సభ్యులకు విన్నవించుకున్న వారి మీద అక్రమ కేసులు నమోదు చేయడం భావ్యం కాదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో హితవు పలికారు. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, వేపనపల్లి గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు శ్రీ ఎం.ఎస్.బాబు దృష్టికి తమకు సంక్షేమ పథకాలు అందటం లేదని చెబితే కేసులుపెట్టి వేధించడం అప్రజాస్వామికం. జనసేన పార్టీ కుటుంబానికి చెందిన ఐనా జశ్వంత్ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీస్తే సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారన్న అక్కసుతో 16 ఏళ్ళ ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం. జశ్వంత్ కుటుంబానికి మద్దతుగా వెళ్లిన మా పార్టీ నాయకుల మీద అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు మోపడం వైసీపీ ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో తెలియచేస్తుంది. గడప గడపకు కార్యక్రమంలో ప్రశ్నించిన వారిపై ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపులకు దిగడం, జనసేన పార్టీ మద్దతుదారులకు వైసీపీ పథకాలు అందవని శాసన సభ్యుడే బాహాటంగా చెప్పడం అధికార పార్టీ దాష్టికాలకు అద్ధం పడుతున్నాయి. పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అక్రమ కేసులో అరెస్టు అయిన పార్టీ నాయకులకు జనసేన పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలా అండగా ఉంటుంది. ఏ ఒక్కరూ అధైర్య పడవద్దని నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు.