విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మద్దతుగా నేను సైతం అంటున్న మెగాస్టార్

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తెలుగు సినీ పరిశ్రమ స్పందించింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. పోరాటానికి మద్దతు పలికారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న పరిశ్రమ ప్రైవేట్‌పరం కాబోతోంది. ఓ వైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం తన వైఖరి నుంచి వెనక్కి తగ్గడం లేదు. వరుసగా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణపై పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి.పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గమని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ప్రధాని మోదీకు రెండోసారి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనపై విశాఖలో ఉద్యోగ, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయన్నారు. విశాఖ ఉక్కుకు దేశంలోనే ఓ ప్రత్యేకత ఉందని తెలిసి గర్వించామన్నారు.

లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిని విశాఖ ఉక్కును ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేం‍ద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని సూచించారు. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయమైన హక్కు అని.. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందామని ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో బిజీగా ఉన్నారు.