ఓటుంటే పోటీ చేయొచ్చు!

  • చదువుకున్న యువత రాజకీయాలోకి రావాలి
  • 18 నిండిన వారంతా ఓటర్లుగా నమోదు కావాలి
  • ప్రతీ ఎన్నికల్లో యువత ఓటు కీలకం కావాలి
  • ఓటు అమ్ముడుపోనీ సమాజ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి
  • వ్యవస్థ మార్పుకై యువత చైతన్యం కావాలి
  • వేదశ్రీ ఒకేషనల్ కాలేజీ విద్యార్థులకు ఓటు నమోదు పై అవగాహన కల్పించిన జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం: రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం ఓటు ఉంటే ఆయా ఎన్నికల్లో పోటీ చేయొచ్చని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు అన్నారు. శుక్రవారం పార్వతీపురం పట్టణంలోని వేదశ్రీ ఒకేషనల్ కళాశాల విద్యార్థులకు ఓటు నమోదు కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అమూల్యమైనదన్నారు. మనల్ని పాలించే నాయకుల్ని ఓటు హక్కుతో ఎన్నుకోవచ్చు అన్నారు. వ్యవస్థను నాశనం చేసే నాయకుల్ని వజ్రాయుధం అనే ఓటుతో చీల్చి చండాడవచ్చని, వ్యవస్థను బాగు చేసే నీతి, నిజాయితీ కలిగిన నాయకులను అదే ఓటుతో ఎన్నుకోవచ్చు అన్నారు. మనల్ని పాలించే నాయకుల్ని మనం ఎన్నుకునే గొప్ప అవకాశాన్ని ఓటుహక్కు ద్వారా రాజ్యాంగం ప్రసాదించిందన్నారు. కాబట్టి ఎన్నికల కమిషన్ సూచన ప్రకారం 2024 జనవరి 1 తేదీ నాటికి 18 ఏళ్ల నిండిన ప్రతి యువతి యువకులు ఓటరుగా నమోదు కావాలన్నారు. తమ ఓటు నమోదు కోసం వయస్సును ధ్రువీకరించే పదో తరగతి సర్టిఫికెట్ తో పాటు ఆధార్ కార్డు తల్లి లేదా తండ్రి ఓటు కార్డు జిరాక్స్ కాపీలతో పాటు రెండు పాస్పోర్టు సైజ్ ఫోటోలతో ఫారం సిక్స్ దరఖాస్తు తో ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు నమోదు కార్యక్రమానికి సంబంధించి బిఎల్ ఓ స్థాయి అధికారం నుండి జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి వరకు పలు రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. కాబట్టి యువత చైతన్యవంతమై ఓటరుగా ఓటు నమోదు చేసుకోవటాన్ని బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఓటు ఉంటే ఓటు వేయటానికే కాకుండా రాజ్యాంగం కల్పించిన నియమ నిబంధనల ప్రకారం పంచాయతీ సర్పంచ్ స్థాయి నుండి వార్డు మెంబరు గా ఎంపిటిసి, ఎంపీపీ, మున్సిపల్ చైర్ పర్సన్, జడ్పిటిసి, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ తదితర పదవులకు పోటీ చేయొచ్చు అన్నారు. చదువుకున్న యువత నీతి నిజాయితీలు కలిగి సమాజాభివృద్ధికి పాటుపడే వారు రాజకీయాల్లోకి రావాలన్నారు. ప్రతి ఎన్నికల్లో యువత ఓటు కీలకం కావాలన్నారు. ఓటు అమ్ముడుపోని సమాజ నిర్మాణానికి యువతే శ్రీకారం చుట్టాలన్నారు. వ్యవస్థ మార్పు కోసం యువత చైతన్యవంతమై మొదట తమ ఓట్లు నమోదు చేసుకొని, ఆ ఓటు అనే వజ్రాయుధముతో దేశ భవిష్యత్తును మార్చగలిగేలా అవగాహన పొందాలన్నారు. కల్మషం లేని మంచి సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓటు నమోదు ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, బిఎల్ఓ వద్ద ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.