చెరువుల్లో అక్రమ నిర్మాణాలు తొలగించరా..?!

  • పత్రికలు ఘోష పెడుతున్నా వినిపించదా…?
  • తీసుకున్న జీతానికైనా పని చేయరా…?
  • సంబంధిత అధికారులపై ధ్వజమెత్తిన ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నాయకులు

పార్వతీపురం: చెరువుల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించరా…? అని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నాయకులు ప్రశ్నించారు. శనివారం పార్వతీపురం పట్టణంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రఘు సత్య సింహ చక్రవర్తి, పార్వతీపురం మండల అధ్యక్షులు బలగ శంకర్రావు, సీతానగరం మండల అధ్యక్షులు పాటి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో దాదాపు చెరువులన్నీ కబ్జాకు గురవుతున్నాయన్నారు. దీనిలో భాగంగా పార్వతీపురం పట్టణంలోని ఆయా చెరువులను కబ్జాదారులు దర్జాగా కబ్జా చేసి పెద్దపెద్ద భవనాలను అక్రమంగా నిర్మిస్తున్నారన్నారు. ఈ విషయమై పత్రికలు ఘోష పెడుతున్నప్పటికీ సంబంధిత అధికారుల చెవికి ఎక్కడం లేదన్నారు. రెవెన్యూ మున్సిపాలిటీ సచివాలయ ఇరిగేషన్ అధికారులు సిబ్బంది ఆక్రమణదారులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు విలువైన ప్రభుత్వ చెరువులను కానరాకుండా చేస్తున్న చర్యలు చేపట్టడం లేదన్నారు. కనీసం తీసుకున్న జీతానికైనా ప్రభుత్వ స్థలాలను చెరువులను రక్షించేందుకు పనిచేయాలన్నారు. చెరువులు కనుమరుగైతే భావితరానికి నీటి చుక్క దొరికే పరిస్థితి ఉండదన్నారు. ఇక జాలజీవరాసులు తాగునీటికై ఇబ్బందులు పడే రోజులు రానున్నాయన్నారు. పార్వతిపురం మున్సిపాలిటీలోని నెల్లిచెరువు, లంకెల చెరువు, దేవుని బంధ, కోదువాని బంధ, లక్ష్మనాయుడు చెరువు తదితర దాదాపు 40 చెరువులు కబ్జాకు గురవుతున్నాయన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలోని నెల్లిచెరువు, లక్ష్మి నాయుడు చెరువు తదితర వాటిలో పక్కా నిర్మాణాలు జరుగుతున్న సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రభుత్వ చెరువుల్లో ఇల్లు కడితే వాటికి రెవెన్యూ అధికారులు పట్టాలు ఎలా ఇస్తారో, కరెంట్ అధికారులు మీటర్లు ఏ విధంగా మంజూరు చేశారు. మున్సిపల్ అధికారులు ఏ విధంగా పన్నులు వేస్తారో ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆయా కబ్జాకు గురైన చెరువుల పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ సచివాలయ అధికారులను సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే చెరువులను కబ్జా చేసి పక్కా భవనాలు నిర్మిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని, భవనాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులకు కనీసం పట్టకపోవడం బాధాకరమన్నారు. గౌరవ న్యాయస్థానాల ఆదేశాలు సైతం అధికారులు అమలు చేయకపోవడం సూచనీయమన్నారు. కేవలం నోటీసులు హెచ్చరిక బోర్డులతో సరి పెడితే కుదరదని స్పష్టం చేశారు.